ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పీలహిరి ఇకలేరు
on Feb 15, 2022

సంగీత దర్శకుడిగా, గాయకుడిగా దేశవ్యాప్తంగా గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న బప్పీలహిరి బుధవారం తెల్లవారుజామున ముంబైలోని క్రిటిక్ కేర్ హాస్పిటల్‌లో కన్నుమూశారు. ఆయన వయసు 69 సంవత్సరాలు. 1980, 90లలో డిస్కో మ్యూజిక్‌కు మనదేశంలో పాపులారిటీ తెచ్చిన సంగీతకారునిగా బప్పీలహిరి కీర్తి పొందారు.
"బప్పీలహిరి నెలరోజుల క్రితం హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి, సోమవారమే డిశ్చార్జ్ అయ్యారు. కానీ మంగళవారం ఆయన ఆరోగ్య స్థితి క్షీణించడంతో, ఆయనను చూపించడం కోసం కుటుంబసభ్యులు ఒక డాక్టర్ని ఇంటికి పిలిపించారు. ఆ తర్వాత ఆయనను హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. ఆయనకు పలురకాల ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఆయన ఓఎస్ఏ (అబస్ట్రక్టివ్ స్లీప్ అప్నియా) కారణంగా అర్ధరాత్రి తర్వాత తుదిశ్వాస విడిచారు" అని క్రిటిక్ కేర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ దీపక్ నామ్‌జోషి చెప్పారు.
హిందీలో అనేక సినిమాలకు సూపర్ డూపర్ సాంగ్స్ ఇచ్చిన బప్పీలహిరి.. సూపర్‌స్టార్ కృష్ణ సినిమా 'సింహాసనం'కు బ్లాక్‌బస్టర్ మ్యూజిక్ ఇవ్వడం ద్వారా తెలుగు చిత్రపరిశ్రమలో అడుగుపెట్టి, తన పాటలతో సంగీత ప్రియుల హృదయాలను దోచుకున్నారు. ఆ తర్వాత తేనె మనసులు, త్రిమూర్తులు, స్టేట్ రౌడీ, గ్యాంగ్ లీడర్, రౌడీగారి పెళ్లాం, రౌడీ అల్లుడు, రౌడీ ఇన్‌స్పెక్టర్, నిప్పురవ్వ, బిగ్ బాస్, పుణ్యభూమి నా దేశం లాంటి చిత్రాలకు పాపులర్ మ్యూజిక్ అందించారు. ఇటీవల రవితేజ సినిమా 'డిస్కో రాజా'లో ఆయన ఒక పాట పాడారు. హిందీలో చల్తే చల్తే, డిస్కో డాన్సర్, షరాబి లాంటి క్లాసిక్స్‌కు ఆయన సంగీతం సమకూర్చారు.
గత ఏడాది ఏప్రిల్‌లో కొవిడ్ 19 ఇన్‌ఫెక్షన్‌కు గురవడంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన బప్పీలహిరి, కొద్ది రోజుల తర్వాత కోలుకున్నారు. ఆయన మృతి చెందారన్న వార్త బయటకు రావడంతో టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు దేశంలోని అన్ని చిత్రరంగాల వారూ విషాదంలో మునిగిపోయారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



