ENGLISH | TELUGU  

'దృశ్యం 2' మూవీ రివ్యూ

on Nov 25, 2021

 

సినిమా పేరు: దృశ్యం 2
తారాగ‌ణం: వెంక‌టేశ్‌, మీనా, న‌దియా, న‌రేశ్‌, సంప‌త్ రాజ్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, స‌త్యం రాజేశ్‌, ష‌ఫీ, కృతిక‌, ఎస్త‌ర్ అనిల్‌, విన‌య్‌వ‌ర్మ‌, పూర్ణ‌, అన్న‌పూర్ణ‌, సుజ వ‌రుణి, రాజ‌శ్రీ నాయ‌ర్‌, సీవీఎల్ న‌ర‌సింహారావు, త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ్‌, చ‌మ్మ‌క్ చంద్ర‌, శిరీష‌, నాయుడు గోపి
క‌థ‌-స్క్రీన్‌ప్లే: జీతు జోసెఫ్‌
మాట‌లు: ర‌మేశ్ సామ‌ల‌
పాట‌లు: చంద్ర‌బోస్‌
మ్యూజిక్: అనూప్ రూబెన్స్‌
సినిమాటోగ్ర‌ఫీ: స‌తీశ్ కురుప్‌
ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంక‌టేశ్‌
ఆర్ట్: రాజీవ్ నాయ‌ర్‌, రాజీవ్ కోవిల‌కోమ్‌
ప్రొడ్యూస‌ర్స్: డి. సురేశ్‌బాబు, ఆంటోనీ పెరంబ‌వూర్‌, రాజ్‌కుమార్ సేతుప‌తి, జాక‌బ్ కె. బాబు
డైరెక్ట‌ర్: జీతు జోసెఫ్‌
బ్యాన‌ర్స్: సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్‌, రాజ్‌కుమార్ థియేట‌ర్స్ ప్రై.లి. మ్యాక్స్ మూవీస్‌
విడుద‌ల తేదీ: 25 న‌వంబ‌ర్ 2021
ప్లాట్‌ఫామ్: అమెజాన్ ప్రైమ్ వీడియో (ఓటీటీ)

ఇదే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో అమెజాన్ ప్రైమ్‌లో డైరెక్ట్‌గా రిలీజై ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన మ‌ల‌యాళం ఫిల్మ్ 'దృశ్యం 2'ను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశార‌నేస‌రికి తెలుగు ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా దాని కోసం ఎదురుచూశారు. ఒరిజిన‌ల్ ఫిల్మ్ 'దృశ్యం' కూడా తెలుగులో రీమేక్ అయ్యి, ఘ‌న విజ‌యం సాధించ‌డం దీనికి కార‌ణం. ఒరిజిన‌ల్‌లో మోహ‌న్‌లాల్ చేసిన పాత్ర‌ను తెలుగు రీమేక్‌లో మ‌రోసారి వెంక‌టేశ్ చేయ‌గా, ఆయ‌న భార్య పాత్ర‌ను మీనా మ‌రోసారి నిల‌బెట్టుకున్నారు. కాక‌పోతే తెలుగు 'దృశ్యం'ను న‌టి శ్రీ‌ప్రియ డైరెక్ట్ చేయ‌గా, 'దృశ్యం 2'ను ఒరిజిన‌ల్ డైరెక్ట‌ర్ అయిన జీతు జోసెఫ్ రూపొందించ‌డం ఇక్క‌డ జ‌రిగిన మార్పు. మ‌ల‌యాళం ఒరిజిన‌ల్ త‌ర‌హాలోనే తెలుగు రీమేక్ సైతం థియేట‌ర్ల‌లో కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్‌లోనే విడుద‌ల‌య్యింది. మ‌రి సినిమా ఎలా ఉందంటే...

