ENGLISH | TELUGU  

ప్రభాస్‌ విగ్ చూసి షాక్ అవుతున్న అభిమానులు..!

on Dec 24, 2022

 

సినీ నటులు అనగానే మనం ఏదేదో ఊహించుకుంటాం. కానీ వారు కూడా మనలాంటి సామాన్య మనుషులే. వయసు పైబడే కొద్దీ ఎవరికైనా శారీరకంగా మార్పులు తప్పనిసరిగా వస్తాయి. జుట్టు తెలపడ‌టం, మొహం ముడతలు, జుట్టు ఊడిపోయి బట్ట తల రావడం, ప‌ళ్లు ఊడిపోవ‌డం.. ఇలా చాలా ఉంటాయి. వీటికి సినిమా వారు అతీతులు ఏమీ కాదు. వారేమీ  ఆకాశం నుండి ఊడి పడలేదు. కాబట్టి హీరోలు ఎప్పుడూ అందంగా ఉండాలి.. ప‌ళ్లు ఊడ‌కూడ‌దు.. జుట్టు తెల్లబడకూడదు.. జుట్టు ఊడకూడదు.. మొహం ముడ‌త‌లు  పడకూడదు.. అనుకుంటే వీలు కాదు. వారు ఎప్పుడూ ఎంత వయసు వచ్చినా చక్కని అందంతో కనిపించాల‌ని ఏం లేదు. 

కిందటి తరంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ వంటి వారు కూడా సినిమాలలో విగ్గు ధరించి నిజ జీవితంలో బట్టతలతో కనిపించేవారు. ఇప్పటికీ సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ షూటింగ్ లేని సమయంలో చింపిరి జుట్టు ఉన్న బట్టతలతో, మాసిన తెల్లని గడ్డంతో కనిపిస్తూ ఉంటాడు. నిజానికి తెలుగులో కూడా చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు.. ఇలా చాలామందికి హెయిర్ ప్రాబ్లం ఉందని అంటారు. కొందరు షూటింగ్‌లో ప్యాచ్ అప్ విధానాన్ని వాడుతుంటారు. దాని ద్వారా జుట్టును కవర్ చేస్తూ ఉంటారు. అయితే చాలామంది హీరోలకు ఈ పెట్టుడు జుట్టు సెట్ కావడం లేదు. నాచురల్ లుక్ ఇవ్వడం లేదు. 

నందమూరి బాలకృష్ణ విషయానికి వస్తే ఆయన సౌందర్యప్రియుడు. ఎప్పుడు యవ్వనంగా కనిపించాలని భావిస్తూ ఉంటారు. అందుకే జుట్టు బాగా ఊడిపోయినా కూడా విగ్గుతో క‌నిపిస్తూ ఉంటారు. చాలా అరుదుగా మాత్రమే విగ్గు లేకుండా కనిపిస్తారు. గత కొన్ని చిత్రాలలో ఆయన ఎంచుకున్న విగ్గులు ఆయనకు సరిపడలేదని అభిమానులు అసంతృప్తి పాలయ్యారు. ఎంతో కాలంగా ఆయన సరైన విగ్‌ ఎంచుకోవడంలో విఫలమవుతున్నారు. ఈ మధ్యకాలంలో చూసుకుంటే 'ఒకే ఒక్కడు', 'అఖండ', 'సింహా' వంటి చిత్రాల్లో మాత్రమే ఆయనకు హెయిర్ స్టైల్ సరిగ్గా సూట్ అయింది. ఇక ప్రభాస్ విషయానికొస్తే ప్రభాస్ జుట్టు స‌హ‌జ‌మా, లేదా విగ్గా అనే సందేహాలు ఎప్పటినుంచో ఉన్నాయి. తాజాగా బయటకు వచ్చిన వీడియో దీనిపై పూర్తి క్లారిటీ ఇచ్చేసింది. ఆయన విగ్గు వాడుతున్నారని నిర్ధారించే వీడియోలు సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు  కొడుతున్నాయి. 

