హిట్ 3 మూవీ రివ్యూ
on May 1, 2025
తారాగణం: నాని, శ్రీనిధి శెట్టి, సముద్రఖని, సూర్య శ్రీనివాస్, ఆదిల్ పాలా, రావు రమేష్, మాగంటి శ్రీనాథ్ తదితరులు
సంగీతం: మిక్కీ జె. మేయర్
డీఓపీ: సాను జాన్ వర్గీస్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల
రచన, దర్శకత్వం: శైలేష్ కొలను
నిర్మాతలు: ప్రశాంతి తిపిర్నేని, నాని
బ్యానర్స్: వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ: మే 1, 2025
'హిట్' ఫ్రాంచైజ్ లో రూపొందిన మూడో సినిమా 'హిట్: ది థర్డ్ కేస్'. హిట్-1లో విశ్వక్ సేన్, హిట్-2లో అడివి శేష్ లీడ్ రోల్స్ చేయగా.. హిట్-3 కోసం న్యాచురల్ స్టార్ నాని రంగంలోకి దిగాడు. దాంతో మొదటి నుంచి సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎంతో క్రేజ్ ఉన్న నాని.. మునుపెన్నడూ లేని విధంగా మోస్ట్ వయలెంట్ గా కనిపిస్తున్నాడు. స్క్రీన్ ఎరుపెక్కబోతోందని టీజర్, ట్రైలర్ తోనే అర్థమైపోయింది. సెన్సార్ బోర్డ్ కూడా A సర్టిఫికెట్ ఇచ్చింది. నాని సైతం పిల్లల్ని, సున్నిత మనస్కులని ఈ సినిమాకి దూరంగా ఉండమని చెప్పాడు. మరి హిట్ 3 ఎలా ఉంది? వయలెన్స్ ని నమ్ముకున్న నాని, విజయాన్ని అందుకున్నాడా? వరుస హిట్స్ తో జోష్ లో ఉన్న న్యాచురల్ స్టార్ ఖాతాలో మరో హిట్ పడిందా లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. (Hit 3 Movie Review)
కథ:
వైజాగ్ హిట్ టీంలోకి ఎస్పీ క్యాడర్ లో అర్జున్ సర్కార్(నాని) వస్తాడు. క్రిమినల్స్ ని పట్టుకోవాల్సిన అర్జున్.. తానే క్రిమినల్ గా మారి హత్యలు చేస్తాడు. తాను చేసిన హత్యను తానే ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. మరోవైపు అప్పటిదాకా ప్రేమ, పెళ్ళికి దూరంగా ఉన్న అర్జున్ సర్కార్.. అనుకోకుండా పరిచయమైన మృదుల(శ్రీనిధి శెట్టి)తో ప్రేమలో పడతాడు. అసలు అర్జున్ క్రిమినల్ గా ఎందుకు మారాడు? బయట ప్రపంచానికి తెలియని మోస్ట్ డేంజరస్ గ్యాంగ్ CTK లోకి అతను ఎందుకు ఎంటర్ అవ్వాలి అనుకున్నాడు? CTK గ్యాంగ్ లోకి వెళ్లిన అర్జున్ ప్రాణాలతో బయటపడగలిగాడా? అసలు అర్జున్ లైఫ్ లోకి మృదుల ఎందుకు వచ్చింది? వారి ప్రేమ కథ విజయ తీరాలకు చేరిందా? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
హిట్ 1, హిట్ 2 సినిమాల విషయానికొస్తే.. ఒక క్రైమ్ జరుగుతుంది, ఆ క్రైమ్ వెనక ఎవరున్నారో కనిపెట్టి, కేసు సాల్వ్ చేయడం హీరో పని. క్రైమ్ థ్రిల్లర్స్ అన్నీ దాదాపు ఇదే టెంప్లేట్ లో ఉంటాయి. కానీ హిట్ 3 మాత్రం అందుకు భిన్నంగా సాగింది. మొదట హీరో పాత్రని ఓ క్రిమినల్ లా పరిచయం చేశారు. ఆ తర్వాత అతను క్రిమినల్ లా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడో చూపించారు. అనంతరం క్రిమినల్ గ్యాంగ్ ని అంతమొందించడానికి ఆ క్రిమినల్స్ లో ఒకడిగా కలిసిపోయిన డేరింగ్ పోలీస్ ఆఫీసర్ గా ఆ పాత్రను నడిపించారు.
ఓ రకంగా ఇది హీరో పాత్ర ప్రధానంగా సాగే సినిమా. అర్జున్ సర్కార్ పాత్రను దర్శకుడు శైలేష్ కొలను మలిచిన తీరు బాగుంది. ఆ పాత్ర బిహేవియర్, బాడీ ల్యాంగ్వేజ్ సినిమాకి కొత్తదనాన్ని తీసుకొచ్చాయి. ఇక నాని, ఆ పాత్రలో పరకాయప్రవేశం చేయడంతో.. సర్కార్ రోల్ కి మరింత బలం చేకూరిందని చెప్పవచ్చు.
