థియేటర్లలో గేమ్ ఓవర్.. ఇక ఆరోజు నుంచి గేమ్ అంతా ఓటీటీలోనే!
on Feb 4, 2025
రామ్‌చరణ్, శంకర్ కాంబినేషన్‌లో దిల్‌రాజు నిర్మించిన ‘గేమ్‌ఛేంజర్’ చిత్రం థియేటర్ల నుంచి పక్కకు తప్పుకుంది. అక్కడ గేమ్ ఓవర్ కావడంతో ఓటీటీ గూటికి చేరబోతోంది. ఈ సినిమా ప్రారంభమైనప్పుడు ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే శంకర్ అంటే ఇండియాలోనే టాప్ టెక్నీషియన్ అనే పేరు ఉంది. అలాంటి డైరెక్టర్‌తో సినిమా అంటే సహజంగానే అంచనాలు భారీగా ఉంటాయి. అందులోనూ శంకర్ చేస్తున్న డైరెక్ట్ తెలుగు సినిమా ఇదే కావడం కూడా సినిమాకి హైప్ రావడానికి కారణమైంది. అయితే సినిమా నిర్మాణం బాగా ఆలస్యం కావడం, మధ్యలో రిలీజ్ అయిన భారతీయుడు2 భారీ డిజాస్టర్‌గా నిలవడంతో ఒక్కసారిగా ‘గేమ్ ఛేంజర్’ మీద ఉన్న అంచనాలు గల్లంతయ్యాయి. ఒక సాధారణ కమర్షియల్ సినిమా అనే కలర్ వచ్చేసింది. 400 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. అందరూ ఊహించినట్టుగానే భారీ ఓపెనింగ్స్ ఈ సినిమాకి రాలేదు.
ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందని మేకర్స్ చెబుతున్నప్పటికీ అంత లేదని అర్థమవుతోంది. వాస్తవంగా 140 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసిందని సమాచారం. ఏది ఏమైనా కథ విషయంలో, ప్రొడక్షన్ విషయంలో ఎంతో కాలిక్యులేటెడ్‌గా ఉండే దిల్‌రాజు సైతం ఈ గేమ్ ఆడడంలో తడబడ్డాడు. ఫలితంగా భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడీ సినిమా థియేటర్లను వదిలి ఓటీటీ బాట పట్టింది. ఫిబ్రవరి 7న అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ జరగనుంది. దీనికి సంబంధించి అధికారికంగా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది అమెజాన్ ప్రైమ్. అయితే అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళ్, కన్నడ వెర్షన్స్ మాత్రమే అందుబాటులోకి రాబోతున్నాయి. మరి మిగతా భాషలు ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమ్ అవుతాయో తెలియాల్సి ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



