ట్రైలర్ వచ్చేసింది 'బ్రో' .. 'జల్సా' టచ్ ఇచ్చిన పవన్!
on Jul 22, 2023

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'బ్రో' సినిమా ట్రైలర్ వచ్చేసింది. యూనిట్ ముందుగా ప్రకటించిన 'టైమ్'కే ట్రైలర్ యూట్యూబ్ లో ల్యాండ్ అయింది. మూవీ కాన్సెప్ట్ ఏంటో చెప్పే ప్రయత్నంతోనే ఈ ట్రైలర్ ని కట్ చేశారన్నది స్పష్టం. పవన్ స్క్రీన్ ప్రెజెన్స్, సాయిధరమ్ తేజ్ తో తన కెమిస్ట్రీ.. మెగా ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ ఇచ్చేశాయని చెప్పొచ్చు.
"భస్మాసురుడు అని ఒకడుండేవాడు తెలుసా.. మీ మనుషులందరూ వాడి వారసులు. ఎవడి తల మీద వాడే పెట్టుకుంటాడు. ఇంకెవ్వడికి ఛాన్స్ ఇవ్వడు" అనే పవన్ డైలాగ్ తో మొదలైన ట్రైలర్.. ప్రతీదానికి 'టైమ్ లేదు' అంటూ హడావిడి చేసేసే సాయితేజ్ విజువల్స్ తో ముందుకు సాగింది. సాయితేజ్ సూసైడ్ ఎటెంప్ట్ తరువాత టైమ్ కి మానవ రూపంగా పవన్ కళ్యాణ్ పరిచయమవడం.. ఆపై కొన్ని సరదా విన్యాసాలు చూపించడం జరిగింది. అలాగే "అందరూ టైమ్ లో ముందుకు వెళుతుంటారు.. నువ్వొక్కడివే వెనక్కి వెళ్తున్నావ్" అంటూ సాయితేజ్ తో పవన్ చెప్పే మాట.. ఆసక్తి రేకెత్తిస్తుంది. ఆపై సాయితేజ్ కార్ యాక్సిడెంట్ చూపడం.. "చచ్చి బతికానన్నమాట. అనవరసంగా బతికి చచ్చాను" అంటూ సాయి తేజ్ డైలాగ్ చెప్పడం.. ఆనక కొన్ని ఎమోషనల్ సీన్స్ తాలూకు విజువల్స్.. చివర్లో పవన్ ఫన్నీ డైలాగ్స్ తో 'జల్సా' టచ్ ఇవ్వడం మురిపిస్తుంది. మధ్యలో.. కామెడీ కింగ్ బ్రహ్మానందం కూడా తళుక్కున కనిపించారు. ఓవరాల్ గా.. 'టైమ్'తో మార్కండేయ ప్రయాణం ఎలా సాగిందన్నదే 'బ్రో' సినిమా అని ట్రైలర్ తో చెప్పకనే చెప్పేశారు.
తనే రూపొందించిన తమిళ చిత్రం 'వినోదాయ సిత్తం' ఆధారంగా పి. సముద్రఖని రీమేక్ చేసిన 'బ్రో' జూలై 28న జనం ముందుకు రానుంది. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే సమకూర్చిన ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కి జంటగా కేతిక శర్మ కనిపించనుంది. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందించాడు. మరి.. మేనల్లుడు సాయితేజ్ తో కలిసి పవన్ చేసిన ఈ మల్టిస్టారర్ ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో తెలియాలంటే మరో ఆరు రోజులు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



