ఓకే చేసిన 10 స్క్రిప్టులు, షూటింగ్‌లో ఉన్న 2 సినిమాలు ఆపేసిన దిల్ రాజు
on Jul 19, 2022

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తీవ్ర సంక్షోభం నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జూన్‌లో రిలీజైన 'మేజర్' మూవీ తర్వాత ఎన్నో సినిమాలు థియేటర్లలో ఇలా వచ్చి అలా మాయమైపోతున్నాయి. చాలా సినిమాలకు మెయిన్‌టెన్స్ డబ్బు కూడా రాకపోవడంతో షోలు కేన్సిల్ చేస్తూ వచ్చారు. దీనికి తోడు వర్షాల వల్ల థియేటర్లకు వచ్చి సినిమా చూడాలనే ఆలోచనే జనం చేయట్లేదు. స్టార్ల దగ్గరనుంచి టెక్నీషియన్ల దాకా రెమ్యూనరేషన్స్ విపరీతంగా పెరిగిపోవడంతో దానికి అనుగుణంగా మూవీ బడ్జెట్ కూడా తడిసి మోపడవుతోంది. ఓ స్టార్‌తో సినిమా తీద్దామనుకొనే నిర్మాత కనీసం 80 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయల దాకా పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. ఓటీటీ కంటెంట్ కావాల్సినంత అందుబాటులో ఉండటం వల్ల కూడా థియేటర్లకు జనం రావట్లేదు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ వాళ్లు ఎడ్యుకేట్ కావాల్సిన సమయం ఆసన్నమైందని అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు అభిప్రాయపడ్డారు.
నాగచైతన్య హీరోగా ఆయన నిర్మించిన 'థాంక్యూ' మూవీ ఈ నెల 22న థియేటర్లలో విడుదలవుతోంది. విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రాశీ ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చిత్రసీమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆయన మాట్లాడారు. కొవిడ్‌కు ముందు, తర్వాత ఈక్వేషన్స్, జనం మైండ్‌సెట్స్ మారిపోయాయనీ, ఇదివరకు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూద్దామనుకొనే ప్రేక్షకులు, లాక్‌డౌన్ టైమ్‌లో ఇళ్లల్లో కూర్చొని ఓటీటీలో చాలా కంటెంట్ చూశారనీ, దాంతో వాళ్లకు సాధారణంగా ఉంటే కంటెంట్ ఏమాత్రం నచ్చట్లేదనీ అన్నారు. వందల రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని మామూలు కంటెంట్ కోసం థియేటర్లకు వెళ్లాలా అని ఆలోచిస్తున్నారనీ, అందుకే ఇండస్ట్రీ పీపుల్ మారాల్సిన టైమ్ వచ్చిందనీ, ఎలాంటి కంటెంట్ ఇస్తున్నామనేది ఇప్పుడు కీలకమైందనీ ఆయన చెప్పారు.
థియేట్రికల్, నాన్-థియేట్రికల్ ఎకానమీ మారిపోయిందనీ, వాటి గురించి ఎడ్యుకేట్ కావాలనుకుంటున్నామనీ దిల్ రాజు అన్నారు. 'సింహాద్రి', 'తొలిప్రేమ', 'ఫిదా' సినిమాలు జూలైలో వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్స్ అయ్యాయనీ, మంచి సినిమాని ప్రేక్షకులు ఎప్పుడూ చూస్తారనీ అన్నారు. ఆడియెన్స్ మైండ్‌సెట్ మారిపోయినందువల్ల, దాన్నర్థం చేసుకొని, ఇండస్ట్రీ వాళ్లు మారాలనీ ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడు సినిమాలు స్టార్ట్ చెయ్యొద్దని నిర్మాతలకు ఆయన సూచించారు. తాను కూడా 10 స్క్రిప్టులు ఓకే చేసి కూడా వాటిని పెండింగ్‌లో ఉంచాననీ, రెండు సినిమాల షూటింగ్‌లను ఆపేశాననీ వెల్లడించారు.
టికెట్ రేట్ల గురించి మాట్లాడుతూ, ఆ రేట్లు డిస్ట్రిబ్యూటర్‌గా తన చేతిలో ఉండదన్నారు. టికెట్ రేట్లను నిర్మాతే నిర్ణయిస్తాడని చెప్పారు. 'థాంక్యూ' ప్రొడ్యూసర్‌గా తాను టికెట్ రేట్లు తగ్గించి ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. సింగిల్ స్క్రీన్స్‌లో 'థాంక్యూ' సినిమాకు రూ. 100 ప్లస్ జీఎస్టీ, మల్టీప్లెక్స్‌లలో రూ. 150 ప్లస్ జీఎస్టీగా టికెట్ రేట్ పెట్టామన్నారు. మల్టీప్లెక్సులలో రూ. 75 వాటి నిర్వాహకులకు వెళ్తే, తనకు రూ. 75 వస్తుందని చెప్పారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



