అప్పుడు షారుఖ్ తో ఫోటో దిగానంటే నవ్వారు.. ఇప్పుడేకంగా షారుఖ్ తో సినిమా చేశాడు
on Jul 13, 2023

మన ప్రయాణంలో ఎన్నో అవమానాలు ఎదురవుతుంటాయి. వాటిని చిరునవ్వుతో దాటుకుంటూ ఒక్క మెట్టు ఎక్కుతూ, మనల్ని అవమానించిన వాళ్ళే మన గెలుపుని చూసి చప్పట్లు కొట్టేలా ఉన్నత స్థాయికి చేరుకోవాలి. ఈ మాట కోలీవుడ్ దర్శకుడు అట్లీ కుమార్ కి సరిగ్గా సరిపోతుంది.
అది 2013, మే 14. అప్పటికి ఇంకా అట్లీ డైరెక్ట్ చేసిన మొదటి సినిమా 'రాజా రాణి' కూడా విడుదల కాలేదు. 'షారుఖ్ ఖాన్ సార్ తో నేను' అంటూ అట్లీ సోషల్ మీడియాలో ఒక ఫోటోని షేర్ చేశాడు. అది చూసి కొందరు ఎడిటెడ్, ఫోటోషాప్ అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. ఆ తర్వాత అదే ఏడాది సెప్టెంబర్ లో 'రాజా రాణి' సినిమా విడుదలై దర్శకుడిగా అట్లీ ప్రతిభను తెలియజేసింది. అనంతరం 'తేరి', 'మెర్సల్', 'బిగిల్' వంటి వరుస విజయాలతో కోలీవుడ్ లో అగ్ర దర్శకుల్లో ఒకడిగా ఎదిగాడు. ఇప్పుడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ తో 'జవాన్' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. పదేళ్ల క్రితం షారుఖ్ తో ఫోటో దిగానని అట్లీ అంటే కొందరు నవ్వారు. ఇప్పుడు అదే షారుఖ్ తో సినిమా చేసి ట్రైలర్ తోనే దేశవ్యాప్తంగా సంచనలనం సృష్టిస్తున్నాడు. దీంతో 'అట్లీ 10 ఇయర్స్ ఛాలెంజ్' అంటూ ఆయనను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పలువురు పోస్ట్ లు పెడుతున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



