'కాంతార'కు ఎదురుదెబ్బ.. 'వరాహరూపం'ను ప్రదర్శించరాదు!
on Oct 30, 2022

రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన బ్లాక్‌బస్టర్ మూవీ 'కాంతార'కు ఎదురుదెబ్బ తగిలింది. కథకు కీలకమైన భూతకోల ఆడే సందర్భంలో వచ్చే 'వరాహరూపం' పాటను సినిమాలో ప్రదర్శించకూడదని కేరళలోని కోజికోడ్ సెషన్స్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 'వరాహరూపం' పాటను తాము రూపొందించిన 'నవరసం' పాటను కాపీ కొట్టి రూపొందించారనీ, దీనికి తమ అనుమతి తీసుకోలేదనీ కేరళకు చెందిన థాయ్‌కుడమ్ బ్రిడ్జ్ అనే మ్యూజిక్ బ్యాండ్ కోర్టుకెక్కింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం 'వరాహరూపం' పాటకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది.
థాయ్‌కుడమ్ బ్రిడ్జ్ అనుమతి లేకుండా వరాహరూపం పాటను థియేటర్లలో కానీ, యూట్యూబ్, ఇతర ప్రసార సాధనాల్లో కానీ, మ్యూజిక్ యాప్స్‌లో కానీ ప్రదర్శించకూడదని కోర్టు ఆదేశించింది.
'కాంతార'లో 'వరాహరూపం' పాటకు చాలా ప్రాధాన్యం ఉంది. భూతకోల ఆడే వ్యక్తిని పంజుర్లీ దేవత ఆవహించిన సందర్భంలో ఈ పాట వస్తుంది. ఇది బాగా పాపులర్ అయ్యింది. సినిమా ఆరంభంలో, తర్వాత క్లైమాక్స్‌లో ఈ పాట వస్తుంది. అజనీశ్ లోక్‌నాథ్ ఈ పాటకు మ్యూజిక్ సమకూర్చాడు. కాగా యూట్యూబ్‌లో మాత్రం ఈ న్యూస్ రాసే సమయానికి (ఆదివారం) ఈ పాట ఇంకా అందుబాటులోనే ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



