సూపర్‌స్టార్ చెప్పాడు.. 'ఉప్పెన' కాలాతీత చిత్రం!
on Feb 23, 2021
పంజా వైష్ణవ్‌తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా, బుచ్చిబాబు సానా డైరెక్టర్‌గా పరిచయమైన 'ఉప్పెన' చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్టవడమే కాకుండా, విమర్శకుల ప్రశంసల్నీ అమితంగా పొందింది. కథ, కథనం, ప్రధాన పాత్రధారుల అభినయం, డీఎస్పీ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. 'ఉప్పెన'ను అభిమానించే వాళ్లలో లేటెస్ట్గా సూపర్‌స్టార్ మహేశ్ కూడా చేరాడు.
సోమవారం సాయంత్రం ఈ మూవీని తిలకించిన ఆయన ఉప్పెనను ఓ క్లాసిక్‌గా అభివర్ణించాడు. తన ట్విట్టర్ హ్యాండిల్లో 'ఉప్పెన'పై తన అభిప్రాయాన్ని షేర్ చేశాడు మహేశ్. "ఒక మాటలో 'ఉప్పెన'.. క్లాసిక్! బుచ్చిబాబూ.. అరుదైన కాలాతీత సినిమాల్లో ఒకదాన్ని నువ్వు తీశావ్. నిన్ను చూసి గర్విస్తున్నా" అని రాసుకొచ్చాడు. సందర్భవశాత్తూ సుకుమార్ డైరెక్షన్లో మహేశ్ చేసిన '1.. నేనొక్కడినే' సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ అయిన బుచ్చిబాబు, క్లాప్బాయ్గానూ పనిచేయడం గమనార్హం.
అలాగే హీరో హీరోయిన్ల పర్ఫార్మెన్స్పై ప్రశంసల జల్లు కురిపించాడు. "ఇద్దరు కొత్తవాళ్లు స్టెల్లార్ పర్ఫార్మెన్స్తో రావడాన్ని చూడ్డం నిజంగా హృదయాన్ని స్పృశించింది. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి.. మీరు స్టార్లు!" అని ట్వీట్ చేశాడు మహేశ్. ఇక తన ఫేవరేట్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్కు తాను ఎంతగా ఇంప్రెస్ అయ్యాడో తెలిపాడు. "ఉప్పెనకు గుండెకాయ డీఎస్పీ.. ఆల్‌టైమ్ గ్రేట్ మ్యూజిక్ స్కోర్స్‌లో ఒకటిగా ఇది గుర్తుండిపోతుంది. ఇప్పటివరకూ ఇదే నీ బెస్ట్ వర్క్ డీఎస్పీ.. కీప్ రాకింగ్" అని ప్రశంసించాడు.
చివరగా "'ఉప్పెన లాంటి ప్రాజెక్ట్‌ను నిర్మించిన డైరెక్టర్ సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్‌కు హ్యాట్సాఫ్. ఇదివరకు నేను చెప్పినట్లే ఇది కాలాతీత సినిమాల్లో ఒకటి. మిమ్మల్ని చూసి గర్విస్తున్నాను." అని ట్వీట్ చేశాడు మహేశ్.
'ఉప్పెన'ను సూపర్‌స్టార్ ఇంతగా ప్రశంసించడంతో డీఎస్పీతో పాటు వైష్ణవ్‌తేజ్ అన్న సాయితేజ్ ఉబ్బితబ్బిబ్బయ్యారు. అతనికి ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.