English | Telugu

'మాస్ట్రో' మూవీ రివ్యూ

on Sep 17, 2021

 

సినిమా పేరు: మాస్ట్రో
తారాగ‌ణం: నితిన్‌, త‌మ‌న్నా భాటియా, న‌భా న‌టేశ్‌, జిషు సేన్‌గుప్తా, న‌రేశ్‌, అన‌న్య నాగ‌ళ్ల‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, శ్రీ‌ముఖి, మంగ్లీ, ర‌చ్చ ర‌వి, శ్రీ‌నివాస‌రెడ్డి
సంగీతం: మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: జె. యువ‌రాజ్‌
ఎడిటింగ్‌: య‌స్‌.ఆర్‌. శేఖ‌ర్‌
ఆర్ట్‌: సాహి సురేశ్‌
ఫైట్స్‌: వెంక‌ట్‌, రియ‌ల్ స‌తీశ్‌
నిర్మాత‌లు: సుధాక‌ర్‌రెడ్డి, నిఖితారెడ్డి
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: మేర్ల‌పాక ముర‌ళి
బ్యాన‌ర్‌: శ్రేష్ఠ్ మూవీస్‌
విడుద‌ల తేదీ: 17 సెప్టెంబ‌ర్ 2021
ప్లాట్‌ఫామ్‌: డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ (ఓటీటీ)

బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ 'అంధా ధున్‌'ను 'మాస్ట్రో' పేరుతో నితిన్ రీమేక్ చేస్తున్నాడ‌నే వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌ట్నుంచీ, ఆ రీమేక్‌లో ఎవ‌రెవ‌రు న‌టిస్తార‌నే ఆస‌క్తి వ్య‌క్త‌మైంది. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా శ్రీ‌రామ్ రాఘ‌వ‌న్ రూపొందించిన 'అంధా ధున్' మూవీకి స్క్రీన్‌ప్లేతో పాటు ఆర్టిస్టుల ప‌ర్ఫార్మెన్స్ సినిమాకు పెద్ద ఎస్సెట్‌. ఆ త‌ర‌హాలో తెలుగులో తియ్య‌గ‌ల‌రా అనే సందేహం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో నెల‌కొంది. ఒరిజిన‌ల్‌లో ట‌బు చేసిన క్యారెక్ట‌ర్‌ను త‌మ‌న్నా చేస్తున్న‌ద‌నేస‌రికి చాలామంది ఆశ్చ‌ర్య‌పోయారు. మేర్ల‌పాక గాంధీ డైరెక్ట్ చేసిన 'మాస్ట్రో' మూవీ ఎలా ఉందంటే...