అర్జున్ సర్కార్ పోలీస్ కాదు, క్రిమినల్ అని.. అతనిపై చర్యలు తీసుకోవాలి అంటూ కోర్టు, కేసుల హడావుడితో సినిమా ప్రారంభమవుతుంది. జైలులో అడుగుపెట్టిన అర్జున్.. అక్కడ తోటి ఖైదీతో తాను జైలుకి ఎందుకు వచ్చాడో చెప్పుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అయిన సర్కార్.. సైకో కిల్లర్ తరహాలో హత్యలు ఎందుకు చేస్తున్నాడు అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఆ తర్వాత అసలు అర్జున్ ఇలా ఎందుకు చేస్తున్నాడో రివీల్ అవుతుంది. ఈ క్రమంలో కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఎపిసోడ్ బాగానే ఉన్నప్పటికీ, కాస్త ల్యాగ్ అనిపిస్తుంది. ఇంటర్వెల్ కి ముందు వచ్చే సన్నివేశాలు మాత్రం మెప్పిస్తాయి. సెకండాఫ్ ఎక్కువ శాతం ఒకటే ప్లేస్ లో జరుగుతుంది. సైకోల మధ్యలోకి సైకో లాంటి పోలీస్ ఎంటరైతే ఎలా ఉంటుంది? అనేలా సెకండాఫ్ నడిచింది. ముఖ్యంగా పతాక సన్నివేశాలు మెప్పించాయి. అయితే ప్రీ క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీన్స్ మాత్రం.. తెలుగు సినిమాలో ఈ స్థాయి వయలెన్స్ చూడమేమో అనే స్థాయిలో ఉంటాయి.
రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్స్ లా హీరో ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ వెళ్లి, విలన్ ని పట్టుకోవడంలా కాకుండా.. హిట్ 3 కాస్త ఫ్రెష్ థీమ్ తో నడిచింది. అదే ఈ సినిమాకి ప్లస్. అదే సమయంలో బిగ్ ట్విస్ట్ లు, టర్న్ లు లేకపోవడం ఆడియన్స్ ని కొంత డిజప్పాయింట్ చేయవచ్చు. అలాంటివి ఆలోచించకుండా అర్జున్ సర్కార్ రోల్ కి, ఎమోషన్స్ కి, యాక్షన్ సీన్స్ కి కనెక్ట్ అయితే మాత్రం.. సినిమా చూస్తున్నంతసేపు దాదాపు ఎక్కడా బోర్ కొట్టదు. హిట్ 3 లో కొన్ని మైనస్ లు కూడా ఉన్నాయి. అసలు ఈ కథకి లవ్ ట్రాక్ జోడించకుండా కూడా.. స్క్రీన్ ప్లేని మరింత గ్రిప్పింగ్ గా నడిపించే అవకాశముంది. అలాగే అర్జున్ సర్కార్ రోల్ ఎంతో పవర్ ఫుల్ గా ఉండగా, అతను ఢీ కొట్టిన విలన్ రోల్ మాత్రం పవర్ ఫుల్ గా లేదు.
నటీనటుల పనితీరు:
హిట్-3 లో నానిది వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు. ఎప్పటిలాగే ఎమోషనల్ సీన్స్ లో చక్కగా రాణించాడు. ఇక యాక్షన్ సీన్స్ లో అయితే సరికొత్తగా కనిపించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, అర్జున్ సర్కార్ గా విశ్వరూపం చూపించాడు. తన ఇమేజ్ కి భిన్నంగా చేసిన వయలెంట్ రోల్ లో అదరగొట్టాడు. సినిమా అంతా దాదాపు నానినే కనిపిస్తుంటాడు. మృదులగా శ్రీనిధి శెట్టి ఆకట్టుకుంది. సముద్రఖని, సూర్య శ్రీనివాస్, ఆదిల్ పాలా, రావు రమేష్, మాగంటి శ్రీనాథ్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.
మిక్కీ జె. మేయర్ పాటలతో పెద్దగా మ్యాజిక్ చేయలేకపోయాడు. తన నేపథ్య సంగీతంతో మాత్రం సీన్స్ ని బాగానే ఎలివేట్ చేసే ప్రయత్నం చేశాడు. సాను జాన్ వర్గీస్ కెమెరా పనితనం మెప్పించింది. క్రైమ్ థ్రిల్లర్ జానర్ కి తగ్గట్టుగా ఆయన ఫ్రేమింగ్, కలర్ టోన్ ఉంది. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ షార్ప్ గానే ఉంది. కొన్ని ఎపిసోడ్స్ ని మాత్రం ఇంకా ట్రిమ్ చేయొచ్చు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో వచ్చే కాశ్మీర్ ఎపిసోడ్. ప్రొడక్షన్ డిజైనర్ శ్రీ నాగేంద్ర తంగాల పనితనం ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్ గా..
ట్విస్ట్ లను కాకుండా.. యాక్షన్ ని, ఎమోషన్ ని నమ్ముకొని తీసిన థ్రిల్లర్ ఇది. వయలెన్స్ తో కూడిన క్రైమ్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే వారికి హిట్ 3 నచ్చుతుంది. ముందు నుంచి చెప్పినట్టుగానే సున్నిత మనస్కులు ఈ సినిమా చూడక పోవడమే బెటర్.
రేటింగ్: 2.75/5

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
