నేటి నుంచి ఇండస్ట్రీలో షూటింగ్స్ బంద్.. ఆందోళనలో కార్మికులు
on Aug 1, 2022

సోమవారం (ఆగస్ట్ 1) నుంచి తెలుగు చిత్రసీమలో షూటింగ్స్ నిలిచిపోయాయి. మొదట యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ షూటింగ్స్ ఆపాలని నిర్ణయం తీసుకోగా, తర్వాత తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఆగస్ట్ 1 నుంచి షూటింగ్స్ బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. దాంతో సెట్స్ మీదున్న సినిమాల షూటింగ్‌లు ఆగిపోయాయి. అలాగే కొత్త సినిమాల షూటింగ్‌లు వాయిదా పడ్డాయి. కాకపోతే, హైదరాబాద్‌లో ఇతర భాషలకు చెందిన సినిమాల షూటింగ్‌లు మాత్రం కొనసాగుతున్నాయి. ఆదివారం జరిగిన జనరల్ బాడీ మీటింగ్‌లో యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయానికి ఫిల్మ్ చాంబర్ మద్దతు తెలిపింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్న పలు సమస్యలకు పరిష్కారం లభించేదాకా చర్చలు కొనసాగుతాయనీ, అందుకోసం నిర్మాతలందరూ ఐకమత్యంగా ఉండాలనీ దిల్ రాజు పిలుపునిచ్చారు.
కాగా షూటింగ్స్ బంద్ నిర్ణయంతో సినిమా షూటింగ్‌లపై ఆధారపడి జీవనం సాగిస్తోన్న వేలాది మంది దినసరి కార్మికుల పరిస్థితి అగమ్య గోచరం కానున్నది. దినసరి వేతనాల మీద ఆధారపడి వేలాదిమంది కార్మికులు ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు. షూటింగ్‌లు నిలిచిపోతే వారి ఉపాధికి ఆటంకం కలుగుతుంది. ఇప్పటికే కరోనా కాలంలో షూటింగ్‌లు నిలిచిపోయి, ఉపాధి లేకపోవడంతో వారంతా రోడ్డునపడ్డారు. ఆ చేదు రోజులు మరచిపోక ముందే, ఇప్పుడు నిర్మాతలే షూటింగ్స్‌ను నిరవధికంగా నిలిపివేయడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు.
నిజానికి కార్మికులకు ప్రతినిధిగా వ్యవహరించే ఎంప్లాయీస్ ఫెడరేషన్ కొద్ది రోజుల క్రితం కార్మికుల వేతనాలను పెంచాలనీ, పెంచకపోతే షూటింగ్‌లను బంద్ చేస్తామనీ అల్టిమేటం జారీ చేసింది. ఇప్పుడు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ షూటింగ్‌లను నిలిపివేయాలని నిర్ణయం తీసుకొని షాకిచ్చింది. ఫెడరేషన్ ఇచ్చిన అల్టిమేటంకు ప్రతిగానే గిల్డ్ ఈ నిర్ణయం తీసుకుందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
సెట్స్‌పైన వున్న సినిమాల షూటింగ్స్ అర్ధంతరంగా ఆగిపోవడం వల్ల సదరు నిర్మాతలపై అదనపు భారం పడనుంది. పెద్ద సినిమాల నిర్మాతలకు ఫర్వాలేదు కానీ, చిన్న నిర్మాతలకు ఆర్టిస్టుల డేట్లు వృథా కానుండటంతో ఇబ్బందికర పరిస్థితి ఎదురు కానున్నది. షూటింగ్స్ నిలిపివేయడంతో దాదాపు 30 సినిమాలపై ప్రభావం పడనుంది. దినసరి వేతనాలపై జీవనం సాగించే జూనియర్ ఆర్టిస్టులు, డ్రైవర్స్, లైట్ బాయ్స్, ప్రొడక్షన్ బాయ్స్ ఇబ్బందులు ఎదుర్కోనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



