కృష్ణంరాజు కాలుకి దెబ్బ.. వేలుని తొలగించిన డాక్టర్లు!
on Mar 9, 2022

సీనియర్ రెబల్‌స్టార్ కృష్ణంరాజు కాలుకి దెబ్బ తగిలింది. 82 సంవత్సరాల ఆయన ఇంట్లో కాలు జారి కిందపడిపోవడంతో ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారనీ, ఆయనకు సర్జరీ నిర్వహించిన డాక్టర్లు తప్పనిసరి పరిస్థితుల్లో ఒక వేలిని తొలగించారనీ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. 'రాధే శ్యామ్' మూవీ విడుదలకు ముందు ఇలా జరిగిందని తెలిస్తే, అభిమానులు ఆందోళన చెందే అవకాశం ఉండటంతోనే ఈ వ్యవహారాన్నంతా కృష్ణంరాజు కుటుంబం గోప్యంగా ఉంచిందని అంటున్నారు. అందువల్లే ఆయన రాధే శ్యామ్ ప్రమోషన్స్‌లో పాల్గొనలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.
కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో కృష్ణంరాజు కాలు జారి పడిన విషయం వెల్లడించారు కానీ సర్జరీ జరిగిన విషయం మాత్రం చెప్పలేదు. ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతారనే ఉద్దేశంతోనే ఆమె ఆ విషయం గోప్యంగా ఉంచారని తెలుస్తోంది. 'రాధే శ్యామ్' రిలీజ్ తర్వాత కాలికి పూర్తిగా నయమయ్యాక ఆయన ప్రెస్‌మీట్‌లో పాల్గొంటారని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
కృష్ణంరాజు సొంత నిర్మాణ సంస్థ గోపీకృష్ణా మూవీస్, మరో ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్‌తో కలిసి నిర్మించిన సినిమా 'రాధే శ్యామ్'. ప్రభాస్‌తో ఇదివరకు నిర్మించిన 'బిల్లా' మూవీ తర్వాత ఇన్నాళ్లకు ఈ సినిమాని ఆ ప్రొడక్షన్ హౌస్ తీసింది. కృష్ణంరాజు కుమార్తె ప్రసీద.. 'రాధే శ్యామ్'కు నిర్మాతగా వ్యవహరించారు. హస్తసాముద్రికుడు విక్రమాదిత్యగా ప్రభాస్ నటించిన ఈ సినిమాలో అతని గురువు పరమహంసగా ప్రత్యేక పాత్రను కృష్ణంరాజు చేశారు. ప్రభాస్ జోడీగా పూజా హెగ్డే నటించిన ఈ సినిమాకు రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. ఈ నెల 11న ప్రపంచవ్యాప్తంగా వేలాది థియేటర్లలో 'రాధే శ్యామ్' విడుదలవుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



