పెద్ద ఎన్టీఆర్ లాగా తారక్ ఎవరికీ భయపడడు!
on Jan 29, 2020

సీనియర్ ఎన్టీఆర్ తరహాలోనే చిన్న ఎన్టీఆర్ కూడా ధైర్యవంతుడనీ, ఎవరికీ భయపడడనీ అంటున్నారు సీనియర్ నటులు చలపతిరావు. ఆయన నందమూరి తారకరామారావు వీరాభిమాని మాత్రమే కాదు, ఆయనతో కలిసి చాలా సినిమాల్లో నటించారు కూడా. ఇప్పుడు తారక్‌తోనూ కలిసి ఆయన నటిస్తున్నారు. తారక్ అభిమానులు 'టీమ్ తారక్ ట్రస్ట్' పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో బుధవారం వాళ్లు అనాథల కోసం హైదరాబాద్‌లోని బోడుప్పల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో చలపతిరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఆ సందర్భంగా చలపతిరావు మాట్లాడుతూ "ఈ ప్రపంచంలో భయపడని వ్యక్తి ఎవరయ్యా అంటే.. మా పెద్ద ఎన్టీఆర్ గారే. ఆయన అడుగుజాడల్లో మేం నడుస్తున్నాం. ఆయన చేసిన గుప్తదానాలు ఎవరికీ తెలీవు. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ సోషల్ మీడియా లేదు. ఆయన ఏం చేసినా బయటకు తెలీదు కానీ మాకు తెలుసు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చాడు. అతను కూడా చాలా ధైర్యవంతుడు. ఎవడు ఫోన్లు చేసినా భయపడడు. ఈ యూత్ కూడా ఎంతో ధైర్యంగా 33 ఈవెంట్లు చేశారంటే చాలా గొప్ప విషయం. ఈ కుర్రాళ్లందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 'మేం ఎవరికీ భయపడం. మేం చెయ్యాలనుకున్నది చేస్తాం' అంటున్నారు. వీళ్లు సేవ చేయాలనుకుంటున్నది లేనివాళ్లకి. ఉన్నవాళ్లకు సేవ చెయ్యాల్సిన పనిలేదు. ఇది పెద్ద ఎన్టీఆర్ రక్తం నుంచి తారక్‌కు వచ్చింది. అతని అడుగుజాడల్లో ఈ యూత్ అంతా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్లు సైనికులు. వీళ్లను పొగిడితే ఎక్కడ దిష్టి తగులుతుందో అనిపిస్తుంది. ఈరోజు వీళ్ళు చేస్తున్న సేవాకార్యక్రమం చూసి నా కళ్ళు చెమర్చాయి. వృద్ధులకు, అనాథ పిల్లలకు వీళ్ళు చేస్తున్న సహాయం, ఇంకా చేయాలన్న తపన నాకు ముచ్చటగా అనిపిస్తోంది. వీళ్లు ఎక్కడెక్కడినుండో వచ్చారు. నిజంగా తారక్ అదృష్టవంతుడు. ఇలాంటి అభిమానులను సంపాదించుకున్నాడు" అని చెప్పారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



