వైష్ణవ్ తేజ్ దర్శకత్వంలో మల్టీస్టారర్.. హీరోలు ఎవరంటే?
on Aug 30, 2022

అప్పట్లో ఎన్టీఆర్, కృష్ణ వంటి సీనియర్ హీరోలు పలు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆ తర్వాత మెగాఫోన్ పట్టిన స్టార్ హీరోలు చాలా అరుదనే చెప్పాలి. 'జాని' సినిమా కోసం పవన్ కళ్యాణ్ దర్శకుడి అవతారమెత్తి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఇక ఇప్పటి యువ హీరోలలో విశ్వక్ సేన్('ఫలక్‌నుమా దాస్' మూవీ) లాంటి ఒకరిద్దరు మాత్రమే మెగాఫోన్ పట్టారు. ఇప్పుడు ఆ లిస్టులోకి మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ చేరబోతున్నాడు.
వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా గిరీశయ్య దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'రంగ రంగ వైభవంగా'. ఈ చిత్రం సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మల్టీస్టారర్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు వైష్ణవ్. తాను యాక్టర్ గా మల్టీస్టారర్ చేయాలనుకోవడం లేదని, డైరెక్టర్ గా చేయాలనుకుంటున్నానని చెప్పి సర్ ప్రైజ్ చేశాడు. అంతేకాదు ఆ మల్టీస్టారర్ తన అన్నయ్య సాయి తేజ్, బావ వరుణ్ తేజ్ తో చేయాలని ఉందని, ఇప్పటికే కథ కూడా రెడీ చేసుకున్నానని తెలిపాడు. అయితే దీనిని ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? అనే విషయంలో ప్లాన్ చేసుకోలేదని, త్వరలో ఆ విషయాలు వెల్లడిస్తానని వైష్ణవ్ అన్నాడు.
వైష్ణవ్ తేజ్ కి హీరోగా 'రంగ రంగ వైభవంగా' మూడో సినిమా మాత్రమే. ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్న ఈ యంగ్ హీరో మెగాఫోన్ పట్టుకోవాలనుకోవడం ఆశ్చర్యమే. పైగా తాను ఆ సినిమాలో తాను హీరోగా నటించనున్నాడు. మరి వైష్ణవ్ దర్శకుడిగా సాహసం చేసి విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



