'గుంటూరు కారం'.. ఇంకొకరు తప్పుకున్నారు!
on Jul 22, 2023

కొన్ని సినిమాలంతే.. ఏదో రూపంలో నిత్యం వార్తల్లో నిలుస్తుంటాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు కొత్త చిత్రం 'గుంటూరు కారం' కూడా ఇందుకు మినహాయింపు కాదు. 'అతడు', 'ఖలేజా' వంటి క్లాస్ మూవీస్ తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మహేశ్ జట్టుకట్టిన సినిమా కావడంతో 'గుంటూరు కారం'పై సహజంగానే జనాల్లో మంచి ఆసక్తి ఉంది. అయితే, ఈ చిత్రం ప్రారంభమైన వేళావిశేషం ఎలాంటిదో గానీ.. మార్పుచేర్పుల వార్తలతో టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయిపోతోంది.
రీసెంట్ గా ఈ సినిమా నుంచి ప్రధాన నాయిక అయిన పూజా హెగ్డే బయటకు వచ్చేసింది. కాల్షీట్ ఇష్యూస్ ఇందుకు కారణమనే మాట వినిపించింది. అయితే పూజకిచ్చిన అడ్వాన్స్ వెనక్కి తీసుకోకుండా.. ఆమె చేత ఓ ఐటమ్ నంబర్ చేయించే ప్లాన్ చేసుకున్నారట త్రివిక్రమ్. అంతేకాదు.. సెకండ్ లీడ్ అయిన శ్రీలీలని పూజ స్థానంలో పెట్టి.. శ్రీలీల చేయాల్సిన క్యారెక్టర్ కి మీనాక్షి చౌదరిని ఎంచుకున్నారని చెప్పుకుంటున్నారు. ఇక పూజ కంటే ముందు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని వార్తలు వచ్చాయి కానీ.. అందులో నిజం లేదని తేలింది. లేటెస్ట్ టాక్ ఏంటంటే.. ఈ సినిమాకి ఛాయాగ్రహకుడు అయిన పి.ఎస్. వినోద్ కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా తాజాగా తప్పుకున్నారట. త్రివిక్రమ్ గత రెండు చిత్రాలు 'అరవింద సమేత', 'అల వైకుంఠపురములో'కి వినోద్ నే కెమెరామేన్. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ఇప్పుడు వినోద్ స్థానంలోకి రవి కె. చంద్రన్ వచ్చిచేరారని తెలిసింది. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
ఏదేమైనా.. షూటింగ్ షెడ్యూల్స్, టెక్నీషియన్స్, యాక్టర్స్, రిలీజ్ డేట్స్.. ఇలా ప్రతీ అంశంలోనూ 'గుంటూరు కారం'కి మార్పుచేర్పులు జరుగుతుండడంతో మహేశ్ అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియాలోనూ 'గుంటూరు కారం' మార్పుచేర్పులపై విస్తృతంగా చర్చ నడుస్తోంది. మరి.. జనవరి 13న రాబోతున్న 'గుంటూరు కారం' ఈ అవరోధాలన్నింటినీ మరిపించేలా అఖండ విజయం సాధిస్తుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



