కంగన భాగోతాన్ని బయటపెట్టారు!
on Jan 28, 2019

ఎన్టీఆర్ బయోపిక్ కోసమే ఝాన్సీ రాణీ లక్ష్మీబాయి బయోపిక్ 'మణికర్ణిక' దర్శకత్వ బాధ్యతలను క్రిష్ పక్కన పెట్టాడా? కంగనా రనౌత్‌కి, క్రిష్‌కి మధ్య గొడవలు ఏమైనా జరిగాయా? 'మణికర్ణిక'లో క్రిష్ దర్శకత్వం వహించిన సన్నివేశాలు ఎన్ని? కంగనా రనౌత్ దర్శకత్వం వహించిన సన్నివేశాలు ఎన్ని? నిన్న మొన్నటి వరకూ ప్రేక్షకుల మదిలో ఎన్నో ప్రశ్నలు! వాటన్నిటికీ నెమ్మదిగా సమాధానాలు ఇస్తున్నారు క్రిష్. 'మణికర్ణిక' విడుదల తరవాత ఆయన నోరు విప్పారు. అసలు ఏం జరిగిందో చెప్పారు. కంగన భాగోతాన్ని బయటపెట్టారు!
'మణికర్ణిక' చూశానని, అందులో 70 శాతానికి పైగా చిత్రానికి తానే దర్శకత్వం వహించానని క్రిష్ తెలిపారు. తాను చిత్రాన్ని మధ్యలో వదిలేయలేదని, గతేడాది జూన్ నెలకు షూటింగ్, కంగనా రనౌత్ మినహా మిగతా పాత్రలకు సంబంధించిన డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేశానని ఆయన అన్నారు.
ఫస్ట్ కాపీ చూసిన కంగన కొన్ని మార్పులు కోరితే చేయడానికి అంగీకరించానని, అయితే చరిత్రకు విరుద్ధంగా సోనూ సూద్ పోషించిన సదాశివరావు పాత్రను విశ్రాంతికి ముందు చెంపేయాలనే మార్పుకు అంగీకరించలేదని.. అందువల్ల, తనను దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పించి కంగనా రనౌత్ చేపట్టారని క్రిష్ వివరించారు. సోనూ సూద్ కూడా ఆ మార్పుకు అంగీకరించకపోవడంతో అతణ్ణి తప్పించి మరో నటుడి చేత ఆ పాత్రను చిత్రీకరించారని ఆయన తెలిపారు. కంగనా రనౌత్ కు చిత్ర సహానిర్మాత కమల్ జైన్ మద్దతు పలికారని అన్నారు.
"నేను బంగారం లాంటి చిత్రాన్ని తీస్తే దాన్ని కంగనా రనౌత్ వెండిగా మార్చింది" అని క్రిష్ అన్నారు. సినిమాలో వివాదాస్పదమైన 'దాన్ కిలా' గీతాన్ని తాను తెరకెక్కించలేదని ఆయన తెలిపారు. అలాగే, లక్ష్మీబాయి చరిత్రలో ముఖ్యమైన తాంతియా తోపే పాత్రతో మరికొన్ని పాత్రల నిడివి కంగనా రనౌత్ తగ్గించారని క్రిష్ ఆరోపించారు. తెలుగు సినిమాకు తీసుకునే పారితోషకంలో సగమే సినిమాకు తీసుకున్నానని అన్నారు. క్రిష్ మాట్లాడుతున్న అంశాలపై కంగనా రనౌత్ ఇప్పటివరకూ స్పందించలేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



