'స్కంద' సహా పలు తెలుగు సినిమాల విడుదల తేదీలు మార్పు.. కారణమిదే!
on Sep 1, 2023
ఒక్క సినిమా దెబ్బకి టాలీవుడ్ లో పలు సినిమాల విడుదల తేదీలు మారిపోయేలా ఉన్నాయి. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'సలార్' మొదటి భాగం సీజ్ ఫైర్ సెప్టెంబర్ 28న విడుదల కావాల్సి ఉంది. అయితే సీజీ వర్క్ పట్ల దర్శకుడు అసంతృప్తిగా ఉండటంతో, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి మరింత సమయం తీసుకోవాలన్న ఉద్దేశంతో సినిమాని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారట. ఈ సినిమా డిసెంబర్ కి వాయిదా పడే అవకాశముందని సమాచారం.
'సలార్' వాయిదా పడుతుండటంతో 'స్కంద' టీమ్ ఆ రిలీజ్ డేట్ పై కన్నేసిందట. రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా ఫిల్మ్ ని సెప్టెంబర్ 15న విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఇప్పుడు 'సలార్' వాయిదా పడితే ఎటువంటి పోటీ లేని సెప్టెంబర్ 28 ని సరైన తేదీగా భావించి.. ఆ డేట్ కి వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి సలార్ వాయిదాతో 'స్కంద' కూడా ఓ రెండు వారాలు వెనక్కి వెళ్ళింది అంటున్నారు.
మరోవైపు అక్టోబర్ 20న విడుదల కావాల్సిన 'టైగర్ నాగేశ్వరరావు'ని కూడా సెప్టెంబర్ 28 కి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగున్నట్లు టాక్. అలాగే సలార్ డిసెంబర్ కి వాయిదా పడితే.. ఆ నెలలో రిలీజ్ కావాల్సిన 'ఆపరేషన్ వాలెంటైన్', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి', 'హాయ్ నాన్న', 'సైంధవ్' వంటి సినిమాల విడుదల తేదీలు మారే అవకాశముంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
