ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ.. ఇప్పట్లో లేనట్టే!
on Oct 4, 2023
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో 'దేవర' చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఈ ఏడాది చివరికల్లా దేవర షూటింగ్ పూర్తి చేసి ఆ వెంటనే బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2'తో బిజీ కానున్నాడు. దాని తర్వాత 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా కమిటై ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆ సినిమా ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.
'దేవర' సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటించారు. అంటే దేవర కోసం ఎన్టీఆర్ మరో ఏడాది కేటాయించనున్నాడన్నమాట. 2024, ఏప్రిల్ 5న దేవర మొదటి భాగం విడుదల కానుంది. ఆలోపు ఎన్టీఆర్ 'వార్-2' షూటింగ్ పూర్తి చేసి, ఆ తర్వాత 'దేవర-2' షూటింగ్ లో పాల్గొనే అవకాశముంది. ఇది పూర్తయ్యే సమయానికి 2024 పూర్తయ్యి 2025 కూడా వచ్చేస్తుంది. ఇదే ఇప్పుడు ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పై అనుమానాలు రేకెత్తిస్తోంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ ని 2024, మార్చిలో స్టార్ట్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడది 2025, మార్చికి వెళ్ళిపోయినా ఆశ్చర్యంలేదు.
ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ చేస్తున్నాడు. ఈ సినిమా కూడా రెండు భాగాలుగా రానుంది. సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన 'సలార్-1' డిసెంబర్ 22 కి వాయిదా పడింది. 'సలార్-2' ఎప్పుడొస్తుందో ఇంకా క్లారిటీ లేదు. అటు 'దేవర-2', ఇటు 'సలార్-2' పూర్తయితేనే.. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల ల ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముంది. ఈ ప్రాజెక్ట్ కి 2025 లో మోక్షం కలుగుతుందేమో చూడాలి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
