కార్తికేయ ఆశలు ఆవిరి!
on Aug 3, 2019
'గుణ 369' మూవీతో విజయం సాధించి కెరీర్లో ఇంకో అడుగు ముందుకు వెయ్యాలనుకున్న కార్తికేయ ఆశలు అడుగంటాయి. శుక్రవారం (ఆగస్ట్ 2) విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరించడంలో విఫలమవుతోందని రిపోర్టులు వస్తున్నాయి. దీనితో పాటు విడుదలైన 'రాక్షసుడు' సినిమా ఆడియన్స్‌ను అలరిస్తూ మంచి కలెక్షన్స్ సాధిస్తుంటే, 'గుణ 369' కలెక్షన్లు నిరాశాజనకంగా ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఒక్క హైదరాబాద్ సిటీలోనే చూసుకుంటే 'రాక్షసుడు' కలెక్షన్స్‌లో 'గుణ 369' కలెక్షన్స్ 50 శాతం కూడా లేవని వారంటున్నారు. దీంతో 'ఆర్ఎక్స్ 100' ఇమేజ్ నుంచి బయటపడి, తనకంటూ సొంత ఇమేజ్ సంపాదించుకోవాలనే కార్తికేయ కోరిక తీరలేదు.
బోయపాటి శ్రీను శిష్యుడు అర్జున్ జంద్యాల డైరెక్ట్ చేసిన 'గుణ 369'పై విడుదలకు ముందు సినీ వర్గాలతో పాటు సాధారణ ప్రేక్షకులూ ఆసక్తి చూపారు. తీరా రిలీజయ్యాక వారి అంచనాలకు భిన్నంగా మూవీ ఉండటమే వసూళ్లపై ప్రభావం చూపుతోంది. ఫ్యామిలీ ఎమోషన్, యాక్షన్ ఎలిమెంట్స్‌కు పెద్ద పీట వేసినప్పటికీ, సెకండాఫ్‌లో ఆడియెన్స్‌ను ఆకట్టుకొనే సన్నివేశాలు లోపించాయనీ, కథనాన్ని ఆకట్టుకొనే రీతిలో దర్శకుడు నడిపించలేకపోయాడనీ విమర్శకులు తేల్చారు. ఇవాళ వస్తున్న దర్శకులు కథనంపైనే ఎక్కువ దృష్టి పెడుతుంటే, వారికి భిన్నంగా తన గురువు బోయపాటి స్టైల్ టేకింగ్‌ను ఎంచుకోవడం సినిమాకి మైనస్ అయ్యిందంటున్నారు.
మొత్తానికి బాక్సాఫీస్ దగ్గర 'గుణ 369' హంగామా ఏమాత్రం కనిపించడం లేదు. దీంతో చేసిన నాలుగు సినిమాల్లో కేవలం ఒకే హిట్ సాధించిన కార్తికేయ కెరీర్ 'ఆర్ఎక్స్ 100' దగ్గరే ఆగినట్లయింది.