ఒక పబ్లిక్ ఈవెంట్ లో పాల్గొన్న ప్రభాస్ జుట్టును హెయిర్ స్టైల్ మేకప్ మ్యాన్ సెట్ చేస్తున్నాడు. అప్పుడు ప్రభాస్ ఆ కుర్రాడితో ఇవన్నీ నువ్వు అక్కడే చేయాలి.. ఇలా బయటకు వచ్చి చేయవద్దని చెప్తాడు. హెయిర్ స్టైలిస్ట్ చేస్తున్న విధానం చూస్తే ఖచ్చితంగా అది విగ్ అని అర్థమవుతుంది. 'మిస్టర్ పర్ఫెక్ట్', 'మిర్చి' వంటి చిత్రాలలో ప్రభాస్ జుట్టు కాస్త పల్చబడింది. 'బాహుబలి' చిత్రం తర్వాత బాగా ఊడిపోయింది. 'బాహుబలి' సిరీస్ కోసం  ఆయన ఐదేళ్లు జుట్టు పెంచుకున్నాడు. ఎంత ఎక్కువగా జుట్టు పెంచితే కొందరిలో అంత తొందరగా ఊడిపోతుంది. ఇది సహజం. 'సాహో' నుంచి ప్రభాస్ విగ్గు వాడుతున్నాడు. 'బాహుబలి 2' తర్వాత ప్రభాస్ లుక్ లో చాలా మార్పు వచ్చింది. ఒక‌నాటి హ్యాండ్సమ్ లుక్కుని కోల్పోయాడు. కళ్ళ కింద వలయాలు, నల్లని మచ్చలు, అస్పష్టమైన వాయిస్ ఇబ్బంది పెడుతున్నాయి. ఎంత ట్రై చేసినా ప్రభాస్ ని అందంగా చూపించలేకపోతున్నారు. 'రాధే శ్యామ్' మూవీలో ప్రభాస్ కనిపించిన తీరు చూసి ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. 

తెలుగు సినీ పరిశ్రమలో అదేమి చిత్రమో గాని చాలామంది హీరోలు తాము నిత్యం యవ్వనంగా ఉండాలని, తమను ప్రేక్షకులు ఎప్పుడు అలాగే ఊహించుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. వయసుకు తగ్గ పాత్రలు చేయరు. అలనాటి అక్కినేని నాగేశ్వరావు విషయానికి వస్తే చాలా తక్కువ వయసులోనే జుట్టు ఊడిపోయింది. కానీ ఆయన అమ్మాయిల రాకుమారుడు. దాంతో విగ్గులతో కాలం నడుపుకొని వచ్చారు. స్వర్గీయ దర్శకుడు క్రాంతి కుమార్ సీతారామయ్యగారి మనవరాలు చిత్రం తీయాలని నిర్ణయించుకొని సీతారామయ్యగా అక్కినేని నాగేశ్వరావు తప్ప ఎవరూ ఆ పాత్రకు హుందాతనం తేలేర‌ని భావించారు. అందుకే అక్కినేని వద్దకు వెళ్లి కాస్త ఈ పాత్ర ఔన్నత్యం, నిండుగా ఉండాలంటే న్యాచురల్ గా బట్టతలతో కనిపించాలని కోరారు. దానికి అక్కినేని నో అని చెప్పారని ఒకానొక ఇంటర్వ్యూలో క్రాంతికుమార్ చెప్పుకొచ్చారు. నేను విగ్గు లేకుండా నటించనని ఏఎన్ఆర్ పట్టుపట్టారట. ఎంతో బతిమాలినా క్రాంతి కుమార్ ఆయన్ని ఒప్పించలేకపోయారు. ఏఎన్నార్ నటించకపోతే అసలు ఆ సినిమానే చేయకుండా పక్కన పెట్టేయాలని తను భావించానని ఆయనే స్వయంగా ఒకసారి చెప్పుకొచ్చారు. చివ‌ర‌కు ఎలాగోలా ఏయ‌న్నార్ ఒప్పుకున్నారు.  

ఏఎన్ఆర్ తరువాత అమ్మాయిల రాకుమారుడు శోభన్ బాబు. ఈయన కూడా వయసు మళ్లిన తర్వాత తన ఆకారం అద్దంలో చూసుకుంటూ నిత్యం బాధపడేవారని చాలామంది చెబుతారు. రోజు అద్దం ముందు కూర్చుని నేను ముసలి వాడిని అయిపోయానని దిగులుపడేవారట. అందుకే ఆ వయసులో ఎక్కువగా సినిమాల్లో నటించడానికి ఆయన ఆసక్తి చూపలేదు. బ‌య‌ట కూడా క‌నిపించేవారు కాద‌ట‌..! తను ఎల్ల‌కాలం మహిళల కలల రాకుమారుడిగా, డ్రీమ్ బాయ్ గా ఉండాలని ఆయన కోరిక. ఇది ప్రకృతి ధర్మం కాదు. అయినప్పటికీ ప్రేక్షకుల దృష్టిలో తాను అందగాడిగానే ఎప్పటికీ ఉండాలని అనుకున్న శోభన్ బాబు నటునిగా తన పరుగును అర్ధంతరంగా ఆపేశారు. మొత్తానికి మన తెలుగు ఇండస్ట్రీలో ఈ తరహా  హీరోలు చాలామంది ఉన్నారు అని చెప్పాలి! 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.