సీతాదేవిగా, మండోదరిగా నటించి మెప్పించిన ఘనత సరోజాదేవి సొంతం!
on Jul 14, 2025
ప్రముఖ నటి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత బి. సరోజాదేవి (87) కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. సరోజాదేవి మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. (B Saroja Devi)
"దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఒకనాడు ధ్రువతారగా వెలుగొందిన ప్రముఖ నటీమణి "పద్మభూషణ్" బి. సరోజాదేవి గారు పరమపదించారన్న వార్త అత్యంత బాధాకరం. అప్పట్లో తెలుగులో NTR గారితో, తమిళంలో MGR గారితో, కన్నడంలో రాజ్ కుమార్ గారితో ఏకకాలంలో హిట్ పెయిర్ గా వెలుగొందిన ఘనత ఆమెది. మా తండ్రి NTR గారి కాంబినేషన్లో 20 సంవత్సరాల కాలంలో దాదాపు 20 చిత్రాలలో హీరోయిన్ గా నటించారు. ఆయనతో శ్రీరాముడి ప్రక్కన సీతాదేవిగా, రావణాసురుడి ప్రక్కన మండోదరిగానూ నటించిన ప్రత్యేకత ఆమె సొంతం. శ్రీమతి బి. సరోజా దేవి మరణం భారతీయ చిత్ర పరిశ్రమకు, ముఖ్యంగా దక్షిణ భారత చిత్ర పరిశ్రమకు తీవ్ర విచారకరమైన పరిణామం. ఆమె వెండితెరపై మరియు నిజజీవితంలో చేసిన సేవలు రాబోయే తరాల తారలకు, చలనచిత్ర వర్గాల వారికి స్ఫూర్తినిస్తాయి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను." అని నందమూరి బాలకృష్ణ అన్నారు.
"ప్రముఖ నటి శ్రీమతి బి.సరోజాదేవి గారు కన్నుమూశారని తెలిసి బాధపడ్డాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. 1955 నుంచి దాదాపు మూడు దశాబ్దాలపాటు తెలుగు, కన్నడ, తమిళ భాషా చిత్రాల్లో నటించి చిత్ర సీమపై తనదైన ముద్రను వేశారు. భూకైలాస్, పాండురంగ మహత్యం, సీతారామ కళ్యాణం, జగదేకవీరుని కథ, శకుంతల, దానవీర శూర కర్ణ, ఆత్మబలం లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. శ్రీమతి బి.సరోజా దేవి గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను." అని పవన్ కళ్యాణ్ అన్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
