ENGLISH | TELUGU  

అత్యంత విజ‌య‌వంత‌మైన ఐదుగురు ద‌ర్శ‌కులు

on Jul 7, 2020

 

హిట్ సినిమాకు ఫార్ములా అంటూ ఏమీ ఉండ‌దు. కొన్ని సినిమాలు ఎందుకు హిట్ట‌య్యాయో, కొన్ని సినిమాలు ఎందుకు ఫ‌ట్ట‌య్యాయో అర్థంకాక సినీ వ‌ర్గాల‌తో పాటు విశ్లేష‌కులూ త‌ల ప‌ట్టుకుంటుంటారు. మంచి సినిమాగా విమ‌ర్శ‌కులు పేర్కొన్న కొన్ని సినిమాల వేపు ప్రేక్ష‌కులు త‌లే తిప్ప‌క‌పోతే, చెత్త సినిమాలుగా వారు విమ‌ర్శించిన సినిమాల‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టిన సంద‌ర్భాలెన్నో. అయితే ప్రేక్ష‌కుల నాడిని ప‌ట్టేశారా.. అన్న‌ట్లు కొంత‌మంది ద‌ర్శ‌కులు తీసిన సినిమాలు ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి విజ‌యాన్ని సాధించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తుంది. తెలుగులోనూ య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి, శేఖ‌ర్ కమ్ముల‌, కొర‌టాల శివ‌, మారుతి వంటి ద‌ర్శ‌కులు మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్స్‌గా పేరు పొంద‌గా, బాలీవుడ్‌లో అలాంటివాళ్లు క‌నీసం ఐదుగురు ఉన్నారు. గ‌మ‌నించ‌ద‌గ్గ అంశ‌మేమంటే  ఆ ద‌ర్శ‌కులు ఒకే త‌ర‌హా సినిమాలు తీసేవాళ్లు కాదు. ఎవ‌రి శైలి వారిదే. అయినా వాళ్ల చిత్రాల‌ను ప్రేక్ష‌కులు మ‌రో ఆలోచ‌న లేకుండా ఆద‌రిస్తూ వ‌స్తున్నారు. ఆ బాలీవుడ్ మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్స్ వైపు ఓ లుక్కేద్దాం...

1. రోహిత్‌శెట్టి


బాలీవుడ్‌లో గోల్డెన్ హ్యాండ్‌గా పేరుపొందిన డైరెక్ట‌ర్ రోహిత్‌శెట్టి. త‌న అప్ర‌తిహ‌త విజ‌య ప‌రంప‌ర‌ను మునుప‌టి సినిమా 'సింబా'తోనూ అత‌ను కొన‌సాగించాడు. 'గోల్‌మాల్' సిరీస్ కానీ, 'సింఘ‌మ్' సిరీస్ కానీ, 'బోల్ బ‌చ్చ‌న్' కానీ, 'దిల్‌వాలే' కానీ రూ. 100 కోట్ల క్ల‌బ్బు అత‌ని పాదాల వ‌ద్ద‌కు చేరాల్సిందే. యాక్ష‌న్‌-కామెడీ సినిమాల‌కు కేరాఫ్‌గా మారిన అత‌ను షారుక్‌ఖాన్‌తో తీసిన 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌'తో రూ. 200 కోట్ల క్ల‌బ్బులోనూ చేరిపోయాడు. ఫైట్‌మాస్ట‌ర్ ఎం.బి. శెట్టి కుమారుడైన రోహిత్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా కెరీర్ ఆరంభించి అజ‌య్ దేవ్‌గ‌ణ్ సినిమా జ‌మీన్‌తో డైరెక్ట‌ర్‌గా మారాడు. ఇప్ప‌టివ‌ర‌కూ రోహిత్ 13 సినిమాలు డైరెక్ట్ చేస్తే వాటిలో 12 హిట్‌. ప్ర‌స్తుతం అత‌ను అక్ష‌య్‌కుమార్‌తో 'సూర్య‌వంశీ' సినిమా తీస్తున్నాడు.

