'ధమాకా' కోసం అల్లుడిని పక్కన పెట్టేశాం.. దిల్ రాజుతో కూడా వార్ జరిగింది!
on Dec 22, 2022
దర్శకుడు త్రినాధరావు నక్కిన, రచయిత ప్రసన్న కుమార్ కాంబినేషన్ లో 'సినిమా చూపిస్త మావ', 'నేను లోకల్', 'హలో గురు ప్రేమకోసమే' వంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. ఈ మూడు కూడా కామెడీ ప్రధానంగా తెరకెక్కిన సినిమాలే. పైగా వీటిలో మామా అల్లుళ్ళ ట్రాక్ చుట్టూనే ప్రధానంగా కథ తిరుగుతుంటుంది. అయితే 'ధమాకా' కోసం మాత్రం ఆ అల్లుడు ట్రాక్ ని పక్కన పెట్టేశామని దర్శకుడు త్రినాధరావు అంటున్నారు.
మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా త్రినాధరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ధమాకా'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం రేపు(డిసెంబర్ 23న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
దర్శకుడు త్రినాధరావు మాట్లాడుతూ.. "నేను, ప్రసన్న కలిసి చేస్తున్న సినిమాలన్నీ ఒకే జోనర్ లో ఉంటున్నాయని కొందరు అంటున్నారు. కానీ మాకు విజయాలు వస్తున్నాయి కాబట్టి మరికొంతకాలం ఎంటర్టైనర్సే చేయాలి అనుకుంటున్నాం. మా మధ్య ఇప్పటిదాకా స్క్రిప్ట్ విషయంలో తప్ప పర్సనల్ గా ఎప్పుడూ వార్ జరగలేదు. స్క్రిప్ట్ డిస్కషన్స్ అలాగే ఉంటాయి. దిల్ రాజు గారితో కూడా స్క్రిప్ట్ విషయంలో వార్ జరిగిన సందర్భాలు ఉన్నాయి. మంచి స్క్రిప్ట్ తీసుకురావాలన్న ఉద్దేశంతోనే అంతలా చర్చలు జరుగుతుంటాయి. మా ఎనర్జీకి రవితేజ గారి ఎనర్జీ తోడవ్వడంతో ఈ స్క్రిప్ట్ మరో రేంజ్ కి వెళ్ళిపోయింది. మా గత చిత్రాల్లోలాగా ఇందులో అల్లుడు ట్రాక్ ఉండదు. ఈ సినిమా కోసం అల్లుడిని పక్కన పెట్టేశాం. అయినా సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఎక్కడా తగ్గదు. ఇటీవల రవితేజ గారి చిత్రాలలో ఏదైతే మిస్ అయిందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారో.. అది ఈ చిత్రంతో 100 పర్సెంట్ ఇచ్చేస్తున్నాం" అన్నారు.
రచయిత ప్రసన్న కుమార్.. "ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎక్సైట్ చేసే అంశాలు ఎన్నో ఉన్నాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోతుంది. అలాంటి బ్యాంగ్స్ సినిమాలో చాలా ఉంటాయి. రవితేజ గారు సినిమా ఫైనల్ కాపీ చూసి.. డ్యాన్స్ చేయాలి అనిపిస్తుంది అన్నారట. ఈ మధ్య కాలంలో ఎంటర్టైనర్స్ ఎక్కువగా రావట్లేదు. ఆ లోటుని ఈ చిత్రం తీరుస్తుంది. సినిమా చూసి ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. నాది, త్రినాధరావు గారి కాంబినేషన్ ఇలాగే కొనసాగుతుంది" అన్నారు.
శ్రీలీల మాట్లాడుతూ.. "ప్రసన్న గారు నాకు ఈ కథ చెప్పినప్పుడు.. మొదటి పది నిమిషాలు వినగానే ఈ సినిమా చేయాలని డిసైడ్ అయ్యాను. అంత ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. సినిమాతో పాటు నా పాత్ర కూడా అంతే ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. సినిమా చూసి అందరూ ఎంజాయ్ చేస్తారు" అన్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
