ఇంట్లో దెయ్యం - నాకేం భయం మూవీ రివ్యూ
on Dec 30, 2016
అందరూ దెయ్యం సినిమాలు తీస్తున్నారు.. నేనూ ఒకటి తీసేస్తే పోలా... అని నరేష్ అనుకొని ఉంటాడు. దెయ్యం కథ చెప్పడం, చూపించడం, నవ్వించడం మహా సింపుల్ అని నాగేశ్వరెడ్డి భ్రమ పడి ఉంటాడు. ఇలాంటి సినిమాకి చాలా తక్కువ బడ్జెట్ అవుతుంది.. భారీ లాభాలొస్తాయి అని బివిఎస్ఎన్ ప్రసాద్ పాడైపోయిన క్యాలిక్‌లేటర్‌తో లెక్కలు కట్టి ఉంటారు. ఈ ముగ్గురూ ఈ నిర్ణయానికి రావడం.. కచ్చితంగా తెలుగు ప్రేక్షకుల దురదృష్టమే అన్న సంగతి ఆరోజున వాళ్లకు తెలిసుండకపోవొచ్చు. చూసిన ఆడియన్స్ కి మాత్రం ఖచ్చితంగా ఇదో భయంకరమైన రోజు! మరింతకీ ఈ దెయ్యం భయపెట్టిందా, హింసించిందా, విసిగించిందా?? అది ఏ స్థాయిలో తెలియాలంటే - రివ్యూలోకి వెళ్లాల్సిందే.
* కథ
ఊరవతల ఉన్న ఓ పెద్ద ప్యాలెస్‌ని రాజేంద్ర ప్రసాద్ చాలా తక్కువ రేటుకే కొనేస్తాడు. ఆ ఇంట్లో తన కూతురి పెళ్లి చేయాలని డిసైడ్ అవుతాడు. చుట్టాలంతా మెల్లిమెల్లిగా వస్తుంటారు. ఈలోగా ఆ ఇంట్లో రాజేంద్ర ప్రసాద్‌కి ఓ దెయ్యం కనిపిస్తుంది. ఈ ఇంట్లో నీ కూతురి పెళ్లి జరగనివ్వను.. అని శపథం చేస్తుంది. ఏదోలా ఓ భూత వైద్యుడ్ని పట్టుకొని ఆ దెయ్యాన్ని ఇంట్లోంచి తరిమేసి.. అప్పుడు కూతురు పెళ్లి చేద్దాం అనుకొంటాడు రాజేంద్ర ప్రసాద్. భూత వైద్యుడికి చేయబోయి బ్యాండ్ వాయించుకొనే నరేష్‌కి ఫోన్ చేస్తాడు. సరిగ్గా ఆ సమయానికే నరేష్‌కి మూడు లక్షలు కావాల్సివుంటుంది. కేవలం డబ్బుల కోసం భూతవైద్యులమని చెప్పి ఆ ఇంట్లో ప్రవేశిస్తాడు నరేష్. అక్కడి నుంచి దెయ్యం అరాచకాలు మరింత ఎక్కువైపోతాయి. ఆ దెయ్యం ఎవరో కాదు.. తన మరదలు స్వప్న అనే నిజం తెలుస్తుంది నరేష్‌కి. స్వప్న ఎందుకు చచ్చిపోయింది? స్వప్న కోరిక ఏంటి? అది తీరిందా, లేదా? అనేదే మిగిలిన కథ.
* విశ్లేషణ
దర్శకుడు నాగేశ్వర రెడ్డిని చూస్తే జాలేస్తోంది. ఏమాత్రం ప్రిపరేషన్ లేకుండా ఎగ్జామ్ హాల్ లో కూర్చున్న పిల్లాడి చేతికి క్వశ్చన్ పేపర్ ఇస్తే ఏం చేస్తాడు? బిక్క మొహం వేయడం తప్ప. నాగేశ్వరరెడ్డి కూడా కథ, కథనాలపై ఏమాత్రం కసరత్తు చేయకుండా రంగంలోకి దిగిపోయాడేమో అనిపిస్తుంది. హారర్, కామెడీ సినిమా అన్నారు గానీ.. ఇవి రెండూ ఈ కథలో పేలలేదు. నరేష్ - కృతికల లవ్ ట్రాక్ చాలా కృత్రిమంగా ఉంది. ఆసనాలపై కూడా కుళ్లు జోకులు వేసి నవ్వమంటే ఎలా?? పసిపాపకు హార్ట్‌లో హోల్ పడితే.. ఏ డాక్టర్ అయినా దాన్ని జోక్‌గా చెబుతాడా? ఎక్కడ జోక్ వేయాలో, ఎక్కడ వేయకూడదో దర్శకుడికీ, ఆ సీన్ రాసిన రచయితకూ తెలీదా?? నరేష్ ఆ బంగ్లాలోకి ప్రవేశించాక కథ, కథనాలు పరుగులు పెట్టాలి. కానీ... సినిమా క్లైమాక్స్‌కి వచ్చినా అది మాత్రం జరగదు. ఇప్పటి వరకూ వచ్చిన అన్ని హారర్ కామెడీ సినిమాల్ని ఓసారి చూసుకొని.. అందులో రిపీట్ అయిన సీన్లతోనే మరో కథ రాసుకొంటే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుంది.