క‌థ‌
రాంబాబు (వెంక‌టేశ్‌) త‌న భార్య జ్యోతి (మీనా), కూతుళ్లు అంజు (కృతిక‌), అను (ఎస్త‌ర్‌)ల‌తో హాయిగా జీవ‌నం సాగిస్తుంటాడు. సినిమా హాలును లీజుకు తీసుకొని న‌డుపుతూ, ఎలాగైనా ఒక సినిమా తీయాల‌ని ప్లాన్ చేస్తుంటాడు. దానికి త‌నే స్టోరీ కూడా స‌మ‌కూర్చి, విన‌య్ చంద్ర (త‌నికెళ్ల భ‌ర‌ణి) అనే ఒక సీనియ‌ర్ రైట‌ర్‌తో స్క్రిప్టు రాయిస్తుంటాడు. రాంబాబు ఇంటి ద‌గ్గ‌ర్లోనే రెండేళ్లుగా సంజ‌య్ (స‌త్యం రాజేశ్‌), స‌రిత (సుజ వ‌రుణి) అనే దంప‌తులు నివాసం ఉంటుంటారు. సంజ‌య్ తాగొచ్చి పెళ్లాన్ని తంతుంటే, రాంబాబు, జ్యోతి వెళ్లి అడ్డుకుంటూ, స‌రిత‌ను ఓదారుస్తూ ఉంటారు. ఉన్న‌ట్లుండి ఆరేళ్ల క్రితం నాటి రాంబాబు ఫ్యామిలీ త‌ప్పించుకున్న వ‌రుణ్ హ‌త్య‌కేసులో పోలీసులు మ‌రోసారి ద‌ర్యాప్తు మొద‌లుపెడ‌తారు. ఆ త‌ర్వాత అనూహ్య‌మైన ఘ‌ట‌న‌ల‌ను రాంబాబు కుటుంబం ఎదుర్కొంటుంది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ త‌న కుటుంబాన్ని ర‌క్షించుకుంటాన‌ని శ‌ప‌థం ప‌ట్టిన రాంబాబు ఏం చేశాడు? మ‌రోసారి త‌న కుటుంబాన్ని ఈ ఉప‌ద్ర‌వం నుంచి కాపాడుకున్నాడా?  రాంబాబునూ, అత‌డి కుటుంబాన్నీ బోను ఎక్కించాల‌నుకున్న వ‌రుణ్ త‌ల్లి గీత (న‌దియా), ఐజీ గౌత‌మ్ సాహు (సంప‌త్ రాజ్‌) పంతం నెగ్గిందా? అనేది ఆస‌క్తిక‌రం.

విశ్లేష‌ణ‌
మునుప‌టి 'దృశ్యం' చూసిన‌వాళ్లకు సీక్వెల్‌పై ఆస‌క్తి ఉండ‌టం స‌హ‌జం. జీతు జోసెఫ్ అల్లుకున్న క‌థ‌, క‌థ‌నం 'దృశ్యం 2'కు ఆయువుప‌ట్టు. స‌రికొత్త క‌థ‌, స‌న్నివేశాల‌తో సాధ్య‌మైనంత బిగువైన స్క్రీన్‌ప్లేతో ఈ మూవీని రూపొందించేందుకు అత‌ను ప్ర‌య‌త్నించాడు. నిజానికి ఈ రీమేక్‌కు ఆయ‌న పెద్ద‌గా క‌ష్ట‌ప‌డిందేమీ లేదు. ఆల్రెడీ ఒక‌సారి మ‌ల‌యాళంలో తీసిన సినిమాయే కాబ‌ట్టి, చ‌క‌చ‌కా తెలుగు వెర్ష‌న్ సీన్ల‌ను తీసుకుంటూ పోయాడు. దాదాపు ఒరిజిన‌ల్‌కు కార్బ‌న్ కాపీలాగా ఈ రీమేక్‌ను ఆయ‌న తీశాడు. 

స‌హ‌జంగా ఒక హ‌త్య‌ చేసిన‌వాళ్లు చ‌ట్టానికి దొర‌క్క‌పోయినా.. అందులో త‌మ త‌ప్పుకంటే ఎదుటివాళ్ల త‌ప్పు ఎక్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ.. ఎలాంటి మాన‌సిక వేద‌న‌ను అనుభ‌విస్తుంటార‌నే విష‌యాన్ని మ‌రోసారి 'దృశ్యం 2'లో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు ఆవిష్క‌రించాడు ద‌ర్శ‌కుడు. రాంబాబు భార్య జ్యోతి, పెద్ద‌కూతురు అంజు.. ఆనాటి ఘ‌ట‌న‌ను మ‌ర్చిపోలేక న‌ర‌క‌యాత‌న‌ను అనుభ‌విస్తుండ‌టం, పోలీస్ జీపు సైర‌న్ వినిపించినా, పోలీస్ జీపు లేదా పోలీసు క‌నిపించినా అంజు వ‌ణికిపోవ‌డం, బాధను పంటిబిగువున అదిమిపెట్టి ఎప్ప‌టిక‌ప్పుడు రాంబాబు వారికి ధైర్యం చెప్తుండ‌టం.. ఆడియెన్స్‌కు క‌నెక్ట‌య్యే విష‌యాలు. ఈసారి జ్యోతి నుంచి అప్పుడు జ‌రిగిన విష‌యాలు రాబ‌ట్ట‌డానికి కొత్త‌గా రెండు పాత్ర‌ల్ని సృష్టించారు. వాటివ‌ల్ల క‌థ‌నానికి ప‌ట్టు దొరికింది. 