క‌థ‌
పియానో ప్లేయ‌ర్ అయిన అరుణ్ (నితిన్‌) అంధునిగా న‌టిస్తూ, జ‌నం రాక మూత‌ప‌డేందుకు సిద్ధంగా ఉన్న‌ సోఫీ (నభా న‌టేశ్‌) వాళ్ల రెస్టారెంట్‌లో పియానో వాయించే ప‌ని సంపాదిస్తాడు. అరుణ్‌, సోఫీ మ‌ధ్య క్ర‌మంగా అనుబంధం పెన‌వేసుకుంటుంది. ఒక‌ప్పుడు మంచి హీరోగా సినిమాల్లో రాణించిన మోహ‌న్ (న‌రేశ్‌) ఒక‌సారి త‌మ పెళ్లిరోజు మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు త‌మ ఇంటికి వ‌చ్చి పియానో ప్లే చేయాల్సిందిగా ఆఫ‌ర్ చేసి అరుణ్‌కు అడ్వాన్స్ కూడా ఇస్తాడు. ఆ టైమ్‌కు అక్క‌డ వెళ్తాడు అరణ్‌. మోహ‌న్ హ‌త్య‌కు గురై ఉండ‌టాన్ని చూసి షాక‌వుతాడు. కానీ అత‌డు అంధుడిగా న‌టిస్తుండ‌టం వ‌ల్ల మోహ‌న్ శ‌వాన్ని చూడ‌న‌ట్లే ఉంటాడు. మోహ‌న్ రెండో భార్య సిమ్ర‌న్ (త‌మ‌న్నా), ఇన్‌స్పెక్ట‌ర్ బాబీ (జిషు సేన్‌గుప్తా) క‌లిసి మోహ‌న్ శ‌వాన్ని అరుణ్ క‌ళ్ల‌ముందే అక్క‌డ్నుంచి బ‌య‌ట‌కు త‌ర‌లిస్తారు. అరుణ్ నిజంగా అంధుడు కాడ‌ని అనుమానించిన సిమ్ర‌న్ అత‌డి ఇంటికి వెళ్లి కంటిచూపు పోగొట్టే పాయిజ‌న్‌ను ప్ర‌సాదంలో పెట్టి అత‌డికి ఇస్తుంది. అత‌డిని గ‌న్ తీసి కాల్చ‌బోతుంటే, బ‌య‌ట‌ప‌డిపోతాడు అరుణ్‌. కానీ ప్ర‌సాదం తిన‌డం వ‌ల్ల అత‌ను గుడ్డివాడైపోతాడు. ఆ త‌ర్వాత అరుణ్ ఏం చేశాడు?  త‌మ నేరం బ‌య‌ట‌ప‌డ‌కుండా ఉండ‌టానికి సిమ్ర‌న్, బాబీ ఇంకా ఎలాంటి దురాగ‌తాల‌కు పాల్ప‌డ్డారు? అరుణ్‌ను త‌ప్పుగా అర్థం చేసుకొని, అత‌డిని వ‌ద‌లివెళ్లిన సోఫీకి నిజం తెలిసిందా? అనే విష‌యాలు క్లైమాక్స్‌లో తేల‌తాయి.

విశ్లేష‌ణ‌
'అంధా ధున్' ఒక క‌ల్ట్ మూవీ స్టేట‌స్‌ను పొందింది. స్క్రీన్‌ప్లే, ఆర్టిస్టుల ప‌ర్ఫార్మెన్స్‌, బ్యాగ్రౌండ్ స్కోర్ కార‌ణంగా ఆ సినిమా సూప‌ర్బ్ మూవీ అనిపించుకుంది. దాన్ని రీమేక్ చేయ‌డం ఒక‌విధంగా సాహ‌స‌మే. ఆ సాహ‌సాన్ని చేశారు నితిన్‌, మేర్ల‌పాక గాంధీ. ఇందులో నేటివిటీకి సంబంధించిన సీన్లు పెద్ద‌గా ఉండ‌వు కాబ‌ట్టి, ఏ భాష‌లోనైనా దీన్ని రీమేక్ చేయ‌వ‌చ్చు. కానీ ఏ భాష‌లో తీసినా ఆ సోల్‌, ఆ ఫీల్ మిస్ కాకుండా చూసుకోవాలి. ఆ విష‌యంలో డైరెక్ట‌ర్ మేర్ల‌పాక గాంధీ కొంత‌వ‌ర‌కు స‌క్సీడ్ అయ్యాడ‌నే చెప్పాలి. ఈ సినిమాకు సంబంధించి క్యాస్టింగ్ అనేది చాలా కీల‌కం. ముఖ్యంగా ట‌బు లాంటి టాప్ ప‌ర్ఫార్మ‌ర్‌కు మ్యాచ్ అయ్యే న‌టిని వెతికి ప‌ట్టుకోవ‌డం క‌ష్టం. 'అంధా ధున్' ఆ రేంజ్‌లో ర‌క్తి క‌ట్టిందంటే.. అందుకు ప్ర‌ధాన కార‌ణమైంది ట‌బు ప‌ర్ఫార్మెన్స్‌. అలాంటి ఆమె చేసిన క్యారెక్ట‌ర్‌ను మిల్కీ బ్యూటీగా పేరుపొందిన త‌మ‌న్నా చేసింది. ఒరిజిన‌ల్ చూడ‌నివాళ్ల‌కు త‌మ‌న్నా అభిన‌యం ఆక‌ట్టుకోవ‌చ్చు. 'అంధా ధున్' చూసిన‌వాళ్లు మాత్రం ట‌బు న‌ట‌న‌తో త‌మ‌న్నా న‌ట‌న‌ను పోల్చి చూసి అసంతృప్తి చెంద‌డం ఖాయం.

