ఈ ప్రేమ జంటలు కలిసి దిగిన గ్రూప్ ఫోటో వెనుక కథ ఏమిటో తెలుసా?
on Nov 2, 2024
పాత రోజుల్లో పౌరాణిక, జానపద సినిమాలకు ఆదరణ ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత సాంఘిక చిత్రాల్లో కుటుంబ నేపథ్యం ఉన్న కథలకు ప్రాధాన్యం పెరిగింది. ఆ తర్వాతి తరంలో యాక్షన్ బేస్డ్ మూవీస్‌ని ప్రేక్షకులు ఇష్టపడేవారు. 2000 కంటే ముందు యాక్షన్ సినిమాలతోపాటు ప్రేమకథా చిత్రాలు కూడా వచ్చేవి. 2000 తర్వాత ప్రేమకథా చిత్రాల జోరు మరింత పెరిగింది. ముఖ్యంగా యంగ్ హీరోల ప్రేమకథా చిత్రాలను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరించేవారు. 2000 దశకంలో అలాంటి ప్రేమకథా చిత్రాలకు ఆదరణ పెంచిన హీరోల్లో తరుణ్, ఉదయ్‌కిరణ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీరితో కలిసి నటించిన హీరోయిన్లు సదా, ఆర్తీ అగర్వాల్. అప్పటి యూత్ ఈ రెండు జంటలకు బ్రహ్మరథం పట్టారు. ఈ జంటలు చేసిన ఎన్నో ప్రేమకథా చిత్రాలు సిల్వర్ జూబ్లీలు ఆడాయి.
కాలగమనంలో అలాంటి సినిమాలకు ఆదరణ తగ్గుతూ వచ్చింది. అలాగే లవర్‌బోయ్‌గా అమ్మాయిల గుండెల్లో స్థానం సంపాదించుకున్న ఉదయ్‌కిరణ్ హఠాన్మరణం వారి మనసుల్ని గాయపరిచింది. మరో లవర్‌బోయ్ తరుణ్ కూడా లవ్‌సోర్టీస్‌కి దూరమయ్యాడు. ఆ తర్వాత ఆర్తీ అగర్వాల్ కూడా చిన్న వయసులోనే చనిపోవడంతో ప్రేమకథా చిత్రాల ట్రెండ్‌కి బ్రేక్ పడ్డట్టయింది. అయితే ఒక గ్రూప్ ఫోటో వల్ల ఇప్పుడు ఈ నలుగురి గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఉన్నట్టుండి ఈ ఫోటో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో దీనిపై అందరూ ఆరా తీస్తున్నారు. ఈ నలుగురూ ఏ సందర్భంలో ఇలా ఫోటోకి ఫోజిచ్చారు అనేది హాట్ టాపిక్‌గా మారింది.
ఈ నలుగురూ కలిసి ఫోటో దిగేందుకు ఎక్కడ కలుసుకున్నారు అనేది ఆసక్తికరమైన విషయం. తరుణ్, ఆర్తీ అగర్వాల్ కలిసి నటించిన సోగ్గాడు.. ఉదయ్‌కిరణ్, సదా జంటగా నటించిన ఔనన్నా కాదన్నా చిత్రాలు ఒక వారం గ్యాప్‌లో రిలీజ్ అయ్యాయి. ఆ సమయంలో రెండు టీమ్‌లు కలిసి ప్రమోషన్స్‌లో పాల్గొన్నాయి. ఈ నేపథ్యంలోనే వీళ్లు నలుగురు హుస్సేన్ సాగర్‌లో సందడి చేశారు. అక్కడ ఒక బోట్‌లో ఉండగా
ఫోటోగ్రాఫర్లు క్లిక్‌మనిపించారు. ఇప్పుడీ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటో వెనుక స్టోరీ ఏమిటి అని తెలుసుకోవాలని అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. 2000 దశకంలోని యూత్‌కి ఈ ఫోటోలో కనిపిస్తున్న నలుగురూ హాట్ ఫేవరేట్సే. కాబట్టి వారికి ఈ ఫోటో ఎంతో ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. అందుకే ఈ ఫోటోకి లైక్‌ల మీద లైక్‌లు కొడుతున్నారు. విపరీతంగా షేర్ చేస్తున్నారు. పైగా అప్పట్లో వీరు చేసిన సినిమాల గురించి ప్రస్తావిస్తూ ఎమోషనల్ అవుతున్నారు. ముఖ్యంగా ఉదయ్ కిరణ్, ఆర్తీ అగర్వాల్ అందరికీ దూరంగా కావడాన్ని తట్టుకోలేకపోతున్నామంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనా ఇలాంటి రేర్ పిక్ సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం అందరికీ ఆనందాన్ని కలిగిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