దాంతో పాటు పోలీసుల‌కే కాదు, ఆడియెన్స్‌ ఊహ‌కు కూడా అంద‌ని రీతిలో రాంబాబు వేసే ఎత్తులు ఆక‌ట్టుకున్నాయి. అత‌ని మీదా, అత‌ని ఫ్యామిలీ మీదా ఆడియెన్స్‌కు ఉన్న సింప‌తీ వ‌ల్ల రాంబాబు చేసే ప‌నుల్లో ఎలాంటి త‌ప్పూ లేద‌నిపిస్తుంది. సినిమా స‌క్సెస్‌కు ఇదే మూలం. త‌మ కొడుకు హ‌త్య‌కు గురైనా, ఆ హ‌త్య రాంబాబు కుటుంబం చేసింద‌ని తెలిసినా, దాన్ని ప్రూవ్ చేయ‌లేని నిస్స‌హాయ స్థితిలో గీత ఫ్ర‌స్ట్రేష‌న్‌కు గురై రాంబాబుపై చేయి చేసుకోవ‌డంలో అస‌హ‌జం ఏమీ క‌నిపించ‌దు. ప‌క‌డ్బందీగా రాంబాబు వేసిన ఎత్తుల‌కు సీనియ‌ర్ సినిమా రైట‌ర్ అయిన విన‌య్ చంద్ర అవాక్క‌వ‌డం అతిశ‌యోక్తి అనిపించ‌దు.

స‌తీశ్ కురుప్ సినిమాటోగ్ర‌ఫీ, అనూప్ రూబెన్స్ బ్యాగ్రౌండ్ స్కోర్ ద‌ర్శ‌కుడి ఊహ‌కు అనుగుణంగా చ‌క్క‌గా కుద‌ర‌డం వ‌ల్ల ఒక చ‌క్క‌ని థ్రిల్ల‌ర్ చూసిన ఫీలింగ్ క‌లుగుతుంది. ర‌మేశ్ సామ‌ల డైలాగ్స్ స‌న్నివేశాన్ని డామినేట్ చేయ‌కుండా సంద‌ర్భానుసారం సాగాయి. మార్తాండ్ కె. వెంక‌టేశ్ అతి సునాయాసంగా త‌న ప‌ని చేసుకుపోయారు. 

న‌టీన‌టుల ప‌నితీరు
ఇది ద‌ర్శ‌కుడి సినిమా మాత్రమే కాదు, ఆర్టిస్టుల సినిమా కూడా. మొద‌టి సినిమా త‌ర‌హాలోనే ఈ సీక్వెల్‌లోనూ రాంబాబు, జ్యోతి పాత్ర‌ల‌ను వెంక‌టేశ్‌, మీనా సూప‌ర్బ్‌గా చేశారు. ఒక‌వైపు స‌ర‌దా మ‌నిషిగా క‌నిపిస్తూ, మ‌రోవైపు త‌న కుటుంబం ఎదుర్కొంటున్న పెయిన్‌ను త‌నూ అనుభ‌విస్తూ, వారికి ఏ క‌ష్టం క‌ల‌గ‌కుండా చూసుకోవాల‌నే బాధ్య‌త‌ను మోస్తూ, హ‌త్య‌కేసులో చిక్క‌కుండా ఉండ‌టానికి ప‌థ‌క ర‌చ‌న చేస్తూ వుండే రాంబాబులోని భిన్న ఎమోష‌న్స్‌ను వెంక‌టేశ్ త‌న‌దైన త‌ర‌హాలో మ‌రోసారి ఉన్న‌త స్థాయిలో ప్ర‌ద‌ర్శించారు. జ్యోతిలోని అమాయ‌క‌త్వాన్నీ, ఒక త‌ల్లి ఆందోళ‌న‌నీ మీనా ఎంత చ‌క్క‌గా చూపించింది! అంజు, అను పాత్ర‌ల్లో మ‌రోసారి కృతిక‌, ఎస్త‌ర్ ఒదిగిపోయారు. వ‌రుణ్ త‌ల్లితండ్రులు గీత‌, ప్ర‌భాక‌ర్ పాత్ర‌ల్లో తిరిగి న‌దియా, న‌రేశ్ క‌నిపించారు. ఐజీ గౌత‌మ్‌గా సంప‌త్‌రాజ్, సీఐగా విన‌య్‌వ‌ర్మ‌, జ‌నార్ద‌న్‌గా ష‌ఫీ త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేకూర్చారు. ట్విస్ట్ ఉండే పాత్ర‌ల్లో కనిపించి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు స‌త్యం రాజేశ్‌, సుజ. సినీ రైట‌ర్ విన‌య్ చంద్ర క్యారెక్ట‌ర్‌కు త‌నికెళ్ల భ‌ర‌ణి యాప్ట్ చాయిస్‌.

తెలుగువ‌న్ ప‌ర్‌స్పెక్టివ్‌
నెమ్మ‌దిగా క‌థ‌ను మొద‌లుపెట్టి, క్ర‌మ‌క్ర‌మంగా ఆస‌క్తిని పెంచుతూపోయి, చివ‌ర‌కు వ‌చ్చేస‌రికి ఉత్కంఠ‌ను పెంచేసి, అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచే విధంగా ముగిసిన 'దృశ్యం 2' ఆడియెన్స్‌ను డిజ‌ప్పాయింట్ చెయ్య‌దు. వెంక‌టేశ్‌, మీనా త‌మ ప‌ర్ఫార్మెన్స్‌ల‌తో ఈ సినిమాను మ‌రో స్థాయికి తీసుకెళ్లారు.

రేటింగ్: 3/5

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.