హాయ్ నాన్న.. మృణాల్ ది తల్లి పాత్ర కాదా!
on Jul 13, 2023
ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే నేచురల్ స్టార్ నాని 30వ సినిమాకి 'హాయ్ నాన్న' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈరోజు(జూలై 13) ఉదయం టైటిల్ తో కూడిన పోస్టర్ తో పాటు గ్లింప్స్ ను విడుదల చేశారు.
ఈ ఏడాది 'దసరా'తో ఘన విజయాన్ని అందుకున్న నాని తన 30వ సినిమాని నూతన దర్శకుడు శౌర్యవ్ తో చేస్తున్నాడు. 'దసరా'లో ఊర మాస్ గా కనిపించిన నాని, ఇందులో క్లాస్ గా కనిపించనున్నాడు. 'నాని 30' అనౌన్స్ మెంట్ వీడియో వచ్చినప్పుడే ఇది తండ్రీకూతుళ్ల కథ అని అర్థమైంది. అందుకు తగ్గట్టుగానే కథకు సరిపోయేలా ఈ సినిమాకి 'హాయ్ నాన్న' అనే టైటిల్ ఎంపిక చేసినట్లు ప్రచారం జరిగింది. మధ్యలో 'హలో డాడీ', 'హలో నాన్న' టైటిల్స్ కూడా వినిపించినప్పటికీ.. చివరికి 'హాయ్ నాన్న' కే ఓటేశారు.
టైటిల్ అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్, గ్లింప్స్ ఆకట్టుకుంటున్నాయి. పోస్టర్ లో పాప నాని భుజాలపై కూర్చొని, మృణాల్ ఠాకూర్ ఫ్లైయింగ్ కిస్ ఇస్తుండటం క్యూట్ గా ఉంది. గ్లింప్స్ కూడా టైటిల్ కి తగ్గట్టుగానే క్లాసీగా ఉంది. పాప తన ఫ్రెండ్ అంటూ మృణాల్ ని, నాన్న అంటూ నానిని పరిచయం చేయడం.. నాని-మృణాల్ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం మెప్పించింది.
వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటిస్తుండగా, నాని కూతురి పాత్రలో బేబీ కియారా ఖన్నా నటిస్తోంది. డిసెంబర్ 21 న తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
