ENGLISH | TELUGU  

'బ్రో' సినిమాలో కొత్త పవన్ కళ్యాణ్ ని చూస్తాం!

on Jul 10, 2023

పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్  కలయికలో పి. సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'బ్రో'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే,  డైలాగ్స్ అందిస్తున్నారు. జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ఇతర ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల 'మై డియర్ మార్కండేయ' పాట విడుదలై మెప్పించింది. ఈ నేపథ్యంలో తాజాగా విలేకర్లతో ముచ్చటించిన థమన్ బ్రో సినిమాకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

రీమేక్ సినిమాలకు సంగీతం అందించడం అనేది ఛాలెంజ్ కదా?
ఎవరెస్ట్ ని అధిరోహించడం లాంటిది. నాకు పవన్ కళ్యాణ్ గారితో మూడు సినిమాలూ రీమేక్ లే వచ్చాయి. వకీల్ సాబ్ గానీ, భీమ్లా నాయక్ గానీ, బ్రో గానీ సంగీతం పరంగా నేను చేయాల్సింది చేస్తున్నాను. సాంగ్స్ సినిమాకి హెల్ప్ చేస్తాయి. వకీల్ సాబ్ లో మగువ మగువ వంటి పాటని కూడా మాసీగా ఫైట్ కి ఉపయోగించాం. బ్రో అనే సినిమా విడుదలయ్యాక ఎంతోమందిని కదిలిస్తుంది. హత్తుకునే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. స్క్రీన్ ప్లే,  డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయి. త్రివిక్రమ్ గారి రచన సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే సహజంగానే సినిమా స్థాయి పెరుగుతుంది.

మాతృక ప్రభావం మీ సంగీతంపై ఉందా?
ఒరిజినల్ ఫిల్మ్ లో పాటల్లేవు. నేపథ్య సంగీతం మాత్రం బాగా చేశారు. అక్కడ ఆ పాత్ర సముద్రఖని గారు చేశారు కాబట్టి అది సరిపోతుంది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఇంకా ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆయన తెర మీద కనిపిస్తే చాలు సంగీతం అడిగేస్తాం. అందుకే బ్రో శ్లోకం స్వరపరిచాం. నేపథ్య సంగీతం పరంగా అయితే చాలా సంతోషంగా ఉన్నాను. ఉన్నత స్థాయిలో ఉంటుంది. 

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ గార్ల కలయికలో పాట అంటే ఏమైనా ఛాలెంజింగ్ గా అనిపించిందా?
ఆ పాటను మాస్ గా చేయలేము. సామెతలు లాగానే చెప్పాలి. ప్రత్యేక గీతాలు లాంటివి స్వరపరచలేము. ఇది అలాంటి సినిమా కాదు. కొన్ని పరిధులు ఉన్నాయి. కాలం ఎంత ముఖ్యం అనే దానిపై ఒక ప్రమోషనల్ సాంగ్ చేస్తున్నాం. త్వరలో తేజ్ డ్యూయట్ సాంగ్ ఒకటి రానుంది. అలాగే శ్లోకాలను అన్నింటినీ కలిపి ఒక పాటలా విడుదల చేయబోతున్నాం. అంతేకాకుండా క్లైమాక్స్ లో ఒక మాంటేజ్ సాంగ్ కి సన్నాహాలు చేస్తున్నాం. మొత్తం నాలుగు పాటలు ఉంటాయి. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ అద్భుతంగా నటించారు. సినిమాలో చాలా సర్ ప్రైజ్ లు ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ గారికి మ్యూజిక్ చేయడం ప్లెజరా? ప్రెజరా?
ఒక అభిమానిగా ప్లెజర్, అభిమానుల నుంచి ప్రెజర్(నవ్వుతూ). అలాంటి ఒత్తిడి ఉన్నప్పుడే మన అనుభవం సహాయపడుతుంది. సినిమాని బట్టి సంగీతం ఉంటుంది. 'భీమ్లా నాయక్' సినిమాలో మాస్ పాటలకు ఆస్కారం ఉంది కాబట్టి, 'లా లా భీమ్లా' వంటి పాటలు చేయగలిగాము. 

ఈ సినిమా విషయంలో మీరు సలహాలు ఏమైనా ఇచ్చారా?
లేదండీ. ఇది మనం ఊహించే దానికంటే పెద్ద సినిమా. త్రివిక్రమ్ గారు స్క్రీన్ ప్లే రాసి చెప్పినప్పుడే అందరికీ రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఈ సినిమా అందరినీ కదిలిస్తుంది. కుటుంబ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. జీవితం అంటే ఏంటో తెలిపేలా ఉంటుంది. సున్నితమైన అంశాలు ఉంటాయి. తేజ్ కొన్ని కొన్ని సన్నివేశాలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు, తేజ్ మధ్య ఎంత మంచి అనుబంధం ఉంటుందో అది మనకు తెర మీద కనిపిస్తుంది. బ్యూటిఫుల్ గా ఉంటుంది. 

