ENGLISH | TELUGU  

'స‌ర్కారు వారి పాట‌'లో మ‌హేశ్ లుక్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌!

on May 31, 2020

 

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ 'స‌ర్కారు వారి పాట' పాడేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. అవును. మూడు నాలుగు రోజులుగా ప్ర‌చారంలో ఉన్న‌ట్లుగా ప‌ర‌శురామ్ డైరెక్ష‌న్‌లో మ‌హేశ్ న‌టించే సినిమాకు 'స‌ర్కారు వారి పాట' టైటిల్‌ను ఖాయం చేశారు. టైటిల్ లోగో పోస్ట‌ర్‌ను సీనియ‌ర్ సూప‌ర్ స్టార్ కృష్ణ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఆదివారం (మే 31) విడుద‌ల చేశారు. ఇందులో మ‌హేశ్ ప్రిలుక్ కూడా ఉంది. మ‌హేశ్ ముఖం క‌నిపించ‌కుండా ఒక వైపు త‌ల‌ను చూపిస్తూ ఉన్న ఈ లుక్ ఆస‌క్తి క‌లిగిస్తోంది. చెవికి రింగు, మెడ‌పై రూపాయి కాయిన్ టాట్టూతో మ‌హేశ్ కొత్త అవ‌తారంతో ఈ సినిమాలో క‌నిపించ‌నున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. గోల్డ్ క‌ల‌ర్‌లో డిజైన్ చేసిన టైటిల్ లోగో చివ‌ర ఒక గంట‌ను డిజైన్ చేశారు. ప్ర‌భుత్వం వేసే వేలానికి ముందు గంట కొట్ట‌డం ఆన‌వాయితీ. దాన్నే లోగోలో చూపిస్తున్నారు.

ఈ టైటిల్ లోగో పోస్ట‌ర్‌ను త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసిన మ‌హేశ్‌.. "బ్లాక్‌బ‌స్ట‌ర్ స్టార్ట్ ఫ‌ర్ అన‌ద‌ర్ హ్యాట్రిక్" అని పోస్ట్ చేసి, సినిమాపై త‌న‌కెంత గ‌ట్టి న‌మ్మ‌కం ఉందో తెలియ‌జేశాడు. 'భ‌ర‌త్ అనే నేను', 'మ‌హ‌ర్షి', 'స‌రిలేను నీకెవ్వ‌రు' మూవీల‌తో ఒక హ్యాట్రిక్‌ను పూర్తిచేసిన ఆయ‌న 'స‌ర్కారు వారి పాట‌'తో రెండో హ్యాట్రిక్ మొద‌ల‌వుతుంద‌ని చెప్తున్నాడు.

ఇక తొలిసారి మ‌హేశ్‌ను డైరెక్ట్ చేసే.. ఆ మాట‌కొస్తే తొలిసారి ఒక టాప్ స్టార్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసిన ప‌ర‌శురామ్‌.. "సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌గారిని డైరెక్ట్ చేయాల‌నే నా సుదీర్ఘ కాల నిరీక్ష‌ణ ఇప్పుడే ముగిసింది. సెట్స్‌పైకి వెళ్లేందుకు అత్యుత్సాహంతో, ఆస‌క్తితో ఎదురుచూస్తున్నా. ఇది నిజ‌మ‌వుతున్న క‌ల" అని భావోద్వేగంతో ట్వీట్ చేశాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో చేసిన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ 'గీత గోవిందం' త‌ర్వాత అత‌ను డైరెక్ట్ చేయ‌బోతున్న మూవీ ఇదే.