2. రాజ్‌కుమార్ హిరాణీ


బాలీవుడ్‌లో వ‌ర్థ‌మాన‌, ఔత్సాహిక ద‌ర్శ‌కుడ్ని ఎవ‌రినైనా అడ‌గండి.. "మీకు స్ఫూర్తి ఎవ‌రు?" అని. వాళ్లంద‌రి నుంచీ వ‌చ్చే ఒకే స‌మాధానం "రాజ్‌కుమార్ హిరాణీ" అనే. దానికి కార‌ణం, ఆయ‌న‌వ‌న్నీ ఒక‌దాన్ని మించి మ‌రొక‌టి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌ని మాత్ర‌మే కాదు, వినోదానికి హృద‌యాన్ని స్పృశించేలా ఆయ‌న జోడించే విలువ‌లు. ఫిల్మ్ ఎడిట‌ర్ నుంచి ట్రెండ్‌సెట్టింగ్ డైరెక్ట‌ర్‌గా హిరాణీ ప్ర‌స్థానం నిజంగా స్ఫూర్తిదాయ‌క‌మే. మెడిక‌ల్ కాలేజీ నేప‌థ్యంలో, మాన‌వ‌తావాదిగా మారిన ఓ గూండా క‌థ‌తో ఆయ‌న తీసిన తొలి చిత్రం 'మున్నాభాయ్ ఎంబీబీఎస్' భార‌తీయ సినీ ప్రియుల‌కు ఓ కొత్త అనుభ‌వాన్నిచ్చి, ఆయ‌న‌వేపు అంద‌రి దృష్టీ ప‌డేలా చేసింది. అదే సినిమా సంజ‌య్‌ద‌త్ కెరీర్‌కు కొత్త ఊపిరినీ ఇచ్చింది. ఇక ఆయ‌న రెండో సినిమా 'ల‌గే ర‌హో మున్నాభాయ్' అయితే "గాంధీగిరి" అనే నూత‌న ప‌దాన్ని సృష్టించి, గాంధీ ప్ర‌తిపాదించిన విలువ‌ల‌ను మ‌రోసారి బ‌లంగా జ‌నం ముందుకు తెచ్చింది. అమీర్‌ఖాన్‌తో ఆయ‌న రూపొందించిన '3 ఇడియ‌ట్స్‌', 'పీకే' సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డుల్ని సృష్టించ‌డ‌మే కాకుండా, సామాజిక అంశాల్నీ స్పృశించాయి. రెండేళ్ల క్రితం సంజ‌య్‌ద‌త్ బ‌యోపిక్‌గా ఆయ‌న తీసిన 'సంజు' సైతం రూ. 300 కోట్ల క్ల‌బ్బులో స్థానం పొందింది.

3. రాకేశ్ రోష‌న్‌


న‌టుడి నుంచి ద‌ర్శ‌కుడిగా రూపాంత‌రం చెందిన రాకేశ్ రోష‌న్ ప్ర‌తి సినిమాతో త‌న‌ను తాను అన్వేషించుకుంటూనే ఉన్నారు. 'క‌రణ్ అర్జున్' లాంటి రెగ్యుల‌ర్ ఫార్ములా సినిమా నుంచి క్రిష్ లాంటి సూప‌ర్ హీరో సినిమా సిరీస్ వ‌ర‌కూ ఆయ‌న డైరెక్ట్ చేసిన సినిమాల‌ను గ‌మ‌నిస్తే, భిన్న రీతుల చిత్రాల‌తో ఆయ‌న ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తున్నాడ‌ని అర్థ‌మ‌వుతుంది. 'కోయ్‌లా' లాంటి ఒక‌ట్రెండ్ బాక్సాఫీస్ ఫ్లాపుల‌ను మిన‌హాయిస్తే మిగ‌తా సినిమాల‌న్నీ లాభాల పంట‌ల‌ను పండించిన‌వే. ఇక త‌న కుమారుడు హృతిక్ రోష‌న్‌కు 'క‌హో నా ప్యార్ హై' వంటి డ్రీమ్ లాంచ్ ఫిల్మ్‌ను అందించారు. ఆ ఒక్క సినిమాతోటే అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడిగా మారిపోయాడు హృతిక్‌. కొడుకు ఫ్లాపుల్లో స‌త‌మ‌త‌మ‌వుతున్న ప్ర‌తిసారీ హిట్టిచ్చి అత‌డిని అగ్ర‌న‌టుడిగా నిల‌బెట్టారు రాకేశ్‌. మాకూ ఓ సూప‌ర్ హీరో ఉన్నాడ‌ని భార‌తీయులు గ‌ర్వంగా చెప్పుకొనేలా 'క్రిష్‌'ను సృష్టించారు. 'క్రిష్ 3' త‌ర్వాత ఏడేళ్ల నుంచీ ఆయ‌న మెగాఫోన్ ప‌ట్టుకోలేదు. ఆ సిరీస్‌లోనే ఇంకో సినిమా తీసేందుకు ఇప్పుడాయ‌న సిద్ధ‌మ‌వుతున్నారు.

