ENGLISH | TELUGU  

డిస్ట్రిబ్యూట‌ర్ల ఒత్తిళ్ల‌తో ప్రొడ్యూస‌ర్ల‌కు గుండెపోట్లు! క్రైసిస్‌లో టాలీవుడ్‌!!

on Jun 2, 2020

 

ఫిల్మ్ ఇండ‌స్ట్రీ ప్ర‌స్తుతం చాలా చాలా గ‌డ్డు స్థితిని ఎదుర్కొంటోంది. స్టార్ హీరోల కొత్త సినిమాల అనౌన్స్‌మెంట్లు, ప్రిలుక్‌లు, ర‌న్నింగ్‌లో ఉన్న సినిమాల విశేషాలు.. సోష‌ల్ మీడియాలో ఎంత‌గా హ‌ల్‌చ‌ల్ చేస్తున్నా.. వాస్త‌వం భ‌య‌పెడుతోంది. ముఖ్యంగా రేప‌న్న‌ది ఎలా ఉంటుందో పాలుపోక నిర్మాత‌లు ఆందోళ‌న‌లో ప‌డుతున్నారు. విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న సినిమాలు ఎప్పుడు విడుద‌ల‌వుతాయో తెలీడం లేదు. సెట్స్ మీదున్న సినిమాలు ఎప్పుడు పూర్త‌వుతాయో తెలీదు. స్వేచ్ఛ‌గా షూటింగ్‌లు చేసుకొనే వాతావ‌ర‌ణం ఎప్ప‌టికి వ‌స్తుందో తెలీదు. థియేట‌ర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో, తెరుచుకున్నాక ప్రేక్ష‌కులు ఏ స్థాయిలో వ‌స్తారో తెలీదు. ఇలాంటి అనిశ్చిత‌, అభ‌ద్ర‌తా వాతావ‌ర‌ణాన్ని గ‌తంలో టాలీవుడ్ ఎన్న‌డూ చూడ‌లేదు.

ఈ నేప‌థ్యంలో డిస్ట్రిబ్యూట‌ర్ల నుంచి.. అందునా ఓవ‌ర్సీస్ డిస్ట్రిబ్యూట‌ర్ల నుంచి టాలీవుడ్ నిర్మాత‌లు ఒత్తిళ్ల‌ను ఎదుర్కొంటున్న‌ట్లు తెలుస్తోంది. నిజం చెప్పాలంటే నిర్మాత‌లే కాదు.. తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్సీస్ డిస్ట్రిబ్యూట‌ర్లు కూడా ఒత్తిడిని ఎదుర్కొటున్నారు. కార‌ణం.. వాళ్లిప్ప‌టికే కొన్న సినిమాలు రేపు రిలీజ‌య్యాక భారీ న‌ష్టాల్ని తీసుకొస్తాయ‌నే భ‌యం! ఈ భ‌యం సినిమా బిజినెస్‌తో సంబంధం ఉన్న ప్ర‌తి ఒక్క‌రినీ వెన్నాడుతూ ఉంది. ఇప్పుడు ప్రొడ‌క్ష‌న్‌లో ఉన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి మూవీ 'ఆర్ఆర్ఆర్‌'ది టాప్ ప్లేస్‌. ఈ సినిమా స్టార్ట్ అయ్యీ అవ‌క‌ముందే ఆల్‌మోస్ట్ అన్ని ఏరియాలకూ భారీ రేట్ల‌కు అమ్ముడైంది. ఎంత‌గా అంటే.. 'బాహుబ‌లి 2'ను బీట్ చేసే రేంజిలో.

క‌రోనా ఎఫెక్ట్ లేన‌ట్ల‌యితే.. జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తోన్న ఈ మ‌ల్టీస్టార‌ర్ టాలీవుడ్‌లోనే కాకుండా దేశీయంగా స‌రికొత్త రికార్డులు సృష్టించ‌డం ఖాయ‌మ‌ని ట్రేడ్ విశ్లేష‌కులు భావిస్తూ వ‌చ్చారు. అజ‌య్ దేవ‌గ‌ణ్‌, అలియా భ‌ట్ వంటి బాలీవుడ్ స్టార్లు సైతం న‌టిస్తుండ‌టంతో ఈ మూవీ అంచ‌నాలు అంబ‌రాన్ని అంటాయి. అయితే.. అది నిన్న‌టి మాట‌. క‌రోనా దెబ్బ‌కు ఈ మూవీ రిలీజ్ డేట్‌ 2021 జ‌న‌వ‌రి 8 నుంచి వేసవికి పోస్ట్‌పోన్ అయ్యింది. కొత్త రిలీజ్ డేట్ కోసం అంద‌రూ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా నిర్మాత దాన‌య్య‌ను ఓవ‌ర్సీస్ డిస్ట్రిబ్యూట‌ర్లు త‌మ డ‌బ్బు వాప‌సు ఇవ్వ‌మ‌ని అడుగుతున్న‌ట్లు ఫిల్మ్‌న‌గ‌ర్‌లో వినిపిస్తోంది. సంద‌ర్భ‌వ‌శాత్తూ దాన‌య్య‌కు ఇటీవ‌ల గుండెపోటు రావ‌డం, హార్టులో స్టంట్ వేయ‌డం గ‌మ‌నార్హం. డిస్ట్రిబ్యూట‌ర్ల నుంచి వ‌స్తున్న ఒత్తిళ్లే ఆయ‌న గుండెపోటుకు కార‌ణ‌మ‌ని ఇండ‌స్ట్రీలో చెప్పుకుంటున్నారు.

ఇలాంటి ఒత్తిళ్లే చిరంజీవి 'ఆచార్య‌', ప‌వ‌న్ క‌ల్యాణ్ 'వ‌కీల్ సాబ్‌', ప్ర‌భాస్‌20 సినిమాల నిర్మాత‌లూ ఎదుర్కొంటున్న‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. వీటితో పాటు నాని 'వి', రామ్ 'రెడ్‌', ర‌వితేజ 'క్రాక్' సినిమాల డిస్ట్రిబ్యూట‌ర్లు కూడా తాము కొన్న రేట్ల‌ను త‌గ్గించ‌మ‌ని నిర్మాత‌ల‌పై ఒత్తిడి చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ ప‌రిస్థితి టాలీవుడ్‌లో స‌రికొత్త సంక్షోభానికి దారితీయ‌వ‌చ్చ‌ని విశ్లేష‌కులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. రానున్న రెండేళ్ల కాలంలో భారీ బ‌డ్జెట్‌తో సినిమాలు తీస్తే.. ప్రొడ్యూస‌ర్ల‌కు, డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు చేతులు కాల‌క త‌ప్ప‌ద‌ని వాళ్లు హెచ్చ‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అల్లు అర్జున్ 'పుష్ప‌', మ‌హేశ్ 'స‌ర్కారు వారి పాట' మూవీల బ‌డ్జెట్‌ను త‌గ్గించుకుంటున్న‌ట్లు స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి. మిగ‌తా సినిమాల ప‌రిస్థితి కూడా ఇదే!

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.