మహేష్, ప్రభాస్ వస్తున్నారని మెగాస్టార్ కి తెలీదా.. మరి ఇదేంటి?
on Feb 10, 2022

టికెట్ ధరల అంశంతో పాటు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో చర్చించడానికి మెగాస్టార్ చిరంజీవి పయనమైన సంగతి తెలిసిందే. అయితే హైదరాబాద్ నుంచి బయల్దేరే ముందు చిరంజీవి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. తనకు మాత్రమే ఆహ్వానం అందిందని, మిగతా వారి గురించి తనకి తెలియదన్నట్లుగా చిరంజీవి వ్యాఖ్యానించారు. కట్ చేస్తే ప్రత్యేక విమానంలో మిగతా సినీ ప్రముఖులతో కలిసి ఆయన ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి అమరావతికి పయనమైన మెగాస్టార్.. ఫ్లైట్ ఎక్కేముందు మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "సీఎంఓ నుంచి నాకు మాత్రమే ఆహ్వానం అందిందని నాకు తెలిసింది. ఇంకా ఎవరు వస్తున్నారో నాకు తెలియదు. మీడియాలో చూసే తెలుసుకుంటున్నా" అని చిరంజీవి అన్నారు.
సీఎం జగన్ తో భేటీలో ఎవరెవరు పాల్గొంటారో తనకు తెలీదంటూ చిరంజీవి కామెంట్స్ చేసిన కాసేపటికే సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ గా మారింది. స్పెషల్ ఫ్లైట్ లో తీసిన ఈ ఫొటోలో చిరంజీవితో పాటు మహేష్ బాబు, రాజమౌళి, ప్రభాస్, కొరటాల శివ, నిరంజన్ రెడ్డి ఉన్నారు. దీంతో ఎవరు వస్తున్నారో తెలియకుండానే మెగాస్టార్ వారితో ప్రత్యేక విమానంలో వెళ్తున్నారా అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఫ్లైట్ ఎక్కేవరకు ఎవరొస్తున్నారో చిరంజీవికి తెలిసి ఉండకపోవచ్చు అని సమర్థిస్తున్నారు.

సీఎం జగన్ ని కలిసిన వారిలో ఆర్.నారాయణ మూర్తి, పోసాని కృష్ణమురళి, అలీ కూడా ఉన్నారు. ఈ భేటీలో నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ కూడా పాల్గొంటారని మొదట న్యూస్ వినిపించింది. అయితే చివరి నిమిషంలో వారు డ్రాప్ అయినట్లు తెలుస్తోంది. తన సతీమణి అమలకు కరోనా పాజిటివ్ అని తేలడంతో నాగార్జున హోమ్ ఐసోలేషన్ ఉన్నారని తెలుస్తుండగా.. తారక్ భేటీకి దూరంగా ఉండటానికి మాత్రం కారణం తెలియాల్సి ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



