ఈ వారం నాలుగు సినిమాలు.. తెలుగు హీరోలు వర్సెస్ తమిళ్ హీరోలు!
on Oct 19, 2022

గత శుక్రవారం తెలుగు ప్రేక్షకుల ముందుకు ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ ఒక్క సినిమా కూడా ఆకట్టుకోలేకపోయింది. అక్టోబర్ 15న(శనివారం) విడుదలైన కన్నడ డబ్బింగ్ మూవీ 'కాంతార' మాత్రమే ప్రేక్షకులను అలరిస్తూ మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇక ఈ వారం మరో నాలుగు సినిమాలు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి.
ఈ శుక్రవారం(అక్టోబర్ 21న) నాలుగు చెప్పుకోదగ్గ సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో రెండు తెలుగు సినిమాలు కాగా, రెండు తమిళ్ డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా విజయం చూడని మంచు విష్ణు తాను నటించిన తాజా చిత్రం 'జిన్నా'పనే ఆశలు పెట్టుకున్నాడు. సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ నటించడంతో పాటు రైటర్ గా కోన వెంకట్, మ్యూజిక్ డైరెక్టర్ గా అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రాఫర్ గా ఛోటా కె.నాయుడు పని చేయడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. 'ఢీ' తర్వాత తనకు ఆ స్థాయి విజయాన్ని అందించే చిత్రం 'జిన్నా' అని నమ్ముతున్న విష్ణు భారీగా ప్రమోషన్స్ చేస్తున్నాడు.
ఈ ఏడాది ఇప్పటికే 'అశోకవనంలో అర్జున కళ్యాణం' సినిమాతో ఆకట్టుకున్న విశ్వక్ సేన్ ఇప్పుడు 'ఓరి దేవుడా' చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. తమిళ్ సూపర్ హిట్ ఫిల్మ్ 'ఓ మై కడవులే'కి రీమేక్ గా రూపొందిన ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో విక్టరీ వెంకటేష్ కనువిందు చేయనుండటం విశేషం. సినిమా సినిమాకి వైవిధ్యం చూపిస్తూ విజయాలు అందుకుంటున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ కి వెంకీ మామ తోడవ్వడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి నెలకొంది.
'డాక్టర్', 'డాన్' ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న తమిళ్ హీరో శివకార్తికేయన్ తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు 'ప్రిన్స్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రానికి 'జాతి రత్నాలు' ఫేమ్ అనుదీప్ దర్శకుడు కావడం, ట్రైలర్ ఆకట్టుకోవడంతో 'ప్రిన్స్'పై ప్రేక్షకుల దృష్టి పడింది.
ఇక 'సర్దార్' అనే చిత్రం మరో తమిళ్ హీరో కార్తి కూడా అక్టోబర్ 21 ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కార్తికి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. 'అభిమన్యుడు' ఫేమ్ పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ట్రైలర్ ఆకట్టుకుంది. పైగా ఈ చిత్రాన్ని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేస్తుండటం అందరి దృష్టిని ఆకర్షించింది.
మరి ఈ వారం విడుదలవుతున్న ఈ నాలుగు చిత్రాలలో ఎన్ని చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తాయో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



