ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకున్నాను
on Sep 25, 2023
జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను, ఒత్తిడులను తట్టుకోలేక ఇటీవల కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో హీరో కమల్‌హాసన్ ఆ విషయంపై స్పందించారు. ఒక కార్యక్రమంలో దీనిపై మాట్లాడుతూ ‘‘ప్రతి వ్యక్తి జీవితంలో ఒత్తిడి అనేది ఉంటుంది. ఒకవిధంగా ఒత్తిడి ఉంటేనే అనుకున్నది సాధించవచ్చు అనేది సైకియాట్రిస్టులు చెప్తున్న మాట. అయితే దాన్ని నెగెటివ్‌గా తీసుకొని కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆ పరిస్థితి నాకూ వచ్చింది.
నేను 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. నాకు సినిమాల్లో అవకాశాలు రాకపోవడం, నాకు తగినంత గుర్తింపు లభించకపోవడంతో ఎంతో బాధపడ్డాను. అంతలోనే సంభాళించుకొని ఆ ప్రయత్నాని విరమించుకున్నాను. నేను చనిపోతే.. ఎంతో ప్రతిభ ఉన్న కళాకారుడిని కోల్పోయామని చిత్రపరిశ్రమ బాధపడుతుందని భావించాను. అంత కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే ఆత్మహత్య ఆలోచనను అధిగమించగలిగాను. ఈ విషయంలో నా గురువు అనంతు చెప్పిన మాటలు నన్ను ఎంతో ఇన్‌స్పైర్ చేశాయి. ‘నీ పని నువ్వు చేసుకుపో. సమయం వచ్చినపుడు నీకు గుర్తింపు దానంతట అదే వస్తుంది’ అని ధైర్యం చెప్పారు. ఆయన మాటలు విన్న తర్వాత ఆత్మహత్య చేసుకోవడం ఎంత తప్పో అర్థమైంది. నా దృష్టిలో హత్య చేయడం ఎంత నేరమో, ఆత్మహత్య చేసుకోవడం కూడా అంతే నేరం. జీవితం ఎంత చీకటి మయం అయిపోయినా ఏదో ఒక రోజు వెలుగు అనేది కనిపిస్తుంది. అప్పటివరకు ఓపిక ఎదురుచూస్తూ మన కర్తవ్యం మనం నిర్వర్తించాలి. అబ్దుల్ కలాంగారు చెప్పినట్టు ‘నిద్రపోయినప్పుడు వచ్చేది కాదు కల అంటే.. మనల్ని నిద్రపోనివ్వకుండా చేసేదే అసలైన కల’. ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు మీ కలను, లక్ష్యాన్ని గుర్తు చేసుకోండి. దాని కోసం ఎంత కృషి చేయాలి అనేది ఆలోచించి ఆ ప్రకారం ముందుకు వెళ్లాలి. మిమ్మల్ని తప్పకుండా విజయం వరిస్తుంది’ అని చెప్పిన కమల్‌హాసన్ మాటలు కార్యక్రమానికి వచ్చిన వారిని ఎంతో ఇన్‌స్పైర్ చేశాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



