'కిల్లర్ సూప్' వెబ్ సిరీస్ రివ్యూ
on Jan 17, 2024
వెబ్ సిరీస్ : కిల్లర్ సూప్
నటీనటులు: మనోజ్ బాజ్ పాయ్, కొంకణా సేన్ శర్మ, నాజర్, సాయాజీ షిండే, లాల్ తదితరులు
సినిమాటోగ్రఫీ: అనూజ్ రాకేశ్
ఎడిటింగ్: శాన్యుక్త కాజా
మ్యూజిక్: సందేశ్ రావు
నిర్మాతలు : చేతన్ కౌశిక్, హనీ తెహ్రాన్
రచన: ఉనైజా మర్చెంట్, హర్షద్ నలవాడ
దర్శకత్వం: అభిషేక్ చౌబే
ఓటీటీ: నెట్ ఫ్లిక్స్
ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన మనోజ్ బాజ్ పాయ్ నటించిన సిరీస్ ' కిల్లర్ సూప్'. కొంకణ శర్మ, నాజర్, సాయాజీ షిండే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ కథేంటో ఓసారి చూసేద్దాం...
కథ:
స్వాతి(కొంకణ సేన్ శర్మ) , ప్రభాకర్ శెట్టి ఇద్దరు భార్యభర్తలు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు. స్వాతికి ఓ రెస్టారెంట్ పెట్టాలనే ఆశ ఉంటుంది. ప్రభాకర్ కి అపార్ట్మెంట్ కట్టాలని కొత్త వ్యాపారం చేయాలనే కలలు కంటాడు. కానీ అతనేం పనిచేసినా అందులో ఫెయిల్ అవుతాడు. ప్రభాకర్ అన్న అరవింద్ శెట్టి అక్రమంగా సంపాదిస్తుంటాడు. అతని సహాయంతో ప్రభాకర్ ఎన్ని కొత్త బిజినెస్ లు మొదలెట్టినా లాస్ వస్తుంటుంది. దాంతో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని అరవింద్ శిట్టి దగ్గరికి ప్రభాకర్ వచ్చినప్పుడు వద్దని చెప్తాడు. ఇక అదే సమయంలో మసాజ్ చేసే వ్యక్తి ఉమేశ్ పిళ్ళైతో ప్రభాకర్ భార్య స్వాతి అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. ఇక ఓ రోజు ప్రభాకర్ హత్యకు గురవుతాడు. భర్త స్థానంలో ఉమేశ్ పిళ్ళైని తీసుకొస్తుంది స్వాతి. ప్రభాకర్ హత్యని పోలీసులు ఛేదించారా? స్వాతి, ఉమేశ్ పిళ్ళైల మధ్య గల సంబంధం బయటపడిందా లేదా అనేది మిగతా కథ...
విశ్లేషణ:
క్రైమ్ సిరీస్ లలో ట్విస్ట్ లతో పాటు కామెడీ మంచి థ్రిల్ ని ఇస్తాయి. అలాంటి క్రైమ్ కామెడీ కథతో తో వచ్చిన ' కిల్లర్ సూప్' సిరీస్ ని ఆసక్తిగా మలచడంలో అభిషేక్ చౌబే విజయం సాధించాడు. ఈ వెబ్ సిరీస్ మొత్తంగా ఎనిమిది ఎపిసోడ్ లుగా సాగుతుంది. ప్రతీ ఎపిసోడ్ సుమారుగా ముప్పై నుండి నలభై నిమిషాల వరకు ఉంటుంది. అసలు ఈ కథకి ఓ మూడు ఎపిసోడ్ లు అయితే బాగుండు కానీ డైరెక్టర్ ప్రతీ పాయింట్ ని క్షుణ్ణంగా ప్రేక్షకుడికి అర్థం అయ్యేలా వివరించాలని శ్రమించాడు. అది ఒక్కో ఎపిసోడ్ లో మనకు కన్పిస్తుంది.