అది త‌ప్పితే సినిమా అంతా బాగానే తీశాడు డైరెక్ట‌ర్‌. గోవా బ్యాక్‌డ్రాప్ క‌థ‌కు బాగా సూట‌య్యింది. సీన్లు ఆస‌క్తిక‌రంగానే క‌నిపించాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ సీన్స్‌ను బాగానే ఎలివేట్ చేసింది. కానీ సినిమాలో ఏదో మిస్స‌య్యింద‌నే ఫీలింగ్ క‌లుగుతూ ఉంటుంది. ఎందుకు ఆ ఫీలింగ్ అంటే.. క్రైమ్ థ్రిల్ల‌ర్ అయిన 'మాస్ట్రో'లో థ్రిల్లింగ్ ఎలిమెంట్ లోపించ‌డం. అవును. స‌న్నివేశాల్ని మ‌రింత గ్రిప్పింగ్‌గా తీసివుంటే సినిమా ఇంకా బాగా వ‌చ్చి ఉండేది. మోహ‌న్‌ హ‌త్య‌కు గుర‌య్యాడ‌ని అరుణ్ గ‌మ‌నించిన‌ప్ప‌టి సీన్లు కానీ, అత‌డి శ‌వాన్ని త‌ర‌లించే సీన్లు కానీ అంత ఎఫెక్టివ్‌గా రాలేదు. అలాగే అరుణ్ ఇంటికి వ‌చ్చిన సిమ్ర‌న్ అత‌డిని నిజంగానే గుడ్డివాడిని చేసేప్ప‌టి సీన్లు కూడా మ‌రింత బాగా తీసి ఉండాల్సింది.

అంత‌దాకా ఒక ఎక్స్‌పెరిమెంట్‌గా అంధుడిగా న‌టిస్తూ వ‌చ్చిన అరుణ్ నిజంగా అంధుడైపోతే, ప్రేక్ష‌కుల్లో సానుభూతి క‌ల‌గాలి. కానీ అలాంటి సానుభూతి ప్రేక్ష‌కుల్లో క‌ల‌గ‌క‌పోవ‌డం ఒక లోపం. అరుణ్ పెయిన్‌ను ప్రేక్ష‌కుడు త‌న పెయిన్‌గా ఫీల‌యితే సినిమా ఇంకో స్థాయిలో ఉండేది. ప్రి క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్ల‌లో చాలా ఎక్స్‌పెక్ట్ చేసే ఆడియెన్స్ ఓ మోస్త‌రుగానే శాటిస్‌ఫై అవుతారు. 

సినిమాకు ఎస్సెట్ అన‌ద‌గ్గ టెక్నిక‌ల్ విష‌యాల్లో సినిమాటోగ్ర‌ఫీ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ముఖ్య‌మైన‌వి. నిర్మాణ విలువ‌ల‌కు యువ‌రాజ్ సినిమాటోగ్ర‌ఫీ అద్దం ప‌ట్టింది. విజువ‌ల్‌గా సినిమా బాగుంది. మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా యాప్ట్‌గా ఉంది. ఆర్టిస్టుల డైలాగ్స్ స్ప‌ష్టంగా వినిపించాయి. "వెన్నెల్లో ఆడ‌పిల్లే" క‌దా సాంగ్ ఆక‌ట్టుకుంది. మిగ‌తా పాట‌లు సోసోగా ఉన్నాయి. ఎడిట‌ర్‌గా య‌స్‌.ఆర్‌. శేఖ‌ర్ మ‌రింత షార్ప్‌గా ప‌నిచేసి ఉండాల్సింది.

