పవర్ స్టార్ బర్త్ డే.. మెగా వర్సెస్ మెగా!
on Aug 30, 2022

సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా 'జల్సా', 'తమ్ముడు' సినిమాల ప్రత్యేక షోలను భారీ స్థాయిలో ప్లాన్ చేశారు. అయితే పవన్ పుట్టినరోజు సెప్టెంబర్ 2న రెండు కొత్త సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి. ఆ సినిమాలకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మెగా ఫ్యామిలీతో సంబంధం ఉంది. దీంతో అది మెగా వర్సెస్ మెగా అన్నట్లుగా మారనుంది.
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా గిరీశయ్య దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'రంగ రంగ వైభవంగా'. కేతిక శర్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎస్వీసీసీ బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు(ఆగస్ట్ 30) సాయంత్రం జరగనుంది. ఈ కార్యక్రమానికి మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ చీఫ్ గెస్ట్ లుగా హాజరు కాబోతున్నారు. ఈ సినిమా వైష్ణవ్ కి చాలా కీలకం. మొదటి సినిమా 'ఉప్పెన'తో సంచలన విజయాన్ని అందుకున్న వైష్ణవ్.. రెండో సినిమా 'కొండపొలం'తో నిరాశపరిచాడు. దీంతో 'రంగ రంగ వైభవంగా'తో సాలిడ్ హిట్ అందుకోవాలని భావిస్తున్నాడు. పైగా ఇది పవన్ క్లాసిక్ హిట్ 'ఖుషి' తరహాలో ఉండనుందనడంతో ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ లో మంచి అంచనాలే ఉన్నాయి.

సెప్టెంబర్ 2న మరో సినిమా విడుదల కాబోతోంది. అదే 'ఫస్ట్ డే ఫస్ట్ షో'. ఈ చిత్రానికి 'జాతిరత్నాలు' డైరెక్టర్ కేవీ అనుదీప్ కథ అందించగా.. వంశీ, లక్ష్మీనారాయణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో పూర్ణోదయ పిక్చర్స్ రీఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఈ సినిమాకి మెగా ఫ్యామిలీతో పరోక్షంగా సంబంధముంది. ఇది పవన్ క్లాసిక్ ఫిల్మ్ 'ఖుషి' చుట్టూ తిరిగే కథ. ఈ చిత్రంలో తాను ఇష్టపడిన అమ్మాయి అడిగిందని 'ఖుషి' ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లు సంపాదించడానికి అబ్బాయి పడే అవస్థలను సరదాగా చూపించనున్నారు. ఓ రకంగా ఇది పవన్ పుట్టినరోజున ఫ్యాన్స్ కి ట్రీట్ లాంటి మూవీ అని చెప్పొచ్చు. పైగా రేపు(ఆగస్ట్ 31న) జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు. దీంతో ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్ లో ఆసక్తి మరింత పెరిగింది.

మొత్తానికి ఒకటేమో 'ఖుషి' తరహా సినిమా, మరొకటి ఖుషి' చుట్టూ తిరిగే సినిమా. మరి పవన్ పుట్టినరోజు కానుకగా వస్తున్న ఈ రెండు సినిమాలు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



