ENGLISH | TELUGU  

2021 జ్ఞాప‌కాలుః అల‌రించిన అగ్ర క‌థానాయిక‌లు.. `హీరోయిన్ ఆఫ్ ద ఇయ‌ర్` సాయిప‌ల్ల‌వి!

on Dec 30, 2021

2021 క్యాలెండ‌ర్ ఇయ‌ర్ లో అనుష్క మిన‌హాయిస్తే దాదాపు అగ్ర క‌థానాయిక‌లంద‌రూ సినిమాల‌తో సంద‌డి చేశారు. ఆ నాయిక‌ల వివ‌రాల్లోకి వెళితే..

శ్రుతి హాస‌న్ః- ఈ ఏడాది ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న నాయిక శ్రుతి హాస‌న్. `క్రాక్`తో ఈ క్యాలెండ‌ర్ ఇయ‌ర్ లో తొలి ఘ‌న‌విజ‌యం చూసిన చెన్నై పొన్ను శ్రుతి.. ఆపై `వ‌కీల్ సాబ్`తో మ‌రో స‌క్సెస్ చూసింది. `క్రాక్`లో ర‌వితేజ‌, `వ‌కీల్ సాబ్`లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న శ్రుతి క‌నువిందు చేసింది.

కాజ‌ల్ః- టాలీవుడ్ చంద‌మామ‌ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఈ ఏడాది తెలుగునాట `మోస‌గాళ్ళు` చిత్రంతో ఎంట‌ర్టైన్ చేసింది. ఆ సినిమా ఆశించిన విజ‌యం సాధించక‌పోయినా త‌న‌దైన అభిన‌యంతో అల‌రించింది కాజ‌ల్.

త‌మ‌న్నాః- మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఈ ఏడాది `సీటీమార్`, `మాస్ట్రో` చిత్రాల‌తో వారం గ్యాప్ లో సంద‌డి చేసింది. తెలంగాణ క‌బ‌డ్డీ కోచ్ జ్వాలా రెడ్డిగా `సీటీమార్`లో స‌త్తా చాటిన త‌మ‌న్నా.. ఓటీటీలో స్ట్రీమ్ అయిన `మాస్ట్రో`లో నెగ‌టివ్ రోల్ లో ఆక‌ట్టుకుంది.

సాయిప‌ల్ల‌విః- ఈ ఏడాది సాయిప‌ల్ల‌వి రెండు సినిమాల్లో క‌నువిందు చేసింది. `ల‌వ్ స్టోరి`, `శ్యామ్ సింగ రాయ్`.. ఇలా ఈ సంవ‌త్స‌రం సాయిప‌ల్ల‌వి నుంచి వ‌చ్చిన‌ రెండు చిత్రాలు కూడా ఆమెకి న‌టిగా మంచి గుర్తింపుని తీసుకువ‌చ్చాయి. ఈ రెండు సినిమాల్లోనూ నృత్యాల‌తోనూ మెస్మ‌రైజ్ చేసింది ప‌ల్ల‌వి. ఓవ‌రాల్ గా.. హీరోయిన్ ఆఫ్ ద ఇయ‌ర్ అనిపించుకుంది.

పూజా హెగ్డేః- వ‌రుస విజ‌యాల‌తో ముందుకు సాగుతున్న బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే.. ఈ క్యాలెండ‌ర్ ఇయ‌ర్ లో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్`తో ప‌ల‌క‌రించింది. అక్కినేని అఖిల్ కి తొలి విజ‌యాన్ని అందించిన నాయిక‌గా ప్ర‌త్యేక‌ గుర్తింపు తెచ్చుకుంది.

ర‌కుల్ ప్రీత్ సింగ్ః- ఈ ఏడాది `చెక్`, `కొండ పొలం` చిత్రాల‌తో వెండితెర‌పై సంద‌డి చేసింది ర‌కుల్ ప్రీత్ సింగ్. ఈ రెండు సినిమాల్లోనూ అభినయానికి ఆస్కార‌మున్న పాత్ర‌ల్లో క‌నిపించింది. అయితే, క‌మ‌ర్షియ‌ల్ గా మాత్రం ర‌కుల్ కి ఈ ప్రాజెక్ట్స్ అచ్చిరాలేద‌నే చెప్పాలి.

శ్రియః- ఈ ఏడాదితో నాయిక‌గా 20 ఏళ్ళ కెరీర్ ని పూర్తిచేసుకున్న ఎవ‌ర్ గ్రీన్ బ్యూటీ శ్రియ‌.. `గ‌మ‌నం` అనే ఆంథాల‌జీలో అభినయానికి ఆస్కార‌మున్న పాత్ర‌లో ఆక‌ట్టుకుంది.