4. క‌బీర్ ఖాన్‌


డిస్క‌వ‌రీ చాన‌ల్‌లో సినిమాటోగ్రాఫ‌ర్‌గా కెరీర్ మొద‌లుపెట్టి 2006లో 'కాబూల్ ఎక్స్‌ప్రెస్' లాంటి నేష‌న‌ల్ అవార్డ్ ఫిల్మ్‌తో డైరెక్ట‌ర్‌గా మారాడు క‌బీర్ ఖాన్‌. అత‌ని తండ్రి ముస్లిం అయితే, త‌ల్లి ఒక తెలుగు వ‌నిత‌. 'న్యూయార్క్' మూవీతో అంత‌ర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న క‌బీర్‌కు స‌ల్మాన్ ఖాన్ నుంచి పిలుపు వ‌చ్చింది. అలా 'ఏక్ థా టైగ‌ర్' లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీని తీశాడు. ఆ త‌ర్వాత స‌ల్మాన్‌తోటే అత‌ను రూపొందించిన సినిమా రూ. 300 కోట్ల క్ల‌బ్బులో చోటు సంపాదించింది. జాతీయ అవార్డులు స‌హా అనేక ఇత‌ర అవార్డుల‌ను కొల్ల‌గొట్టిన ఆ సినిమా 'బ‌జ్‌రంగీ భాయీజాన్‌'. 1962 చైనా-ఇండియా వార్ నేప‌థ్యంలో స‌ల్మాన్‌తోటే అత‌ను తీసిన 'ట్యూబ్‌లైట్' అంద‌రి ప్ర‌శంస‌లూ పొందింది. ఇప్పుడు క‌పిల్‌దేవ్ సార‌థ్యంలో 1982 ప్రుడెన్షియ‌ల్ వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుచుకున్న భార‌త క్రికెట్ జ‌ట్టు క‌థ‌తో క‌బీర్ రూపొందించిన '83' ఫిల్మ్ విడుద‌ల కోసం ఎదురుచూస్తోంది.

5. అలీ అబ్బాస్ జాఫ‌ర్‌


అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా కెరీర్ ఆరంభించిన అలీ అబ్బాస్ జాఫ‌ర్ 2011లో 'మేరే బ్ర‌ద‌ర్ కీ దుల్హ‌న్' సినిమా నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ తీసిన ఐదు సినిమాల‌తో వ‌రుస విజ‌యాలు సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడిగా పేరుపొందాడు. తొలి సినిమాను ఆమిర్ ఖాన్ సోద‌రుని కుమారుడు ఇమ్రాన్‌ఖాన్‌తో చేసిన అత‌ను, రెండో సినిమాను ర‌ణ‌వీర్‌సింగ్‌, అర్జున్ క‌పూర్‌ల‌తో చేశాడు. అది.. 'గూండే'. ఆ సినిమాని అత‌ను తీసిన విధానం న‌చ్చిన స‌ల్మాన్ అత‌నికి ఛాన్స్ ఇచ్చాడు. రెండు చేతులా ఆ అవ‌కాశాన్ని అందిపుచ్చుకున్న అలీ 'సుల్తాన్' సినిమా తీసి రూ. 300 క్ల‌బ్బులో చేరిపోయాడు. స‌ల్మాన్‌తో అత‌డి బంధం కంటిన్యూ అయింది. ఆ త‌ర్వాత తీసిన 'టైగ‌ర్ జిందా హై' సైతం రూ. 300 కోట్ల‌ను క్రాస్ చేయ‌గా, 'భార‌త్' మూవీ రూ. 200 కోట్ల‌ను దాటింది.

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.