న‌టీన‌టుల ప‌నితీరు
నో డౌట్‌.. ఆర్టిస్టుల్లో అంద‌రికంటే ఎక్కువ మార్కులు పొందేది అరుణ్ రోల్ చేసిన నితిన్‌. మొద‌ట నకిలీ అంధుడిగా, త‌ర్వాత నిజంగానే కంటిచూపు పోయిన‌వాడిగా ట్రెమండ‌స్ ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇప్ప‌టిదాకా మ‌న‌కు క‌నిపించిన నితిన్ వేరు, ఈ సినిమాలో క‌నిపించిన నితిన్ వేరు.. అన్నంత మెచ్యూర్డ్ ప‌ర్ఫార్మెన్స్‌ను ఈ సినిమాలో మ‌నం చూస్తాం. సిమ్ర‌న్‌గా త‌మ‌న్నా త‌న‌కు సాధ్య‌మైనంత‌లో మంచి అభిన‌య‌మే చూపింది. ఇంత‌దాకా ఆమెను ఇలాంటి నెగ‌టివ్ రోల్‌లో మ‌నం చూసి ఉండ‌లేదు కాబట్టి, 'అంధా ధున్' క‌థ గురించి తెలియ‌నివాళ్లు త‌మ‌న్నాను ఇలా చూసి ఆశ్చ‌ర్య‌పోతారు. కానీ ట‌బు న‌ట‌న‌తో త‌మ‌న్నా ఏ ర‌కంగానూ మ్యాచ్ కాలేద‌న్న‌ది నిజం. 

సోఫీగా న‌భా న‌టేశ్ న‌ట‌న‌కు వంక పెట్టాల్సింది లేదు. త‌ను అందంగా క‌నిపించింది. పెద్ద రోల్ కాక‌పోయిన‌ప్ప‌టికీ యాక్ట‌ర్ మోహ‌న్‌గా న‌రేశ్ మ‌రోసారి ఆక‌ట్టుకున్నారు. చ‌క్క‌ని న‌టునిగా పేరుపొందిన జిషు సేన్‌గుప్తా ఇన్‌స్పెక్ట‌ర్ బాబీగా మెప్పించాడు. అత‌ని భార్య పాత్ర‌లో శ్రీ‌ముఖి ఒదిగిపోయింది. త‌న‌లోని ప్ర‌తిభ‌ను బ‌య‌ట‌పెట్టే సీన్ ఒక‌టి ఆమెకు ల‌భించింది. సినిమాకు కీల‌కంగా మారే లాట‌రీ స‌రోజ‌, ఆటో డ్రైవ‌ర్ ముర‌ళి పాత్ర‌ల‌కు పూర్తి న్యాయం చేశారు మంగ్లీ, ర‌చ్చ ర‌వి. మంగ్లీలో మంచి సింగ‌ర్ మాత్ర‌మే కాదు, మంచి యాక్ట‌ర్ కూడా ఉంద‌ని ఈ సినిమాతో మ‌నం గ్ర‌హిస్తాం. డాక్ట‌ర్ రోల్‌లో హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, మోహ‌న్ మొద‌టి భార్య కుమార్తె ప‌విత్ర పాత్ర‌లో అన‌న్య నాగ‌ళ్ల రాణించారు.

తెలుగువ‌న్ ప‌ర్‌స్పెక్టివ్‌
క్లాసిక్ లాంటి 'అంధా ధున్‌' సోల్‌ను పాడు చేయ‌కుండా 'మాస్ట్రో' మూవీని తీశారు. కానీ ఒరిజిన‌ల్ అంత‌ ఆస‌క్తిక‌రంగా, ఆక‌ర్ష‌ణీయంగా తీయ‌డంలో మాత్రం ఒక అంగుళం వెనుక‌ప‌డ్డారు. స్క్రీన్‌ప్లే ఇంకా గ్రిప్పింగ్‌గా ఉంటే, సిమ్ర‌న్ క్యారెక్ట‌ర్‌ను మ‌రింత బాగా మెప్పించ‌గ‌లిగే ఆర్టిస్టుతో చేయించివుంటే సినిమా మ‌రింత‌ బాగుండేది.

రేటింగ్‌: 2.75/5

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.