ఆరేళ్ళ క్రితం తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన ఓ మర్డర్ పెను సంచలనంగా మారింది. ప్రియుడితో కలిసి ఉండటానికి స్వాతి అనే ఓ ఇల్లాలు.. తన భర్తనే చంపేసింది. ఈ యదార్థ సంఘటన ఆధారంగా అభిషేక్ చౌబే తీసిన సిరీస్ ఈ ' కిల్లర్ సూప్ '. మొదటి రెండు ఎపిసోడ్ లలో.. స్వాతి, ప్రభాకర్ శెట్టి, అరవింద్ శెట్టి, ఉమేశ్ పిళ్ళై.. ఇలా ఒక్కో పాత్రని పరిచయం చేసాడు డైరెక్టర్. ఆ తర్వాత అసలు కథలోకి తీసుకెళ్ళాడు. దీనికి కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఇక్కడే కాస్త లాగ్ అనే ఫీలింగ్ ప్రేక్షకుడికి వచ్చేస్తుంది. స్వాతి తన ప్రియుడితో కలిసి ఉన్న ఫోటోలు బయటకు రావడంతో కథలో వేగం పెరుగుతుంది. ఇక అక్కడి నుండి కథ మరింత ఆసక్తికరంగా సాగుతూ ఫుల్ ఎంగేజ్ చేస్తుంది. పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో కొన్ని నిజాలు తెలిసినా.. అసలు హత్య గురించి తెలిసిన వారు అనుకోని ప్రమాదాల్లో మరణించడం వారికి ఓ సవాలుగా మారుతుంది. అయితే స్వాతి ఇన్వెస్టిగేషన్ లో చెప్పిన విధానం, ప్రభాకర్ కుటుంబ సభ్యుల సహాయంతో పోలీస్ ఇన్వెస్టిగేషన్ మరింత సులభతరం అవుతుంది. అలా కథ చివరి వరకు ఆసక్తికరంగా సాగుతుంది.
కానీ కథ బాగున్నప్పటికి సుదీర్ఘంగా సాగే ఎపిసోడ్ లు చూడటం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కో ఎపిసోడ్ నిడివి కాస్త తగ్గించి ఉంటే బాగుండేది. కథనం నడిపించిన తీరు బాగున్నప్పటికి ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా చూపించాలనే ఉద్దేశంతో డైరెక్టర్ తీసిన కొన్ని సీన్లని స్కిప్ చేయకుండా ఉండలేరు. అడల్ట్ సీన్లు, లిప్ లాక్ సీన్లు చాలానే ఉన్నాయి. ఎఫ్ వర్డ్ తో వచ్చే డైలాగ్స్ చాలాచోట్ల వాడారు. ఇది కాస్త ఇబ్బందిగా ఉంటుంది. సందేశ్ రావు మ్యూజిక్ బాగుంది. శాన్యుక్త కాజా ఎడిటింగ్ బాగుంది. ఫస్ట్ అండ్ సెకండ్ ఎపిసోడ్ లలోని సీన్లని కాస్త ట్రిమ్ చేస్తే బాగుండేది. అనూజ్ రాకేశ్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
ప్రభాకర్ పాత్రలో మనోజ్ బాజ్ పాయ్ నటన కట్టిపడేస్తుంది. స్వాతి పాత్రలో కొంకణా సేన్ శర్మ ఆకట్టుకుంది. ఇన్ స్పెక్టర్ హసన్ పాత్రలో నాజర్ ఆకట్టుకున్నాడు. సాయాజీ షిండే నటన సిరీస్ కి ప్లస్ అయింది. ఇక మిగిలిన పాత్రధారులు వారి పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
తెలుగువన్ పర్ స్పెక్టివ్:
యథార్థ సంఘటన ఆధారంగా తీసిన కథ కాబట్టి ఓసారి చూడొచ్చు. అయితే ఫ్యామిలీతో కలిసి చూడకపోవడమే బెటర్.
రేటింగ్: 2.75/5
✍️. దాసరి మల్లేశ్

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