ఇదివ‌ర‌కు మ‌హేశ్ హీరోగా నిర్మించిన 'శ్రీ‌మంతుడు' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీతోటే ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన మైత్రీ మూవీమేక‌ర్స్‌, మూడు సినిమాలు.. 'దూకుడు', '1.. నేనొక్క‌డినే', 'ఆగ‌డు' నిర్మించిన 14 రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ (ఇప్పుడు దీని పేరును 14 రీల్స్ ప్ల‌స్‌గా మార్చారు) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వాటితో పాటు మ‌హేశ్ సొంత నిర్మాణ సంస్థ జిఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ కూడా నిర్మాణ భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తోంది.

టైటిల్ లోగో పోస్ట‌ర్‌కు నిమిషాల వ్య‌వ‌ధిలోనే ఫ్యాన్స్ నుంచి విప‌రీత‌మైన స్పంద‌న వ‌చ్చి, అది వైర‌ల్‌గా మారింది. స‌రికొత్త‌గా కనిపిస్తోన్న మ‌హేశ్ లుక్ వాళ్ల ఉత్సాహాన్ని మ‌రింత పెంచేసింది. ఈ పోస్ట‌ర్ చూస్తుంటే గూస్‌బంప్స్ ఆగ‌ట్లేద‌నీ, క‌ళ్ల‌ల్లో నీళ్లు కూడా తిరుగుతున్నాయ‌ని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

ముందు అనుకున్న‌ట్లుగానే మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా 'స‌ర్కారు వారి పాట‌'కు త‌మ‌న్ ట్యూన్స్ క‌ట్ట‌నున్నాడు. ప‌ర‌శురామ్ చాయిస్ గోపీ సుంద‌ర్ కంటే మ‌హేశ్ చాయిస్ అయిన త‌మ‌న్‌కే ఈ సినిమాకు ప‌నిచేసే ఛాన్స్ ద‌క్కింది. సినిమాటోగ్రాఫ‌ర్‌గా 'అల వైకుంఠ‌పుర‌ములో' ఫేమ్ పి.ఎస్‌. వినోద్ ప‌నిచేయ‌నున్నాడు. సూప‌ర్ స్టార్‌తో వినోద్‌కు ఇదే ఫ‌స్ట్ ఫిల్మ్‌. సీనియ‌ర్ ఎడిట‌ర్ మార్తాండ్ కె. వెంక‌టేశ్‌, ప్రెజెంట్ టాలీవుడ్ టాప్ ఆర్ట్ డైరెక్ట‌ర్ ఎ.ఎస్. ప్ర‌కాశ్ ఈ సినిమాకు ప‌నిచేస్తున్నారు.

హీరోయిన్‌గా కియారా అద్వానీ పేరు వినిపిస్తున్నా, అధికారికంగా మాత్రం క‌న్‌ఫామ్ చేయ‌లేదు. అయితే 'భ‌ర‌త్ అనే నేను' మూవీ త‌ర్వాత మ‌హేశ్ జోడీగా కియారా మ‌రోసారి ఈ సినిమాలో కనిపించ‌డం ఖాయ‌మ‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఆ జోడీని మ‌రోసారి చూడాల‌ని ఫ్యాన్స్ కూడా ఆశిస్తున్నారు. మ‌హేశ్ అందానికి కియారా అందం స‌రిగ్గా మ్యాచ్ అయ్యింద‌నేది వాళ్ల అభిప్రాయం.

ఇక మ‌హేశ్ ఆశిస్తున్న‌ట్లు 'స‌ర్కారు వారి పాట' ఆయ‌న‌కు రెండో హ్యాట్రిక్‌ను స్టార్ట్ చేస్తుందా? మాస్ లుక్‌లో క‌నిపిస్తూ, ఎంట‌ర్‌టైన్ చేసే క్యారెక్ట‌రైజేష‌న్‌తో మ‌హేశ్ అల‌రించ‌డం ఖాయ‌మ‌నేది రైటింగ్ డిపార్ట్‌మెంట్ చెబుతోన్న మాట‌. అదెంత‌వ‌ర‌కు నిజ‌మ‌వుతుందో.. లెట‌స్ వెయిట్ అండ్ సీ...

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.