తమ్ముడు సినిమాలోని వయ్యారి భామ సాంగ్ వస్త్రధారణలో పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు కదా.. ఆ సన్నివేశం గురించి చెప్పండి?
మీరు సినిమా చూడండి. ప్రతి సన్నివేశం నచ్చుతుంది. పవన్ కళ్యాణ్ చాలా బాగా చేశారు. చాలారోజుల తర్వాత నేను వేరే పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాను ఈ సినిమాలో. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలకు పూర్తి భిన్నంగా కొత్త పవన్ కళ్యాణ్ గారిని చూస్తాం. 

మీ సంగీతం ఎలా ఉండబోతుంది?
భీమ్లా నాయక్ తరహాలో బ్రో సినిమాలో మాస్ పాటలు ఉండవు. సినిమాకి ఎలాంటి పాటలు అవసరమో అలాంటి పాటలు స్వరపరుస్తాను. సంగీతమైనా, సాహిత్యమైనా సినిమాలోని సందర్భానికి తగ్గట్టుగానే ఉంటాయి. సముద్రఖని గారు, త్రివిక్రమ్ గారు లాంటి దిగ్గజాలు ఉన్నారు. ఈ కథలో ఏం కావాలో, ఎలాంటి పాట రావాలో వారికి తెలుసు. దానికి తగ్గట్టుగానే పాటలు ఉంటాయి. బ్రో సినిమాలో పాటల్లోనూ, నేపథ్య సంగీతంలోనూ కొత్తదనం కనిపిస్తుంది. దర్శకనిర్మాతలతో పాటు ఇతర చిత్ర బృందం ఇప్పటికే ఈ చిత్రం చూసి నేపథ్య సంగీతానికి కంటతడి పెట్టుకున్నారు. మేమందరం సినిమా పట్ల, సంగీతం పట్ల చాలా సంతోషంగా ఉన్నాం.

సోషల్ మీడియా ట్రోల్స్ ని పట్టించుకుంటారా?
ట్రోల్స్ చూస్తునే ఉంటాను. అందులో మంచిని తీసుకుంటాను , చెడుని పక్కన పెట్టేస్తాను. ప్రశంసలు తీసుకున్నప్పుడు, విమర్శలు కూడా తీసుకోగలగాలి. నేను సంగీతం మీద ఎంత శ్రద్ధ పెడతానో, సంగీతం కోసం ఎంతో కష్టపడతానో మా దర్శక నిర్మాతలకు తెలుసు. కొందరేదో కావాలని సోషల్ మీడియాలో విమర్శలు చేస్తే, మనం వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

'గుంటూరు కారం' సినిమా గురించి చెప్పండి?
ఆరు నెలల నుంచి దాని మీద పని చేస్తున్నాం. బయట జరిగే అసత్య ప్రచారాలను పట్టించుకోకండి. ఏదైనా ఉంటే నిర్మాతలే అధికారికంగా ప్రకటిస్తారు. కావాలని ఎవరూ ఫ్లాప్ సినిమాలు చేయరు. కొన్ని సార్లు సినిమా ఆలస్యమవ్వడం అనేది సహజం. దానిని భూతద్దంలో పెట్టి చూస్తూ పదే పదే దాని గురించి రాయాల్సిన అవసరంలేదు.

ఒకేసారి ఇన్ని సినిమాలు ఎలా చేయగలుగుతున్నారు?
నేను ఈ స్థాయికి రావడానికి 25 ఏళ్ళు పట్టింది. నేర్చుకుంటూ, ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇంత దూరం వచ్చాను. ఒత్తిడిని తట్టుకొని పనిచేయడం నేర్చుకున్నాను. 2013-14 సమయంలోనే ఒకే ఏడాది నేను పని చేసిన పదికి పైగా సినిమాలు విడుదలయ్యాయి. ఎన్ని సినిమాలు చేతిలో ఉన్నా, నా వల్ల ఎప్పుడూ ఆలస్యం అవ్వదు. రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడి సమయానికి సంగీతం పూర్తి చేస్తాను. 

పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎలాంటి ప్రశంసలు అందుకున్నారు?
ఎన్నో సందర్భాల్లో మెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ గారికి సంగీతం అంటే చాలా ఇష్టం. 'గుడుంబా శంకర్' సమయంలోనే మణిశర్మ గారి అసిస్టెంట్ గా ఆయనను చాలా దగ్గర నుంచి చూశాను. ఆయనకు సంగీతం విషయంలో చాలా నాలెడ్జ్ ఉంది. 

సముద్రఖని గారితో పని చేయడం ఎలా ఉంది?
ఫస్టాఫ్ సినిమా చూసి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టాడని అందరికీ చెప్పేశారు. ఒక దర్శకుడు కన్నీళ్లు పెట్టుకోవడం నేను మొదటిసారి చూశాను. సినిమాలో అలాంటి అద్భుతమైన సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. ఆయన సినిమాని చాలా బాగా రూపొందించారు. ప్రస్తుతం సెకండాఫ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ జరుగుతుంది. ఇలాంటి సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించడం  చాలా కష్టం. ఆ ఎమోషన్స్ కి తగ్గట్టుగా చేయాలి.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.