తండ్రి ఊపిరి ఆగినరోజే చిన్నారి గుండెకు ఊపిరి పోసిన మహేశ్!
on Nov 18, 2022

సూపర్‌స్టార్ కృష్ణ మృత్యువుతో పోరాడుతూ మంగళవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. కాగా అదే రోజు ఒక చిన్నారి గుండెకు మహేశ్ బాబు ఫౌండేషన్ ఊపిరి పోయడం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే వేయి మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్ ద్వారా ప్రాణాలు పోసిన మహేశ్ మరోసారి మరో చిన్నారికి ఊపిరి పోసి తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు. ఒకవైపు తండ్రి కృష్ణ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఊగిసలాడుతుండగా, ఒక చిన్నారి ప్రాణాన్ని కాపాడేందుకు కృషి చేయడం వార్తల్లో నిలిచింది.
అమలాపురంకు చెందిన మూడేళ్ల బాలుడు మోక్షిత్ సాయి గుండెకు రంధ్రం ఉన్నట్లు వైద్యులు గుర్తించడంతో ఆ బాబు అమ్మానాన్నల దుఃఖానికి అంతులేకుండా పోయింది. ఆపరేషన్ చేసి బాబును బతికించుకొనే స్థోమత వారికి లేదు. అయితే సోషల్ మీడియా ద్వారా ఈ విషయం మహేశ్ బాబు ఫౌండేషన్‌కు తెలిసింది. ఫౌండేషన్ నిర్వాహకులు మోక్షిత్‌ను విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్‌లో చూపించమని సూచించారు. అక్కడి వైద్యులు మోక్షిత్‌ను పరీక్షించి వెంటనే సర్జరీ అవసరమని చెప్పారు. మహేశ్ బాబు ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో మోక్షిత్‌కు సర్జరీ చేసిన డాక్టర్లు అతని ప్రాణాలు నిలబెట్టారు. అంతకు మునుపే కృష్ణ కన్ను మూయడం, గంటల వ్యవధిలో మోక్షిత్‌కు సర్జరీ జరిగి గండం గడిచి ప్రాణాలు నిలవడం చూసి, అందరూ మహేశ్‌ను సోషల్ మీడియా ద్వారా ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
ఈ ఏడాది వరుసగా అన్నయ్య రమేశ్, అమ్మ ఇందిరాదేవి, నాన్న కృష్ణలను కోల్పోయి పుట్టెడు శోకంలో ఉన్న మహేశ్ పరిస్థితి ఎవరికీ రాకూడదనీ, ఇలాంటి కష్టకాలంలోనూ చిన్నారుల ప్రాణాలను నిల్పుతున్న మహేశ్ దేవుడులాంటి మనిషనీ కొనియాడుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