నిత్యా మీన‌న్ః- ఈ సంవ‌త్స‌రం నిత్యా మీన‌న్ `నిన్నిలా నిన్నిలా`, `స్కై లాబ్`, `గ‌మ‌నం`లో క‌నిపించింది. వీటిలో `స్కై లాబ్`కి ఓ నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రించింది. అయితే, ఈ సినిమాలేవీ ఆశించిన విజ‌యం సాధించ‌లేదు.

ర‌ష్మిక మంద‌న్నః- ఈ సంవ‌త్స‌రం ర‌ష్మిక మంద‌న్న రెండు డ‌బ్బింగ్ సినిమాల‌తోనూ, ఒక స్ట్ర‌యిట్ పిక్చ‌ర్ తోనూ సంద‌డి చేసింది. ప్ర‌థ‌మార్ధంలో వ‌చ్చిన అనువాద చిత్రాలు `పొగ‌రు`, `సుల్తాన్` జ‌స్ట్ ఓకే అనిపించుకోగా.. ఏడాది చివ‌ర‌లో వ‌చ్చిన పాన్ - ఇండియా మూవీ `పుష్ప - ద రైజ్`తో త‌న‌కి స‌క్సెస్ ద‌క్కింది.

కీర్తి సురేశ్ః- ఈ క్యాలెండ‌ర్ ఇయ‌ర్ లో కీర్తి సురేశ్ నాయిక‌గా `రంగ్ దే`, అతిథి పాత్ర‌లో `జాతిర‌త్నాలు`, ప్ర‌ధాన పాత్ర‌ల్లో `మ‌ర‌క్కార్` (మ‌ల‌యాళ అనువాదం), `పెద్ద‌న్న` (త‌మిళ అనువాదం) చిత్రాలు వ‌చ్చాయి. వీటిలో `జాతిర‌త్నాలు` మాత్ర‌మే విజ‌యం సాధించింది.

న‌య‌న‌తారః- ఈ సంవ‌త్స‌రం లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార `నెట్రిక్క‌న్`, `పెద్ద‌న్న‌` వంటి అనువాదాల్లో క‌నిపించింది. అలాగే, చాలాకాలంగా విడుద‌ల‌కు నోచుకుని `ఆర‌డుగుల బుల్లెట్` ఈ ఏడాదే తెర‌పైకి వ‌చ్చింది. అయితే, ఇవేవీ స‌క్సెస్ కాలేదు.

స‌మంతః- చెన్నై పొన్ను స‌మంత ఈ ఏడాది ఒకే ఒక తెలుగు చిత్రంలో ద‌ర్శ‌న‌మిచ్చింది. అది కూడా ప్ర‌త్యేక గీతంలోనే. ఆ సినిమానే.. `పుష్ప - ద రైజ్`. ఇందులో సామ్ ఆడిపాడిన ``ఊ అంటావా మామా`` చార్ట్ బ‌స్ట‌ర్ గా నిలిచింది.

ప్రియ‌మ‌ణిః- సీనియ‌ర్ హీరోయిన్ ప్రియ‌మ‌ణి ఈ ఏడాది `నార‌ప్ప‌`లో న‌ట‌న‌కు ప్రాధాన్య‌మున్న పాత్ర‌లో క‌నిపించింది. అమెజాన్ ప్రైమ్ లో ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ నేరుగా స్ట్రీమ్ అయింది.

ప్ర‌గ్యా జైశ్వాల్ః- తెలుగునాట దాదాపు ఏడేళ్ళుగా నాయిక‌గా న‌టిస్తున్న ప్ర‌గ్యా జైశ్వాల్ కి.. ఈ సంవ‌త్స‌రాంతంలో విడుద‌లైన `అఖండ‌`తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ద‌క్కింది. ఇందులో న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ స‌ర‌స‌న క‌నువిందు చేసింది ప్ర‌గ్య‌.

వీరితో పాటు లావ‌ణ్య త్రిపాఠి (చావు క‌బురు చ‌ల్ల‌గా, ఏ1 ఎక్స్ ప్రెస్), అంజ‌లి - నివేదా థామ‌స్ (వ‌కీల్ సాబ్), అదితి రావ్ హైద‌రీ (మ‌హా సముద్రం) వంటి ప్ర‌ముఖ క‌థానాయిక‌లు కూడా ఈ ఏడాది న‌ట‌న‌కు అవ‌కాశ‌మున్న పాత్ర‌ల్లో ఆక‌ట్టుకున్నారు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.