సీతారామశాస్త్రి చేతిరాత.. 'కంచె'లోని పాట!
on Nov 30, 2021
ఆకస్మికంగా కన్నుమూసి, సంగీత ప్రియులనందర్నీ దుఃఖసాగరంలో ముంచేసిన అసమాన గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి ఉరికురికి వచ్చిన పదునైన పాటలు అనేకం. వాటిలో క్రిష్ డైరెక్ట్ చేసిన 'కంచె' సినిమాలోని "విద్వేషం పాలించే దేశం ఉంటుందా?" అనే పాట ఒకటి. వరుణ్ తేజ్ హీరోగా నటించిన రెండో సినిమా 'కంచె'. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో నడిచే అందమైన ప్రేమకథతో రూపొందిన ఈ సినిమాలో 'మనుషుల మధ్య, దేశాల మధ్య ఉండాల్సింది ద్వేషం కాదు, ప్రేమ' అనే ఒక ఉదాత్త భావనను బలంగా వ్యక్తీకరించే పాట కావాల్సి వచ్చింది.
చిరంతన్ భట్ బాణీలు సిద్ధమయ్యాయి. ఆ పాటను ఎవరితో రాయాలనే ఆలోచన రావడం ఆలస్యం.. క్రిష్ మదిలో మెదిలిన కవి ఒక్కడే.. సీతారామశాస్త్రి. సందర్భం చెప్పగానే కొంత సమయం తీసుకొని కలాన్ని ఝళిపించారు శాస్త్రి.
"విద్వేషం పాలించే దేశం ఉంటుందా? విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా?" అని ప్రశ్నిస్తూ పల్లవి రాసిన ఆయన "ప్రేమను మించిందా బ్రహ్మాస్త్రమైనా.. ఆయువుపోస్తుందా ఆయుధమేదైనా" అని మొదటి చరణం, "అందరికీ సొంతం అందాల లోకం.. కొందరికే ఉందా పొందే అధికారం" అంటూ రెండో చరణం రాశారు. సీతారామశాస్త్రి రాసిన వందలాది అర్థవంతమైన పాటల్లో 'కంచె'లోని ఈ పాట కూడా ముందు వరుసలో ఉంటుంది. ఆయన స్వదస్తూరితో ఆ పాట ఇలా ఉంటుంది...

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
