ఒక్కరు చేసిన తప్పుకు సినిమాను కిల్ చేస్తారా?
on Feb 10, 2025
విశ్వక్‌సేన్ హీరోగా రామ్‌నారాయణ్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన ‘లైలా’ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సినిమా సక్సెస్ అయి అందరికీ మంచి పేరు రావాలని మెగాస్టార్ ఆకాంక్షించారు. ఇంతవరకు బాగానే ఉంది గానీ ఈ ఈవెంట్‌లో మరో ఘోరమైన తప్పిదం జరిగిపోయింది. నటుడు పృథ్వి తన ప్రసంగంలో రాజకీయ అంశాలను ఎత్తి చూపేలా కొన్ని కామెంట్స్ చేశారు. అది సినిమాలోని విషయం అయినప్పటికీ దాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడంతో పెద్ద దుమారం రేగింది. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చ జరుగుతోంది. పృథ్వీ మాటలు ఒక పార్టీని టార్గెట్ చేస్తూ ఉన్నాయని అంతా భావిస్తున్నారు. ఆ కారణంగానే బాయ్‌కాట్ లైలా అనే హ్యాష్‌ట్యాగ్ బయటికి వచ్చింది. ఇప్పటికే దీనిపై 25 వేల ట్వీట్స్ వచ్చాయని తెలుస్తోంది. జరిగిన పొరపాటుకు వివరణ ఇచ్చేందుకు సోమవారం హీరో విశ్వక్‌సేన్, నిర్మాత సాహు గారపాటి మీడియాతో సమావేశమయ్యారు.
నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ ‘బాయ్‌కాట్ లైలా అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న విషయాన్ని చూసి మేం షాక్ అయ్యాం. పృథ్వీగారు ఏం మాట్లాడారో మాకు తెలీదు. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్న సమయంలో చిరంజీవిగారిని రిసీవ్ చేసుకోవడానికి బయటికి వెళ్లాం. నిజంగా అది మా నోటీస్‌లో జరగలేదు. అయితే ఇవేవీ పట్టించుకోకుండా సినిమాని సినిమాగా చూడండి, ఆదరించండి’ అన్నారు.
విశ్వక్‌సేన్ మాట్లాడుతూ ‘నిన్న ఈవెంట్‌లో జరిగిన దానికి నేను సారీ చెబుతున్నాను. కానీ, ఆయన మాట్లాడిన దానికి యూనిట్‌లోని అందర్నీ బాధపెడితే ఎలా? ఒక్కరు తప్పు మాట్లాడినా దానికి అందరూ బాధ్యత వహించాలి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్. సాహుగారు చెప్పినట్టు పృథ్విగారు మాట్లాడుతున్నప్పుడు మేం ఈవెంట్ లేము. అతను మాట్లాడిన దానికి, మాకు ఎలాంటి సంబంధం లేదు. మా సినిమాలో ఆయన నటించారు కాబట్టి ఫంక్షన్‌కి పిలుస్తాము. కానీ, ఆయన ఏం మాట్లాడతారో మేమెలా చెప్పగలం. ఎంతో కష్టపడి సినిమా తీశాం. దాన్ని కిల్ చేయకండి. ఇప్పటికే 25 వేలకుపైగా సినిమాకి వ్యతిరేకంగా ట్వీట్స్ వచ్చాయి. దయచేసి మా సినిమాకి సపోర్ట్ చేయండి’ అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



