నందమూరి అభిమానులూ.. సంబరాలకు సిద్ధమేనా!
on Aug 5, 2024

నందమూరి అభిమానులకు ఉన్న ఒకే ఒక ఆశ మోక్షజ్ఞ హీరోగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వాలని. నందమూరి నట వారసుడిగా తాతయ్యపేరు, తండ్రి పేరు నిలబెట్టాలన్నది వారి చిరకాల వాంఛ. ఎంతోకాలంగా ఆ శుభ ఘడియ కోసం ఎదురుచూస్తున్నారు అభిమానులు. మోక్షజ్ఞ హీరోగా ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యబోతున్నారన్న వార్త కొన్నిరోజులుగా వినిపిస్తోంది. ఇందులో హీరోయిన్ శ్రీదేవి రెండో కూతురు ఖుషి నటించే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. అయితే ఈ నందమూరి యంగ్ హీరోని ప్రేక్షకులకు, అభిమానులకు ఎప్పుడు పరిచయం చేస్తారనేదే అందరి మనసులో మెదులుతున్న ప్రశ్న.
నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో సెప్టెంబర్ 1న ఒక భారీ ఈవెంట్‌ని ప్లాన్ చేసింది టాలీవుడ్. ఈ సందర్భంగా ఆయనకు ఘన సత్కారం జరగబోతోంది. దీని తర్వాత సెప్టెంబర్ 6న మోక్షజ్ఞ పుట్టినరోజు వేడుకను అభిమానులు ఘనంగా జరపబోతున్నారు. ఇదే వేదికపై నందమూరి మోక్షజ్ఞ పరిచయ కార్యక్రమం కూడా ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాకి సంబంధించిన వివరాలను, విశేషాలను అదే వేదికపై ప్రకటిస్తారని సమాచారం.
డిఫరెంట్ కథాంశాలతో సినిమాలను రూపొందించడం ప్రశాంత్ వర్మ స్టైల్. ‘హనుమాన్’తో ఒక సూపర్ హీరో సినిమా రూపొందించిన ప్రశాంత్ ఈ సినిమా కోసం మరో డిఫరెంట్ కథను రెడీ చేస్తున్నాడట. ఇందులో బాలయ్య కూడా ఒక స్పెషల్ రోల్ చేసే అవకాశం ఉందట. అంటే తండ్రీ కొడుకులు ఒకే స్క్రీన్‌పై కనిపిస్తారన్నమాట. ఇదే జరిగితే నందమూరి అభిమానుల ఆనందానికి పట్టపగ్గాలు ఉండవు. ఏది ఏమైనా మోక్షజ్ఞను మాత్రం సెప్టెంబర్ 1న జరిగే కార్యక్రమంలో పరిచయం చేయడం మాత్రం పక్కా. దాని కోసమే ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న నందమూరి అభిమానులు సంబరాలు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



