ఫస్ట్ టైమ్ వరల్డ్ కప్‌లో పాక్ చేతిలో చిత్తుగా ఓడిన భారత్.. అదీ 10 వికెట్ల తేడాతో!
on Oct 24, 2021

అటు వన్డేల్లో కానీ, ఇటు టీ20ల్లో కానీ నిన్నటిదాకా వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ చేతిలో ఓటమి ఎరుగని భారత్ నేడు (ఆదివారం) జరిగిన వరల్డ్ కప్ టీ20 మ్యాచ్‌లో చిత్తు చిత్తుగా ఓటమి పాలయింది. తొలిసారి భారత్‌ను వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఓడించామనే విజయ గర్వంతో పాక్ వేడుక చేసుకుంది. గ్రూప్2లోని తమ తొలి మ్యాచ్‌లోనే పరస్పరం తలపడ్డ దాయాదుల్లో పాక్‌దే పైచేయి అయింది. పైగా పరుగులు తీయడానికి భారత్ అష్టకష్టాలు పడ్డ పిచ్‌పైనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా పది వికెట్ల తేడాతో ఇంకా 13 బంతులు ఉండగానే అతి సునాయాసంగా పాక్ గెలిచింది. పాక్ ఆడిన తీరు చూస్తే, భారత్‌పై అన్ని విధాలా సన్నద్ధమైందని అర్థమవుతోంది.
మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ట నష్టానికి 151 పరుగులు చేయగా, పాక్ 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని అధిగమించేసింది. మొదట 10 ఓవర్ల వరకు నెమ్మదిగా ఆడుతూ, వికెట్లు కాపాడుకున్న ఓపెనర్లు, ఆ తర్వాత స్పీడ్ పెంచారు. 8వ ఓవర్‌లో 50 పరుగులు చేసిన వారు, 13వ ఓవర్‌లో 100 పరుగుల మైలురాయిని దాటారు. మొదట కెప్టెన్ బాబర్ ఆజమ్ 40 బాల్స్‌లో హాఫ్ సెంచరీని దాటగా, తర్వాత మహమ్మద్ రిజ్వాన్ 41 బంతుల్లో హాఫ్ సెంచరీతో కెప్టెన్‌ను అనుసరించాడు. ఆ తర్వాత మరింత వేగంగా ఆడిన రిజ్వాన్ కెప్టెన్‌ను దాటేసి ఎక్కువ పరుగులు చేశాడు. అతను 55 బాల్స్‌లో 78 రన్స్ చేయగా, బాబర్ 52 బాల్స్‌లో 68 రన్స్ చేశాడు.
ఓపెనర్ల ద్వయాన్ని విడదీయడంలో భారత్ బౌలర్లు విఫలమయ్యారు. భారత్ ఇన్నింగ్స్‌లో టాప్ ఆర్డర్‌లోని ముగ్గురు బ్యాటర్స్ (రోహిత్, రాహుల్, విరాట్)ను షహీన్ అఫ్రిది ఔట్ చేసినట్లు మన బౌలర్లలో ఏ ఒక్కరూ పాక్ ఓపెనర్లను ఇబ్బంది పెట్టలేకపోయారు. బూమ్ బూమ్ బుమ్రా కానీ, భువనేశ్వర్ కానీ, మహమ్మద్ షమీ కానీ ఏమాత్రం మెరుపులు మెరిపించలేకపోయారు. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి కూడా అంతే.
18వ ఓవర్‌లో అయితే షమీ బౌలింగ్ మరింత తీసికట్లుగా ఉంది. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయాల్సిన ఆ టైమ్‌లో లూజ్ బాల్స్‌తో ఒక సిక్సర్, 2 బౌండరీలు సమర్పించుకున్నాడు. దాంతో ఆ ఓవర్‌లో 5 బంతుల్లోనే 17 పరుగులు రాబట్టి విజయగర్వంతో ఎగిరి గంతులేశారు పాక్ ఓపెనర్స్. తొలిసారి వరల్డ్ కప్‌లో ఆ దేశంపై ఓటమితో భారత్ తలదించుకుంది. గొప్పగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టిన షహీన్ అఫ్రిది ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



