ఎన్టీఆర్ గ్రాండ్ సక్సెస్.. సూపర్‌స్టార్ స్టేట్‌మెంట్!
on Jun 2, 2020

తెలుగుదేశం పార్టీని ప్రారంభించి, 1983 జనవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించి, తొమ్మిది నెలలకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని అలంకరించి చరిత్ర సృష్టించారు దివంగత నందమూరి తారకరామారావు. అటు సినీ రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ సంచలనాల సృష్టికర్తగా ఎన్టీఆర్ పేరు తెలుగువాళ్ల హృదయాల్లో శాశ్వతముద్ర వేసుకుంది. తెలుగులో ఏ ఇతర హీరోకూ సాధ్యంకాని రికార్డులు ఆయన సొంతం. అలాంటి ఆయనకు సూపర్‌స్టార్ కృష్ణ వీరాభిమాని అనే విషయం చాలా మందికి కాకపోయినా కొంతమందికైనా తెలుసు. రాజకీయంగా ఎన్టీఆర్‌తో విభేదించినప్పటికీ, నటునిగా ఆయనను ఆరాధిస్తూ వచ్చారు కృష్ణ. తాను కాలేజీ రోజుల నుంచి ఎన్టీఆర్ అభిమానినని ఇప్పటికీ సందర్భం వచ్చినప్పుడల్లా కృష్ణ చెబుతుంటారు.
ఎన్టీఆర్ 1983 ఎన్నికల్లో గెలిచినప్పుడు ఆయనను అభినందిస్తూ కృష్ణ ఒక ప్రకటన ఇచ్చారు. "భారతదేశ చరిత్రలోనే కాదు! యావత్ప్రపంచ చరిత్రలోనే అపూర్వమయిన సంఘటనకు అతి స్వల్ప వ్యవధిలో నాంది పలికిన విజేత నందమూరి తారకరామారావు గారికి అభినందనలు తెలుపుతూ రాజకీయ పరిజ్ఞానంతో తెలుగుజాతి యిచ్చిన తీర్పును స్వీకరించి వారి ఆశల్ని ఆశయాల్ని సఫలం చేస్తారని ఆశిస్తూ అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ మీ శ్రేయస్సు కోరే.. మీ కృష్ణ" అనేది ఆ ప్రకటన. ఆనాటి పత్రికల్లో వచ్చిన ఆ ప్రకటనలో కింద "ఏకగ్రీవంగా ఎన్నికైన చిత్రం ఈనాడు", "ఏకగ్రీవంగా ఎన్నికైన పార్టీ తెలుగుదేశం" అంటూ రెండు సర్కిల్స్ వేశారు.
కృష్ణ నటించిన 200వ చిత్రంగా 'ఈనాడు' సుప్రసిద్ధం. 1982 డిసెంబర్‌లో రిలీజైన ఆ సినిమా ఘన విజయం సాధించింది. ఇక ఎన్టీఆర్, కృష్ణ కలిసి 'దేవుడు చేసిన మనుషులు', 'వయ్యారి భామలు వగలమారి భర్తలు', 'విచిత్ర కుటుంబం' వంటి చిత్రాల్లో కలిసి నటించారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



