'రాము'గా బాలకృష్ణ మెప్పించి నేటికి 35 ఏళ్లు!
on Jul 31, 2022

'కథానాయకుడు' లాంటి హిట్ ఫిల్మ్ తర్వాత సురేశ్ ప్రొడక్షన్స్‌లో బాలకృష్ణ నటించిన రెండో చిత్రం 'రాము'. ఈ సినిమా ద్వారా వై. నాగేశ్వరరావు దర్శకునిగా పరిచయమయ్యారు. అదివరకు ఆయన 'కథానాయకుడు', 'సంఘర్షణ', 'ప్రతిధ్వని' చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశారు. 'కథానాయకుడు' షూటింగ్ టైమ్‌లో నాగేశ్వరరావు పనితీరును గమనించిన బాలయ్య ఆయనతో "నిన్ను డైరెక్టర్‌గా పరిచయం చేస్తానయ్యా" అని ఓ మాట అన్నారు. నిజంగానే బాలకృష్ణ సినిమాతోనే ఆయన డైరెక్టర్‌గా పరిచయమయ్యారు.
అప్పటికే మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అయిన బాలకృష్ణతో 'రాము' లాంటి సాఫ్ట్ టైటిల్‌తో సినిమాను తలపెట్టడం ఓ రకంగా సాహసమే. అయినా కథకు, పాత్రకు ప్రాధాన్యం ఇచ్చి రామానాయుడు ఈ సినిమాని తలపెట్టారు. ఎన్టీ రామారావు సినిమా 'ఆత్మబంధువు' ప్రేరణతో 'రాము' కథను తమిళ రచయిత గుహనాథన్ అల్లారు. ఆ టైటిల్‌ను సూచించింది జంధ్యాల. బాలయ్యకూ కథ నచ్చడంతో, ఈ సినిమా దర్శకత్వ బాధ్యతను నాగేశ్వరరావుకు అప్పగించారు రామానాయుడు. 1987 ఫిబ్రవరి 1న ఊటీలో 'రాము' షూటింగ్ ప్రారంభమైంది. అక్కడ పాటలు చిత్రీకరించి, హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లో అప్పుడే రామానాయుడు కొత్తగా కట్టుకున్న ఇంట్లో 50 రోజుల పాటు టాకీ పార్ట్ తీశారు.
ఈ సినిమా చిన్నతనంలో మూగవాడిగా ఉండి, ఒక విషప్రయోగం బారి నుంచి లాయర్ రామేశం కుటుంబాన్ని కాపాడి, ఆయన చేయించిన ఆపరేషన్‌తో మాటలు వచ్చి, చివరకు ఓ దుర్మార్గుడి బారినుంచి ఆ కుటుంబాన్ని కాపాడిన రాముగా ఈ సినిమాలో బాలయ్య చక్కని నటన ప్రదర్శించాడు. ఆయన సరసన నాయికగా అందాల తార రజని నటించింది. లాయర్ రామేశంగా జగ్గయ్య, విలన్ భూపతిగా సత్యనారాయణ నటించిన ఈ సినిమాలో సుత్తివేలు, సుధాకర్, హరిప్రసాద్, భాస్కర్‌బాబు, శారద, దీప, శ్రీలక్ష్మి, మాలాశ్రీ (శ్రీదుర్గ), అనిత కీలక పాత్రధారులు.
జంధ్యాల మాటలు, వేటూరి పాటలు రాసిన ఈ సినిమా 1987 జూలై 31 విడుదలై సక్సెస్‌ఫుల్‌గా 100 రోజులు ఆడింది. ఈ సినిమాకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీతం సమకూర్చారు. సురేశ్ సంస్థలో మ్యూజిక్ డైరెక్టర్‌గా ఆయన పనిచేసిన ఏకైక సినిమా ఇదే. "ఇది ఒక ఇంటి కథ.. ఇది ఒక రామకథా సుధ" పాట సినిమాకు హైలైట్‌గా నిలవడమే కాకుండా, సూపర్ పాపులర్ అయ్యింది.
.webp)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



