కథ వేరే ఉంటది.. టాలీవుడ్ కి కోలీవుడ్ వార్నింగ్!
on Nov 20, 2022

2023 సంక్రాంతికి చిరంజీవి 'వాల్తేరు వీరయ్య', బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి' వంటి బడా టాలీవుడ్ సినిమాలుంటే తెలుగు రాష్ట్రాల్లో తమిళ్ డబ్ మూవీ 'వారసుడు'కి ఎక్కువ థియేటర్లు ఎలా కేటాయిస్తారంటూ పలువురు ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాతల మండలి సైతం సంక్రాంతి, దసరా వంటి పెద్ద పండగల సమయంలో తెలుగు సినిమాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది. అయితే ఈ వివాదంపై తమిళ పరిశ్రమకు చెందిన వారు వార్నింగ్ లు ఇవ్వడం సంచలనంగా మారింది.
కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న తమిళ చిత్రం 'వారిసు'. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగులో 'వారసుడు' పేరుతో విడుదల కానుంది. దిల్ రాజు భారీ స్థాయిలో విడుదల చేస్తాడు కాబట్టి 'వాల్తేరు వీరయ్య', 'వీర సింహా రెడ్డి' సినిమాలకు థియేటర్ల కొరత ఉంటుంది. దీంతో మెగా, నందమూరి అభిమానులతో పాటు ఎందరో 'వారసుడు' విడుదలను వ్యక్తిరేకిస్తున్నారు. అయితే ఈ వివాదంపై స్పందించిన తమిళ దర్శకుడు లింగుస్వామి కథ వేరే ఉంటది అనే రేంజ్ లో వార్నింగ్ ఇచ్చాడు.
చెన్నైలో మీడియాతో ముచ్చటించిన లింగుస్వామి.. విజయ్ లాంటి సూపర్ స్టార్ తెలుగులో బడా నిర్మాతకు డేట్లు ఇచ్చి సినిమా చేస్తున్నాడని, కాబట్టి వారసుడుకి ఎక్కువ థియేటర్లు ఇవ్వాలని అన్నాడు. ఒకవేళ వారసుడికి సరిపడా థియేటర్లు ఇవ్వకపోతే పరిణామాలు వేరుగా ఉంటాయని, 'వారసుడు'కు ముందు 'వారసుడు'కు తర్వాత అన్నట్లుగా వ్యవహారం ఉంటుందని లింగుస్వామి హెచ్చరించాడు. అంటే భవిష్యత్తులో తమిళనాడులో విడుదలయ్యే తెలుగు సినిమాలను ఇబ్బందులకు గురి చేస్తామని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడన్నమాట.
లింగుస్వామి తీరుపై తెలుగు సినీ అభిమానులు మండిపడుతున్నారు. గతంలో ఆయన డైరెక్ట్ చేసిన 'పందెం కోడి', 'ఆవారా' సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎంతలా ఆదరించారో గుర్తు చేసుకోవాలని ఫైర్ అవుతున్నారు. అయినా తమిళ్ లో 'బాహుబలి' లాంటి ఒకట్రెండు తెలుగు సినిమాలకు తప్ప పెద్దగా ఆదరణ లభించలేదని.. కానీ తెలుగు ప్రేక్షకులు ఎన్నో తమిళ్ సినిమాలకు బ్రహ్మరథం పట్టారని గుర్తు చేస్తున్నారు. పంతానికి పోతే తమిళ సినిమాల తెలుగు మార్కెట్ పోతుందని కౌంటర్ ఇస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



