ENGLISH | TELUGU  

ఇతను స్వరేంద్ర బాహుబలి

on Jul 4, 2017

ఆయన పాట వింటే ముల్లోకాలే జడకుప్పలై జతులాడతాయి. 
ఆయన సంగీతామృతంలో సప్తస్వరాలు స్నానాలాడతాయి. 
అన్నమయ్య కీర్తనలకు... రామదాసు భజనలకు కొత్త సొబగులద్దిన గీతాచార్యుడాయన.. 
ఆయనే ఎం.ఎం.కీరవాణి. 

 


  

’విప్రనారాయణ‘ సినిమాలో.. సాలూరి వారు కీరవాణి రాగంలో శృతి చేసిన  ’’ఎందుకోయి.. తోట మాలి అంతులేని యాతన‘‘ అనే పాటంటే కీరవాణి తండ్రి శివశక్తి దత్తాకు చాలా ఇష్టమట. అందుకే తనకు పుట్టిన తొలి సంతానానికి ’కీరవాణి‘ అని ఆ రాగం పేరు పెట్టుకున్నారు. తర్వాత కాలంటో ఆ బిడ్డ.. తెలుగు సినీ సంగీత వనానికి తోటమాలిగా ఎదిగాడు. అదే యాదృశ్చికం అంటే.  

 

చక్రవర్తి దగ్గర సంగీత సహాయకునిగా కొన్నాళ్లు పనిచేసిన కీరవాణికి సంగీత దర్శకునిగా తొలి సినిమా ఉషాకిరణ్ వారి ’మనసు మమత‘. ఆ సినిమా వచ్చి 27ఏళ్లు అయ్యింది. ఇంత సుదీర్ఘమైన సంగీత ప్రయాణం బహుశా ఏ సంగీత దర్శకునికీ లేదేమో!

 


కీరవాణి స్వరఝరికీ మాస్, క్లాస్ అనే బేధం లేదు. ఏ తరహా శ్రోతనైనా తన సంగీతామృతంలో ఓలలాడిస్తారాయన. తొలిసారి ’మిస్టర్ పెళ్లాం‘ చిత్రానికి బాపుగారితో పనిచేశారు కీరవాణి. బాపు గత చిత్రాలకు ఏ మాత్రం తీసిపోనంత గొప్ప సంగీతాన్నిచ్చారు. మచ్చుకు ’రాదే చెలి నమ్మరాదే చెలి మగవారినిలా నమ్మరాదే చెలి‘ పాటనే తీసుకోండి. వేటూరి అక్షరాలకు కీరవాణి సుస్వరాలద్దిన తీరు నిజంగా అద్భుతం. అలాగే.. క్రాంతి కుమార్ ’సీతారామయ్య గారి మనవరాలు‘ ఆ సినిమాలోని  ’పూచింది పూచింది పున్నాగా‘ పాట. ఆ పాటలోని స్వరమాధుర్యం తేలిగ్గా మరిచిపోగలరా! 

 

స్వరాలు సైతం ఆత్మస్థైర్యాన్ని నింపగలవని తన సంగీతంతో నిరూపించారు కీరవాణి. ’సుందరకాండ‘లోని ’నవ్వవే... నవమల్లిక‘ పాట ఆ కోవకు చెందిందే. సంగీతం, సాహిత్యం రెండూ నువ్వా, నేనా అనే స్థాయిలో ఉంటాయి ఆ పాటలో. అలాగే ’నా ఆటోగ్రాఫ్‘ చిత్రంలోని ’మౌనంగానే ఎదగమని.. మొగ్గ నీకు చెబుతుంది‘ పాటను చంద్రబోస్ అర్థవంతంగా, భావగర్భితంగా రాస్తే, కీరవాణి తన స్వరాలతో ఆ పాటకు నగిషీలద్దారు.  


ముఖ్యంగా 1991 నుంచి 1996 అంటే... అది నిజంగా కీరవాణి శకం అని చెప్పాలి. ఘరానామొగుడు, అల్లరి మొగుడు, సుందరకాండ, మిస్టర్ పెళ్లాం, అల్లరి అల్లడు, వారసుడు, రక్షణ, బొబ్బిలి సింహం, మేజర్ చంద్రకాంత్, శ్రీనాథ కవిసార్వభౌమ, క్రిమినల్, అబ్బాయిగారు... ఇలా ఒకటా రెండా! కీరవాణి సంగీతం అంటే చాలు... అప్పట్లో కేసెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయేవి. 

 

కీరవాణి పాటలన్నింటి గురించీ చెప్పుకోవాలంటే... ఒక రోజు సరిపోదు. మచ్చుకు కొన్నింటి గురించి మాట్లాడు కుంటే... ఆ అయిదేళ్లలో వచ్చిన సినిమాల్లో ’కొండపల్లి రాజా‘లోని ’దానిమ్మ తోటలోకి చెప్పవె రూటు‘ పాట అప్పటి మాస్ ప్రేక్షల్ని కిర్రెక్కించేసిందంటే నమ్మండి. ఇక ’ప్రెసిడెంట్ గారి పెళ్లాం‘ చిత్రంలోని  ’నువ్వు మల్లెతీగ.. నేను తేనెతీగ‘ పాటైతే... యువతరాన్నిఉర్రూతలూగించేసింది. అప్పటివరకూ క్లాస్ ఇమేజ్ ఉన్న నాగార్జునకు మాస్ రుచి రుచిచూపిందీ పాట. ’చిన్నల్లుడు‘ సినిమాలోని ’కుర్రాడు బాబోయ్ కుంపటెత్తినాడు‘ పాటకైతే.. థియేటర్లలో విజిల్సే. 

 

పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య స్వరాలను పామరులకు కూడా చేరువ చేసిన ఘనత కీరవాణిది అంటే కాదనలేం. ’అన్నమయ్య‘లోని ’బ్రహ్మమొక్కటే పరబ్రహ్మ మొక్కటే‘ పాట ఆ సినిమాలోనే ఓ మెచ్చు తునక. అన్నమయ్య, శ్రీరామదాసు, పాండురంగడు, షిర్డీసాయి, నమో వెంకటేశాయా.. చిత్రాల సాక్షిగా తన సంగీతంతో శ్రోతల్ని భక్తి పారవశ్యంతో తేలియాడించిన ఘనుడు కీరవాణి. 

 

కీరవాణి మంచి సంగీత దర్శకుడే కాదు. మంచి కవి కూడా. అందుకు ఉదాహరణ ’ఈ అబ్బాయి చాలా మంచోడు‘ సినిమాలోని ’చందమామ బడిలో చదివా రెక్కల గుర్రాలుంటాయని‘ పాట. ఆ పాట రాసిందీ, స్వరాలద్దిందీ కీరవాణే. దక్షిణాదికి కీరవాణిగా, ఉత్తరాదిన ఎం.ఎం.క్రీమ్ గా భారతీయ శ్రోతలందరినీ తన సంగీతంతో వీనుల విందు చేస్తున్న ’స్వరేంద్ర బాహుబలి‘ కీరవాణి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతోంది.. ’తెలుగు వన్‘.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.