దిల్ రాజుకు కొడుకు పుట్టాడు
on Jun 29, 2022

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు 51 ఏళ్ల వయసులో మరోసారి తండ్రయ్యారు. ఆయన భార్య వైఘా రెడ్డి ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో పండంటి కుమారుడ్ని ప్రసవించింది. తల్లీ, శిశువూ.. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. 2017లో మొదటి భార్య అనిత గుండెపోటుతో మృతి చెందాక, 2020లో తనకంటే వయసులో చాలా చిన్నదైన తేజస్విని అలియాస్ వైఘా రెడ్డిని రాజు రెండో వివాహం చేసుకున్నారు. ఆయన అసలు పేరు వెంకటరమణా రెడ్డి.
మొదటి భార్య ద్వారా ఆయనకు హన్షితా రెడ్డి అనే కుమార్తె ఉంది. ఆమెకు వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. కొంతకాలంగా హన్షిత కూడా రాజు సినిమాలకు సంబంధించిన ప్రొడక్షన్ వ్యవహారాల్లో పాలుపంచుకుంటున్నారు.
ఎగ్జిబిటర్‌గా కెరీర్ ప్రారంభించిన దిల్ రాజు అనతి కాలంలోనే డిస్ట్రిబ్యూటర్‌గా మారి, 'దిల్' సినిమాతో నిర్మాత అయ్యారు. ఆ తర్వాత పక్కా ప్లానింగ్‌తో వరుసగా హిట్ సినిమాలు తీస్తూ, టాలీవుడ్‌లోని అగ్ర నిర్మాతల్లో ఒకరిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా 'వారసుడు' (వారిసు) అనే ద్విభాషా చిత్రం, శంకర్ డైరెక్షన్‌లో రామ్‌చరణ్ హీరోగా ఓ పాన్ ఇండియా ఫిల్మ్ నిర్మిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



