మెహ్రీన్ చిత్రానికి ఏయన్నార్ టైటిల్?
on Jun 12, 2021
కొత్త సినిమాలకు పాత చిత్రాల టైటిల్స్ పెట్టడం అన్నది అనాదిగా ఉన్న వ్యవహారమే. మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు నటించిన పలు చిత్రాల శీర్షికలు (ఆరాధన, యువరాజు, బంగారు బాబు, అందాల రాముడు, ప్రేమాభిషేకం, శ్రీమంతుడు..) ఇలానే మరోమారు టైటిల్స్ అయ్యాయి. ఇప్పుడీ జాబితాలోకి మరో టైటిల్ చేరనుంది. అదే.. `మంచి రోజులు వచ్చాయి`. 1972లో ఏయన్నార్, కాంచన జంటగా వి. మధుసూదనరావు రూపొందించిన ఈ సినిమా టైటిల్.. ఇప్పుడో కొత్త చిత్రానికి శీర్షికగా మారనుంది.
ఆ వివరాల్లోకి వెళితే.. `ఏక్ మినీ కథ` ఫేమ్ సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో ఓ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ తెరకెక్కుతోంది. 30 రోజుల నిర్మాణం టార్గెట్ గా చకచకా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి `మంచి రోజులు వచ్చాయి` అనే టైటిల్ ని ఫిక్స్ చేసిందట యూనిట్. త్వరలోనే దీనికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశముంది. మరి.. ``నేలతో నీడ అన్నది`` వంటి పాపులర్ సాంగ్ తో మ్యూజికల్ హిట్ అనిపించుకున్న నాటి `మంచి రోజులు వచ్చాయి` తరహాలో.. నేటి `మంచి రోజులు వచ్చాయి` కూడా మ్యూజికల్ గా ఎంటర్టైన్ చేస్తుందేమో చూడాలి.