ENGLISH | TELUGU  

ఇది అవసరమా.. బన్నీతో పోల్చి ఎస్‌.వి.రంగారావు పరువు తీసిన సుకుమార్‌!

on Feb 10, 2025

లెజెండరీ యాక్టర్స్‌ కొందరే ఉంటారు. వారి అడుగు జాడల్లో ఆ తర్వాతి తరం నటీనటులు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటారు. అలాంటి లెజెండ్స్‌ని ఆదర్శంగా తీసుకోవాలి తప్ప వారితో తమను పోల్చుకునే పొరపాటు ఏ నటుడూ చెయ్యకూడదు. ఇది అందరికీ తెలిసిన సత్యం. అలా ఎవరైనా తమను ఆ లెజెండ్స్‌తో పోల్చినా నవ్వి ఊరుకోవాలి తప్ప ఆ పోలికను తమకు ఆపాదించుకోకూడదు. కానీ, ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఉన్న కొందరు నటీనటులు ఆ సాహసానికి కూడా పాల్పడుతున్నారు. ‘పుష్ప2’ చిత్రానికి సంబంధించి జరిగిన థాంక్యూ మీట్‌లో ఇలాంటి దారుణం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్‌ సుకుమార్‌ భజన కార్యక్రమం మొదలుపెట్టాడు. అల్లు అర్జున్‌ని ఎన్ని రకాలుగా పొగడాలో అన్ని రకాలుగా పొగిడాడు. అయితే అది ఆయన వ్యక్తిగత విషయం, బన్నీతో చాలా సినిమాలకు పనిచేసి ఉన్నాడు కాబట్టి ఒకరికొరు ఆత్మీయులు కావచ్చు. కానీ, బన్నీని పొగిడే క్రమంలో లెజెండరీ యాక్టర్‌ ఎస్‌.వి.రంగారావు ప్రస్తావన తీసుకొచ్చారు. 

అల్లు అర్జున్‌ ‘పుష్ప’ చిత్రంతో జాతీయ ఉత్తమ నటుడు అనిపించుకున్నాడు. అది ఎవ్వరూ కాదనలేని విషయం. అతని నటన గురించి అందరికీ తెలిసిందే. ఏ క్యారెక్టర్‌ అయినా అద్భుతంగా చేస్తాడు, తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాడు. అంతవరకు ఓకే. కానీ, అతని నటనను మరొకరితో పోల్చి చెప్పడం అనేది ఈ ఈవెంట్‌లో అందర్నీ బాధించిన అంశం. అయితే అది తన అభిప్రాయం కాదని, తనతో వయసులో పెద్దవారైన వారు అన్నారని చెప్పుకొచ్చారు. ఒక సెలబ్రిటీ కనిపిస్తే వారు చేసిన సినిమాల గురించి పొగడాలి, అందులో నటించిన నటీనటుల గురించి గొప్పగా చెప్పాలని ఎవరికైనా ఉంటుంది. అలా ఓ ఇద్దరు పెద్ద మనుషులు సుకుమార్‌ని కలిసినపుడు ‘బన్నీ ఎస్వీ రంగారావులాంటి నటుడు. ఈ సినిమా చూసిన తర్వాత ఆయనలాంటి పెర్‌ఫార్మర్‌ మళ్లీ దొరికాడు అనిపించింది’ అని ఒకరు అంటే, మరొకరు ‘ఎస్వీఆర్‌ డాన్సులు, ఫైట్స్‌ చేయరు కదండీ’ అని మరొకరు వత్తాసు పలికారట. అయితే ఈ విషయాన్ని ఒక పబ్లిక్‌ ఫంక్షన్‌లో సుకుమార్‌ ప్రస్తావించడం ఎంత వరకు సబబు అని అందరూ ప్రశ్నిస్తున్నారు. అలాంటి కాంప్లిమెంట్స్‌ వచ్చినపుడు వాటిని అందరి దృష్టిలోకి తీసుకెళ్లడం మంచిది కాదని సుకుమార్‌ ఆలోచించాలి. ఇలాంటి సున్నితమైన అంశాలు తన దగ్గరికి వచ్చినపుడు వాటిని మనసులోనే పదిలపరుచుకోవాలి. కానీ, సుకుమార్‌ అలా చేయలేదు. తన భజనలో భాగంగా ఈ కాంప్లిమెంట్స్‌ని చేర్చారు. అయితే ఒకటికి రెండు సార్లు తనను అపార్థం చేసుకోవద్దని, వీటిని సీరియస్‌గా తీసుకోవద్దని చెప్పారు. 

బన్నీతో ఎస్‌.వి.రంగారావును పోల్చడం అనేది లైట్‌గా తీసుకునే వ్యవహారం కాదని సుకుమార్‌కి కూడా తెలుసు. అయినా వేదికపై ఈ విషయాన్ని ప్రస్తావించి అభాసుపాలయ్యారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న నటీనటుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటనపరంగాగానీ, డైలాగులు పలికే విధానంలోగానీ పాతతరం నటీనటులతో వీరిని పోల్చలేం. కొందరు నటులు ‘ల’కి, ‘ళ’కి ఉన్న తేడాను కూడా గుర్తించకుండా డైలాగులు చెప్పేస్తారు. ఈ విషయంలో డైరెక్టర్లు కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పరు. అలాంటప్పుడు లెజెండరీ యాక్టర్స్‌తో వీరిని ఎలా పోలుస్తారు? పాతతరం నటీనటులను గౌరవించాలి, వారిని ఏ విధంగానూ అవమానించకూడదు అనే ఆలోచన ఈ తరం నటీనటులకు, డైరెక్టర్లకు, నిర్మాతలకు ఉండాలి.

పాత తరం నటుల్లో ఎస్‌.వి.రంగారావు శకం ఓ సువర్ణాధ్యాయం అని చెప్పాలి. అతని సహనటులైన ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ నటనపరంగా ఆయనతో పోటీ పడాలని చూసేవారు. కానీ, అది సాధ్యం కాలేదని ఆ తర్వాతి రోజుల్లో వారే స్వయంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఏ కళాకారుడైనా చనిపోతే.. ఆయన లేని లోటు తీర్చలేనిది అనడం సర్వసాధారణం. కానీ, ఎస్వీ రంగారావు ఆ మాటకు నూటికి నూరుపాళ్ళు అర్హులు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయన పోషించని పాత్రలేదు. పౌరాణికాల నుంచి సాంఘికాల వరకు ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి నటనలో తనకెవరూ సాటికాదు అని మహామహులు ఉన్న ఆరోజుల్లోనే నిరూపించుకున్న గొప్ప నటుడు ఎస్వీ రంగారావు. ‘ఎస్వీ రంగారావు తెలుగు వాడిగా పుట్టడం మన అదృష్టం, అది ఆయన దురదృష్టం’ అని సహనటుడు గుమ్మడి వ్యాఖ్యానించడం నటుడిగా ఆయన పట్ల ఉన్న గౌరవాన్ని సూచిస్తుంది. అంతేకాదు, ఎస్‌.వి.రంగారావు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నారుగానీ, అదే హాలీవుడ్‌లో ఉండి ఉంటే ఎన్నో ఆస్కార్‌లు సాధించేవారని ఎంతో మంది ప్రముఖులు ఆయనపై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అలాంటి మహానటుడిని అవమానించడం ద్వారా దర్శకుడు సుకుమార్‌ బోలెడంత పాపాన్ని మూటకట్టుకున్నాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.