ENGLISH | TELUGU  

వాటిలో నా పేరు లాగ‌డం బాధ‌గా అనిపించింది! ఓపెన్ అయిన చైతూ!!

on Sep 23, 2021

 

కెరీర్ తొలినాళ్ల‌లోనే ప‌ర్స‌న‌ల్ లైఫ్‌, ప్రొఫెష‌న‌ల్ లైఫ్‌ను వేర్వేరుగా చూడ్డం మొద‌లుపెట్టాననీ, రెండింటినీ ఎప్పుడు మిక్స్ చేయ‌ననీ తెలిపారు హీరో నాగ‌చైత‌న్య‌. "దీన్నొక అల‌వాటుగా చేసుకున్నాను. బ‌హుశా ఇది నా త‌ల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నాన‌నుకుంటాను. ఆ ఇద్ద‌రూ ప‌ని చేసుకొని ఇంటికి వ‌చ్చాక ఎప్పుడూ ప‌ని గురించి మాట్లాడుకోరు. ప‌నిలోకి వెళ్తే ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి ఆలోచించ‌రు. అలా ఇద్ద‌రూ ప్రొఫెష‌న‌ల్ లైఫ్‌, ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ వ‌చ్చేవారు." అని ఆయ‌న‌ చెప్పారు.

లేటెస్ట్‌గా ఒక ఇంగ్లిష్ యూట్యూబ్ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న సోష‌ల్ మీడియా గురించీ, టీఆర్పీల కోసం చాన‌ల్స్ చేసే ప్ర‌చారం గురించీ మాట్లాడారు. "అదృష్ట‌మో, దుర‌దృష్ట‌మో నేనెక్కువ‌గా సోష‌ల్ మీడియాను ఫాలో కాను. నాకు సంబంధించిన విష‌యాల‌న్నీ న్యూస్ పేప‌ర్స్ ద్వారానో, శ్రేయోభిలాషులు చెప్ప‌డం ద్వారానే జ‌నానికి తెలుస్తుంటాయి. ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల కోసం నేనెక్కువ టైమ్ వెచ్చించ‌ను. అది నాకు కొంత హెల్ప్ చేస్తుంద‌నుకుంటాను." అన్నారు చైత‌న్య‌.
 
తాను కూడా ఒకటి, రెండేళ్ల క్రితం సోష‌ల్ మీడియా కార‌ణంగా ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యానని ఆయ‌న ఒప్పుకున్నారు. "క‌రోనా మ‌హ‌మ్మారి న‌న్ను మ‌రో డైరెక్ష‌న్ వైపు మ‌ళ్లించింది. దాంతో సోష‌ల్ మీడియా నుంచి పూర్తిగా దూర‌మ‌య్యాను. ఫ‌స్ట్ లాక్‌డౌన్ టైమ్‌లో ఎక్కువ‌గా సోష‌ల్ మీడియాను ఫాలో అయ్యేవాడ్ని. ఒక‌రోజు 'నేనేం చేస్తున్నాను.. నేను చూసే విష‌యాలు నాకేమైనా ఉప‌యోగ‌ప‌డుతున్నాయా, సాయ‌ప‌డుతున్నాయా' అని ఆలోచించాను. 'ఇది న‌న్ను స‌రైన మార్గంలోనే తీసుకుపోతోందా' అని ఆలోచించాను. అలా న‌న్ను నేను ప్ర‌శ్నించుకొని, సోష‌ల్ మీడియాకు దూరంగా ఉంటూ వ‌స్తున్నా. నాకు ఇష్ట‌మైన విష‌యాల‌పై దృష్టి పెడుతూ వ‌స్తున్నా. ఉదాహ‌ర‌ణ‌కు మంచి బుక్స్ ఏవి వ‌స్తున్నాయో తెలుసుకొని, వాటిని చ‌ద‌వ‌డం, ఇంట్రెస్టింగ్ యూట్యూబ్ వీడియోస్ చూడ్డం లాంటివి." అని చెప్పారు చైతూ.

త‌మ టీఆర్పీల కోసం కొన్ని చాన‌ల్స్‌ మీ గురించి త‌ప్పుడు వార్త‌లు ప్ర‌సారం చేసిన‌ప్పుడు ఎలా అనిపించేది అనే ప్ర‌శ్న‌కు, "కొన్ని విష‌యాల్లో నా పేరు లాగ‌డం మొద‌ట్లో బాధ‌గా అనిపించేది. ఇవాళ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అనేది ఈ దిశ‌లోనే వెళ్తోంది. ఇవాళ్టి రోజుల్లో న్యూస్‌ను న్యూసే రిప్లేస్ చేస్తున్నాయి. ఈరోజు ఒక వార్త హెడ్‌లైన్స్‌లో ఉంటే రేపు ఇంకో న్యూస్ ఉంటుంది. మా తాత‌గారి టైమ్‌లో మేగ‌జైన్స్ ఉండేవి. వారానికో, నెల‌కో ఓసారి అందులో వార్త‌లు వ‌చ్చేవి. త‌ర్వాత సంచిక వ‌చ్చేదాకా ఆ వార్తే చ‌లామ‌ణిలో ఉండేది. ఈరోజు ఆ ప‌రిస్థితి లేదు. ఇప్పుడు ఒక న్యూస్ వ‌స్తే, ఇంకో సెక‌నులోనో, ఇంకో నిమిషంలోనో ఇంకో వార్త వ‌చ్చేస్తోంది. ఇప్పుడు ఏ వార్త‌యినా ఎక్కువ సేపు జ‌నం మ‌న‌సుల్లో ఉండ‌ట్లేదు. నిజ‌మైన వార్త‌లు మాత్ర‌మే స్థిరంగా ఉంటున్నాయి, టీఆర్పీని పెంచుకోవ‌డానికి సృష్టించే అభూత క‌ల్ప‌న‌లను జ‌నం మ‌ర్చిపోతున్నారు." అని చైత‌న్య చెప్పారు.

ఒక‌సారి ఈ విష‌యం గ్ర‌హించాక‌, అలాంటి వార్త‌లను తాను ప‌ట్టించుకోవ‌డం మానేశానన్నారు. "కొంత‌మంది ఎంట‌ర్‌టైన్‌మెంట్ కోస‌మే అలాంటి న్యూస్ ఇస్తున్నామంటారు. అవి ఎలా ఎంట‌ర్‌టైన్ చేస్తాయ‌నేది వాళ్ల‌కే తెలియాలి. దానిపై నేను కామెంట్ చేయ‌ను. ఎందుకంటే నేను కూడా ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇండ‌స్ట్రీలోనే ఉన్నాను, జ‌నాన్ని ఎంట‌ర్‌టైన్ చెయ్య‌డానికే ఉన్నాను." అని త‌న మ‌నోభావాలు బ‌య‌ట‌పెట్టారు చైతూ.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.