కేరళ రేవ్ పార్టీలో 9 మంది అరెస్ట్.. వారిలో సినీ తారలు?
on Dec 22, 2020
కేరళలో జరుగుతున్న ఓ రేవ్ పార్టీపై దాడిచేసిన పోలీసులు తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. వీరిలో అక్కడి సినీ, టీవీ ఇండస్ట్రీకి చెందిన తారలు కూడా ఉన్నట్లు ప్రచారంలోకి వచ్చింది. ఆదివారం రాత్రి వాగమాన్‌లోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో రేవ్ పార్టీ జరుగుతోందని కచ్చితమైన సమాచారం అందుకున్న పోలీసులు, ఆ రిసార్ట్‌పై దాడిపై చేశారు. మొత్తం 59 మంది పాల్గొన్న ఆ పార్టీలో 9 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఇడుక్కి ఎస్పీ ఆర్. కరుప్పస్వామి తెలిపారు.
"డిప్యుటీ ఎస్పీ ఎన్. రాజ్‌మోహన్ ఆధ్వర్యంలో దాడి చేసిన బృందం రేవ్ పార్టీ జరుగుతున్న ప్రదేశం నుంచి ఎండీఎంఏ, ఎస్టెసీ టాబ్లెట్, ఎస్టెసీ పౌడర్, ఎల్ఎస్‌డీ, చరస్, హాషిష్, ఎల్ఎస్‌డీ స్టాంప్, మేథ్ క్రిస్టల్, గంజాయి స్వాధీనం చేసుకుంది. ఓ మహిళ సహా తొమ్మిదిమందిని అరెస్ట్ చేశాం. పార్టీలో మిగతావారి ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోంది." అని ఆయన చెప్పారు. 59 మందిలో 24 మంది మహిళలేనని ఆయన తెలిపారు.
ఆ రిసార్ట్‌ను స్థానిక సీపీఐ నాయకుడు షాజీ కుట్టక్కడ్ నడుపుతున్నారు. అక్కడి పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తున్న సమాచారం తనకు తెలీదని ఆయన చెప్పారు. కాగా ఆ నాయకుడిపై చర్యలు తీసుకుంటామనీ, పార్టీ నుంచి బహిష్కరిస్తామనీ సీపీఐ ప్రకటించింది.
ఆ పార్టీలో వినియోగించిన డ్రగ్స్ ఎక్కడ్నుంచి సప్లై అయ్యాయనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో సినీ, టీవీ పరిశ్రమలకు చెందిన తారలు కూడా ఉన్నారని వినిపిస్తోంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