దెయ్యం ఫ్లాష్ బ్యాక్ బీసీ కాలం నాటిది. ఆత్మని బంధించడానికి తాయెత్తులు కట్టుకోవడం, గుడి లోంచి బయటకు రావడానికి దెయ్యం వేసే ట్రిక్కులు ఇవన్నీ పురానా మందిర్ సినిమా నాటివి. వాటిని ఈ రోజుల్లో కూడా ప్లే చేయాలనుకోవడం చూస్తుంటే దర్శకుడిపై జాలి పడడం తప్ప ఇంకేం చేయగలం?? కబాలిరా.. డైలాగ్‌ని పేరడీ చేయడం, ప్రతీ పాత్ర పావలాకి రూపాయిన్నర ఓవరాక్షన్ చేయడం, అర్థం పర్థం లేని ఎక్స్‌ప్రెషన్లూ... ఇవన్నీ ప్రేక్షకుల్ని విసుగెత్తిస్తాయి. ఓపిక ఉంటే.. థియేటర్ల నుంచి పరుగులు పెట్టించేలా చేస్తాయి. ఈ సినిమాలో హీరోయిన్ అవసరం ఏమిటో అర్థం కాదు. ఆమె సన్నివేశాల్లో కనిపించడం నిషేధం అన్నట్టు కేవలం పాటలకే వస్తూ పోతూ ఉంటుంది. కామెడీ చేయాల్సిన నరేష్ ఇంకా తన ఫ్లాప్ సినిమాల్లోని పాత డైలాగులే పట్టుకొని వేలాడితే.. జబర్ దస్త్ బ్యాచ్.. ఆ స్టేజీ మీద చేసీ చేసీ అరిగిపోయిన స్కిట్టుని ఈ సినిమాలో వాడుకొన్నట్టు అనిపిస్తుంది. ఏ సీనూ నవ్వించదు.. ఏదీ భయపెట్టదు. అదీ.. ఈ హారర్ కామెడీ దుస్థితి.
* నటీనటుల ప్రతిభ
నరేష్ పరిస్థితి రోజు రోజుకీ దారుణంగా తయారవుతుంది. తన కామెడీ టైమింగ్ తప్పుతోంది. పాత డైలాగులే పదే పదే వల్లివేయాల్సివస్తోంది. ఏ సీన్ కైనా ఒక్కటే ఎక్స్‌ప్రెషన్. ఈ సినిమాలోనూ తన జాతకం మారలేదు. కృతిక హీరోయిన్ పాత్రకి శుద్ద వేస్ట్ అనిపిస్తుంది. ఇంకా ఓనమాల స్థాయిలోనే ఉందేమో..? ఆత్మ పాత్రలో చేసిన మౌర్యానీనే కాస్త బెటర్ ఏమో..? కాకపోతే మొహం మీద జుత్తు కప్పేసి ఆ పాత్రని దాచేశారు. షకలక శంకర్ ఒక్కడే కాస్త బెటర్ అనిపిస్తాడు. ఛమ్మక్ చంద్రది జబర్ దస్త్ కామెడీనే. రాజేంద్ర ప్రసాద్ లాంటి నటుడ్ని వాడుకోవడం కూడా తెలియలేదు. తాను ఓవరాక్షన్ చేసిన సందర్భాలు ఈ సినిమాలో కోకొల్లలుగా కనిపిస్తాయి.
* సాంకేతిక వర్గం
ఓ సినిమాకి కథ, కథనం, పాత్రల స్వభావం ఇవి ముఖ్యం. ఆ తరవాతే.. సాంకేతిక వర్గం. ఈ సినిమాలో పునాదే బలంగా లేనప్పుడు దానిపైపైన మెరుగులు ఎవరికి కావాలి? పాటలు అవసరమా అనిపించేలా ఉన్నాయి. నేపథ్య సంగీతం అయితే ఒకటే రోత. జ్యో అత్యుతానంద పాటని హారర్ మ్యూజిక్‌లో ఎందుకు వాడుకొన్నారో అర్థం కాదు. కెమెరా వర్క్ బాగుంది. కానీ వైర్ వర్క్ సాయంతో దెయ్యం గాల్లో ఎగురుతున్నట్టు స్పష్టంగా అర్థమైపోతోంది. డైమండ్ రత్నబాబు మాటలేం మెరవలేదు. `రైతుకు కావల్సింది వర్షం.. పోలీసుకు కావాల్సింది సాక్షం` అంటూ ముతక డైలాగులు వల్లించాడు. నాగేశ్వరరెడ్డి దర్శకుడిగానే కాదు, కథకుడిగానూ దారుణంగా ఫెయిల్ అయ్యాడు.
* ఫైనల్ టచ్ : ఇంట్లో దెయ్యానికి భయపడకపోయినా.. నరేష్ సినిమా అంటే... భయపడి తీరాల్సిందే
*రేటింగ్ : 1

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
