మంచు కుటుంబంలో పేలిన అగ్నిపర్వతం!
on Mar 24, 2023
మంచు సోదరులు విష్ణు, మనోజ్ మధ్య విభేదాలు తలెత్తాయని కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. ఇటీవల మనోజ్ పెళ్ళికి విష్ణు చుట్టపుచూపుగా వచ్చి వెళ్లడంపై కూడా పలు అనుమానాలు రేకెత్తాయి. ఇక తాజాగా మనోజ్ తన అన్న విష్ణు దౌర్జన్యం చేస్తున్నాడని తెలిపేలా విడుదల చేసిన వీడియో ఒకటి సంచలనంగా మారింది. ఈ వీడియోతో అన్నదమ్ముల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉందనే విషయం అర్థమవుతోంది.
తాజాగా మనోజ్ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో మనోజ్ సన్నిహితుడు సారధి ఇంటికెళ్ళి విష్ణు గొడవపడుతున్నట్లుగా ఉంది. అంతేకాదు బ్యాక్ గ్రౌండ్ లో "ఇలా ఇళ్ళకెళ్ళి మా వాళ్ళని కొడుతుతుంటాడు.. ఇది పరిస్థితి" అంటూ మనోజ్ వాయిస్ వినిపిస్తోంది. తరువాత ఏం జరిగిందో ఏం గానీ, మళ్ళీ కాసేపటికే మనోజ్ ఆ వీడియోని డిలీట్ చేశాడు. అయితే అప్పటికే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు తన మనుషులపై దాడికి ప్రయత్నించిన సోదరుడు విష్ణుపై మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యాడని కూడా వార్తలొస్తున్నాయి.
ఇదిలా ఉంటే అసలు ఈ వీడియో నిజమేనా? లేక ప్రాంక్ చేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఓ సినిమా వేడుకలో కమెడియన్ ధనరాజ్ పై మనోజ్ ప్రాంక్ చేశాడు. అప్పట్లో అది నిజమని అందరూ నమ్మారు. ఇప్పుడు కూడా మనోజ్ అలా ఏమైనా ప్రాంక్ చేస్తున్నాడా అని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇది ప్రాంక్ లా అనిపించడంలేదని కామెంట్స్ చేస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
